
ప్రపంచ జనాభాలో మనమే టాప్. ఐక్యరాజ్యసమితి ప్రపంప జనాభా స్థాయీనివేదిక అంచనాల ప్రకారం మన దేశం 142.86 కోట్ల జనాభాతో జన చైనా (142.5 కోట్లు)ను వెనక్కి నెట్టింది. నంబర్ వన్‌గా రికార్డులకెక్కింది. జనరాశిలో ప్రపంచ రికార్డు సృష్టించినంత మాత్రాన సంబరాలు చేసుకునే పరిస్థితిలో దేశముందా ? వలస కార్మికులు, అసంఘటిత కార్మికులకు తిండి గింజలు అందజేసే కార్డులు ఇవ్వండి అని సర్వోన్నత న్యాయస్థానమే పదేపదే చీవాట్లు పెడుతున్నా మీనమేషాలు లెక్కిస్తూ పాలకులు జాప్యం చేస్తున్నారంటే దేశంలో పరిస్థితులు ఎంతటి దయనీయంగా ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు. అందువల్ల జనరాశి కంటే దేశంలో జనోద్ధరణ ఏపాటిగా ఉందో అన్నదే ముఖ్యం.
జనాభాలో మనం వెనక్కు కొట్టిన చైనాతో పోల్చుకుంటే ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం.. చైనా జిడిపి 17.73 ట్రిలియన్ డాలర్లు ఉండగా, మన దేశ జిడిపి 3.18 ట్రిలియన్ డాలర్లకే పరిమితమైంది. నిరుద్యోగిత రేటు దేశంలో 7.7 శాతంగా ఉంటే, చైనాలో మనకంటే మెరుగైన స్థితిలో 4.8 శాతం మాత్రమే ఉంది. వార్షిక ద్రవ్యోల్బణం రేటు (వినియోగదారుల ధరలు) చైనాలో ఒక్క శాతమే ఉండగా, భారత్‌లో 5.1 శాతంతో నిత్యావసరాల ధరలు నిత్యం ఎగబాకుతూనే ఉన్నాయి. తలసరి ఆదాయంలోనూ ఎక్కడో అట్టడుగున 147 స్థానంలో ఉండగా, చైనా 63వ ర్యాంకులో ఉంది. భారతీయుల కంటే చైనీయులు సగటున 5.4 రెట్లు సంపన్నవంతులు. పేదరికం, నాణ్యమైన పాఠశాల విద్య అందకపోవడం, నిరుద్యోగం భారత్‌లో ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. వీటికి పరిష్కారం చూపాల్సిన పాలకులు ఆ పని చేయకుండా ప్రజల మధ్య విద్వేషాలు రాజేయడం, ఒకరి సమస్యలకు ఇంకొకరిని కారణం చూపుతూ చేతులు దులిపేసుకుంటున్నారు.
జన విస్ఫోటనానికి అనుగుణంగా భూమి, నీరు, ఖనిజ వనరులు పెరగవు. అవి పరిమితమైనవి. సహజ వనరులను ప్రజలందరికీ యోగ్యమైనవాటికీ తీర్చిదిద్దాలి. కానీ పెట్టుబడి ఏలుబడిలో నయా ఉదారవాద ఉచ్ఛస్థితిలో సంపదంతా కొద్దిపాటి క్రోనీల ఖాతాల్లో పోగుపడుతోంది. దేశంలో 2012-21 మధ్యకాలంలో ప్రజలందరూ సమిష్టిగా సృష్టించిన సంపదలో 40 శాతం ఒక్క శాతం జనాభా వద్దే కేంద్రీకృతమైంది. 2022లో అదానీల సంపద 46 శాతం పెరిగింది. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లలో 50 శాతం మొత్తం అట్టడుగునున్న 50 శాతం ప్రజల నుంచి పిండుకోగా.. సంపదలో అగ్రభాగంలో ఉన్న 10 శాతం వద్ద నుంచి కేవలం 4 శాతం మాత్రమే వసూలు చేశారు. ఇలా సంపదంతా కేంద్రీకృతం చేస్తున్నందునే పేదరికం, నిరుద్యోగం సహా అన్ని సామాజిక రుగ్మతలూ కోరలు చాస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశంగా భారత్ నవ యవ్వనంతో తొణికిసలాడుతోందంటూ గొప్పలకు పోతే సరిపోదు. వారందరినీ శ్రామిక శక్తిగా తీర్చిదిద్ది సకల జనుల కొనుగోలు శక్తి పెంచితేనే దేశం అభివృద్ధి పట్టాలెక్కేది. సంపద కేంద్రీకరణ కాకుండా ప్రజలందరికీ పంపిణీ జరిగేలా చూస్తేనే దేశం దశ, దిశ మారేది. కానీ పాలకులు చేస్తున్నదేమిటి? దేశ జనాభాలో 68 శాతంగా ఉన్న యువతను విద్యా కాషాయీకరణ వంటి విధానాలతో మతోన్మాదంలో ముంచేసి, నైపుణ్య రహితంగా మార్చేసి కారు చౌకకు దొరికే శ్రమశక్తిగా కార్పొరేట్ దోపిడీకి బలి చేసే విధానాలు అవలంభిస్తున్నారు. మేరా భారత్ మహాన్ అని బిగ్గరగా కేకలు వేస్తే దేశం గొప్ప దేశమైపోదు. 'జనాభా ప్రయోజనాలు సంఖ్యా బలంపై మాత్రమే ఆధారపడి వుండవు. నాణ్యత, సమర్థత మీద ఆధారపడి వుంటాయి' అంటూ జనాభా తగ్గుదలపై చైనా విదేశాంగ మంత్రి వెన్‌బిన్ చేసిన వ్యాఖ్యలు అలోచించదగినవి. 'చైనా జనాభా 140 కోట్ల పైమాటే. ఇందులో శ్రామిక శక్తి సంఖ్య దాదాపు 90 కోట్లు. ప్రజల ప్రయోజనాలు అదృశ్యమైపోలేదు. రోజురోజుకీ వృద్ధి చెందుతూ అభివృద్ధికి ప్రేరణగా నిలుస్తున్నాయి' అని ఆయన పేర్కొన్నారు. రాశి కంటే వాసి ముఖ్యమని పెద్దలు ఏనాడో ఉద్భోదించారు. దేశమంటే మట్టి కాదోరు దేశమంటే మనుషులోరు...తిండి కలిగితే కండ కలదోరు.. కండ కలవాడేను మనిషోరు...అని మహనీయుడు గురజాడ అప్పారావు చేసిన ఉద్బోధ శిరోధార్యం.