
- చిక్కుకున్నది 41మంది కార్మికులు
- కొండ పై నుండి డ్రిల్లింగ్‌కు అవకాశం?
ఉత్తరకాశి : పాక్షికంగా కూలిపోయిన సిల్క్‌యారా సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే ఆపరేషన్ శుక్రవారం నుండి నిలిచిపోయింది. కొత్తగా అమెరికా తయారీ యంత్రాన్ని తెప్పించి దాంతో డ్రిల్లింగ్ చేపడుతుండ గా, అందులో యాంత్రిక లోపం తలెత్తింది. దాంతో ఇండోర్ నుండి మరో డ్రిల్లింగ్ యంత్రాన్ని తెప్పించారు. శనివారం సంఘటనా ప్రాంతానికి చేరుకున్న ఈ యంత్రానికి గల మూడు విడిభాగాలను బిగిస్తున్నారు. ఆ తర్వాత డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని అధికారులు చెప్పారు. ఇదిలావుండగా గత ఆదివారం నుండి సొరంగంలో చిక్కుకుపోయిన వారి సంఖ్య 41గా సొరంగ నిర్మాణ కంపెనీ అధికారులు సవరించారు. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనడానికి ఇతరత్రా మార్గాలు, పద్దతులు ఏమైనా వున్నాయా అని అధికారులు ఆలోచిస్తు న్నారు. ఇందులో భాగంగా నిపుణుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. సహాయక చర్యలను సంఘటనా స్థలంలోనే సమీక్షించేందుకు కేంద్రం నుండి అధికారులు కూడా వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం పని నిలిచిపోయే సరికి 24మీటర్ల పొడవునా డ్రిల్లింగ్ చేయగలిగారు. మొత్తంగా 60మీటర్ల పొడవునా డ్రిల్లింగ్ చేయాల్సి వుంది.
ముఖ్యమంత్రి సమీక్ష
ఇదిలావుండగా సొరంగం పనుల్లో పురోగతిపై ముఖ్య మంత్రి పుష్కర్‌సింగ్ దామి శనివారం ఉన్నతాధికారులతో తన అధికార నివాసంలో సమీక్ష జరిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం బాసటగా వుందని చెప్పారు. త్వరలోనే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తికాగలద ని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశ విదేశాల్లోని అత్యంత అధునాతన యంత్రాలు కార్మికులను కాపాడ గలవన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించాలంటూ టన్నెల్ వద్ద కార్మికులు ఆందోళన చేశారు.
పై నుండి డ్రిల్లింగ్ ?
లోపల చిక్కుకుపోయిన కార్మికులను చేరుకునేందుకు కొండ పై భాగం నుండి డ్రిల్లింగ్ జరపడంతో సహా ఇతరత్రా గల మార్గాలను సహాయ బృందాలు అన్వేషిస్తున్నాయని అధికారులు శనివారం ప్రకటించారు. పై నుండి అయితే మొత్తంగా 170మీటర్ల పొడవు వుంది. దానికి డ్రిల్లింగ్‌అంటే మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశం వుంది. దీనికన్నా దక్షిణ ప్రవేశమార్గం వైపున శిధిలాలతో నిండిన మార్గం పొడవు 60మీటర్లే వుంది. ఈ రూట్‌లో డ్రిల్లింగ్ జరపడంతోసహా ఇతర రకాల పద్దతులను కూడా అన్వేషించి, అమలు చేయాలని భావిస్తున్నట్లు సహాయ బృందాలు తెలిపాయి.
వరుస ఘటనలు జరుగుతున్నా
నిర్లక్ష్యం వీడరెందుకు ? : సిపిఎం
ఉత్తరాఖండ్‌లో తరచూ విపత్తులు సంభవిస్తున్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని సిపిఎం విమర్శించింది. తపోవన్ - విష్ణుఘర్ జలవిద్యుత్ ప్రాజెక్టు వరదల్లో ధ్వంసమైందని గుర్తు చేసింది. జోషిమఠ్ లో భారీ భవనాలు సైతం కుంగిపోయి, కూలిపోయాయని పేర్కొంది. ముందుజాగ్రత్తలు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే విపత్తు సంభవించిందని తెలిపింది. 4.5 కిలోమీటర్ల రైల్వే సొరంగంలో 40 మంది కార్మికులు ఏడు రోజులుగా చిక్కుకున్నారని, వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.