Mar 12,2023 14:23

గులాబీపువ్వు అందంపై
ముళ్ళులేని భాషతో
ఏదైనా రాయొచ్చా?
క్రీపర్లోని ఆకుపచ్చ తెలుపు రంగులు
ఆకర్షిస్తాయి కానీ
ఎంతసేపని అలా చూడడం?!

వేపచెట్టు ఈసారి విరగబూసింది.
పూతంతా కాయలై కొమ్మలు కిందికి వంగాయి.
పిట్టగోడపై పడిన వేపపండుకై
గండుచీమ తంటాలు నాకెందుకూ?..
సాండ్విచ్‌ గ్రిల్‌ చేస్తుంటే లోపలినుండీ ఏదోవాసన.
పిల్లలు తిన్నారు కానీ.
నాలో నేనే కమురువాసన..ఎలా అలా?!

కీచురాళ్ళ విరహం
వీధి కుక్కపిల్ల అరుపులో కలిసిపోయాక
చీకటిని నిస్సహాయంగా భరించడమే!
పొద్దున్న చూసిన ఉడుత మళ్ళీ రేపువస్తుందా?
నిద్ర రంగు మెలకువలా ఉండి
రాత్రి బాల్కనీ, కన్ను తెరచుకుని చూస్తోంది.
కవితలన్నీ రెక్కలుకట్టుకుని మిణుక్కుమంటున్నాయి.

గాయమంతా అస్తిత్వం గురించే..
ప్రేమై పూయని బంధాల చెట్లని గురించే..
అవసరాల్లో వేర్లూనుకుని
అనవసరాల్లో పెకిలించబడడం గురించే..
రాసుకుంటూ పోతే అద్యాయాలద్యాయాలూ,..
స్వార్ధం గురించీ...!
చేసుకున్న ప్రమాణాలు నిలువలేదు.
అయిన బంధాలు అవతలకి జరిగిపోయాయి.
అయినా ఎంత ధైర్యం!
గుండె కొట్టుకుంటూనే ఉంది.

అనూరాధ బండి
anuradhabandi2020@gmail.com