
బెర్లిన్ : నాటో నిర్వహిస్తోన్న బలప్రదర్శన, విన్యాసాలపై విమాన యాన సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతిపెద్ద నాటో వైమానిక దళ విస్తరణ వ్యాయామం 'ఎయిర్ డిఫెండర్ 23' జర్మనీ గగన తలంలో సైనిక విన్యాసాలను ప్రారంభించింది. మే 12 సోమవారం నుండి ప్రారంభమైన ఈ సైనిక విన్యాసాలు జూన్ 23 వరకు కొనసాగనున్నాయి. 25 దేశాలకు చెందిన 250 యుద్ధ విమానాలతో పాటు 10,000 మంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి.
అయితే, జర్మనీ గగనతలంలో చేపడుతున్న ఈ విన్యాసాలు ప్రయాణికుల విమానాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని జర్మన్ ఎయిర్ ట్రాఫిక్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సుమారు 800 ప్రయాణికుల విమానాలను దారి మళ్లించాల్సి వచ్చిందని.. దీంతో వాటిలో 40 శాతం విమానాలు 110 కి.మీ అధిక దూరం ప్రయాణించాల్సి వస్తోందని చెప్పారు. విమానాల ఆలస్యం, అధిక దూరం ప్రయాణంతో రెండు వారాల్లో చాలా మంది ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో రష్యాను బెదిరించేందుకు నాటో సైనిక బలాన్ని ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సైనిక విన్యాసాలను నిరసిస్తూ స్థానికులు వీధుల్లో ఆందోళనకు దిగారు. , ఇతరులను భయపెట్టేందుకు నాటో దేశాలు తమ సైనిక బలాన్ని ప్రదర్శించడం తప్పుడు సంకేతమని ఆందోళనకారుల్లో ఒకరైన థామస్ వెఫింగ్ మండిపడ్డారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఆయుధాలతో కాదని వెఫింగ్ పేర్కొన్నారు.