Oct 31,2022 10:36
  • అధిక వర్షం ఉన్న దగ్గరే వర్షాభావం
  • సాగు, దిగుబడులపై ప్రతికూలత

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ మారు ఖరీఫ్‌లో దండిగా వర్షాలు కురిసినప్పటికీ వర్షానికి-వర్షానికి మధ్య అంతరాయాలు (డ్రై-స్పెల్స్‌) కూడా గణనీయంగానే నమోదయ్యాయి. వర్షాభావం, డ్రై-స్పెల్స్‌ తీరుతెన్నుల్లో కొత్త ధోరణి కనిపిస్తోంది. వర్షాలు పడని కారణంగా దాదాపు దశాబ్దకాలంగా రాయలసీమను ఎడారి సీమగా పిలుస్తూ వచ్చారు. మూడేళ్ల నుంచి సీమలో సీజన్‌ మొత్తమ్మీద సగటున నార్మల్‌ కంటే అధిక, అత్యధిక స్థాయిలో వానలు పడుతున్నాయి. అక్కడే ఒక్కో నెలలో వర్షాభావ, డ్రై-స్పెల్‌ మండలాలూ నమోదవుతున్నాయని ప్రభుత్వ గణాంకాలే తెలుపుతున్నాయి. ఖరీఫ్‌ మొత్తమ్మీద కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో అధిక, అత్యధిక వర్షపాతం నమోదుకాగా అక్కడే రాష్ట్రంలోనే గరిష్టంగా డ్రై-స్పెల్‌ మండలాలూ ఉన్నాయి. సీజన్‌ ముగిసే సెప్టెంబర్‌ నెలాఖరుకు 273 మండలాల్లో ఏదోక స్థాయిలో డ్రై-స్పెల్స్‌ నెలకొన్నాయి. 228 మండలాల్లో సింగిల్‌, 43 మండలాల్లో డబుల్‌, రెండు మండలాల్లో ట్రిపుల్‌ డ్రై-స్పెల్స్‌ నమోదయ్యాయి. డ్రై-స్పెల్స్‌ వలన అదనుకు నీరు అందక పంటలకు నష్టం జరుగుతుంది. ఆ వారా పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పంటలకు తెగుళ్లు వ్యాపిస్తాయి. వర్షాభావం, డ్రై-స్పెల్‌, పంటల సాగు, పంట నష్టం, సాగునీటి వసతి ఆధారంగా కరువు మండలాలను గుర్తిస్తారు. కానీ ప్రభుత్వర మూడేళ్లుగా సగటు వర్షం లెక్కలను ఆధారం చేసుకొని, సీజన్‌లో ఎప్పుడోప్పుడు పడే వర్షాన్ని చూపించి కరువు మండలాలను ప్రకటించట్లేదు. అదనుకు వానలు పడక, తర్వాత కురిసిన భారీ వర్షాలు రెండు విధాలా రైతులు నష్టపోతున్నారు. వాతావరణ మార్పుల వలన అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతోందని, ప్రభుత్వం శాస్త్రీయంగా అధ్యయనం చేసి బాధితులను ఆదుకోవాల్సి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

                                                                          వర్షం తీరుతెన్నులు

జూన్‌లో రాష్ట్రంలో సగటున సాధారణం కంటే 12.7 శాతం ఎక్కువ వర్షం పడింది. వైఎస్‌ఆర్‌, సత్యసాయి జిల్లాల్లో అత్యధిక వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 42 మండలాల్లో అత్యల్ప, 155 మండలాల్లో తక్కువ వర్షం నమోదైంది. జులైలో రాష్ట్రంలో సగటున నార్మల్‌ కంటే 6.7 శాతం ఎక్కువ వర్షం పడింది. అయినప్పటికీ 221 మండలాల్లో వర్షాభావం నెలకొంది. వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో తక్కువ వర్షం కురిసింది. ఎపి వ్యాప్తంగా 135 డ్రై-స్పెల్‌ మండలాలుండగా వైఎస్‌ఆర్‌ 18, సత్యసాయి 16, అన్నమయ్య 11 మండలాల్లో డ్రై-స్పెల్‌ నెలకొంది. ఆగస్టులో రాష్ట్రంలో సగటున నార్మల్‌ కంటే 8.6 శాతం ఎక్కువ వర్షం పడింది. 286 మండలాల్లో వర్షాభావం ఉంది. వైఎస్‌ఆర్‌ 15, సత్యసాయి 14 మండలాల్లో డ్రై-స్పెల్‌ ఉంది. ఎపి వ్యాప్తంగా చూస్తే 200 మండలాల్లో సింగిల్‌, 26 మండలాల్లో డబుల్‌ డ్రై-స్పెల్స్‌ నమోదయ్యాయి. ఇక సెప్టెంబర్‌లో రాష్ట్రంలో సగటున నార్మల్‌ వర్షంలో 0.2 శాతం తక్కువ వర్షం పడింది. ఆ నెలలో 252 మండలాల్లో వర్షాభావం ఉంది. అప్పటికి 228 మండలాల్లో సింగిల్‌, 43 మండలాల్లో డబుల్‌, రెండు మండలాల్లో ట్రిపుల్‌ డ్రై-స్పెల్స్‌ నమోదయ్యాయి.
 

                                                                       మూడు వారాల అంతరం

ఎక్కడేకాని వర్షం నుంచి వర్షానికి మధ్య మూడు వారాలు, అంతకంటే ఎక్కువ వ్యవధి ఉంటే డ్రై-స్పెల్‌గా ప్రభుత్వం చెపుతుంది. సీజన్‌ మొత్తమ్మీద జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు 273 డ్రై-స్పెల్స్‌ నమోదయ్యాయి. వాటిలో సింగిల్‌తో పాటు డబుల్‌, ట్రిపుల్‌ కూడా ఉన్నాయి. ఎపిలో 679 మండలాలుండగా 40 శాతం మండలాల్లో డ్రై-స్పెల్స్‌ నమోదయ్యాయని ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి.