Sep 09,2022 06:51

న రాష్ట్రంలో అనేక దశాబ్దాలుగా రైతులు సాగు చేసుకుంటున్న భూములు చుక్కల భూముల జాబితాలో చేరి ఉన్నాయి. రాష్ట్రంలో 24 లక్షల ఎకరాల చుక్కల భూములున్నట్లు 2018 నాటి అంచనా. 1916లో సర్వే సెటిల్‌మెంట్‌ సందర్భంగా పేర్లు నమోదు చేయించుకోలేని రైతుల భూములను రికార్డులలో చుక్కలు పెట్టి 22-ఎ క్లాజు ద్వారా నిషేధిత భూములలో పెట్టారు. అనంతరం వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న భూములు, ఈనామ్‌ ఎబాలిషన్‌ యాక్టు ద్వారా రైతులకు సంక్రమించిన భూములు, ఎక్స్‌ ఆర్మీ వారికి ఇచ్చిన భూములు, ఆర్‌.ఒ.ఆర్‌ యాక్టు ద్వారా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారి భూములు, 1956కు ముందు ఎస్సైన్‌మెంట్‌ చేసి డిఫారమ్‌ పట్టాలు ఇచ్చిన భూములు, ఈ చట్టం ప్రకారం నిర్ణయించిన ధర చెల్లించిన ఎసైన్‌మెంట్‌ భూములు సైతం చుక్కల భూములలో చేరిపోయాయి.
      ఏభై ఏళ్ళ పైనుండి తొంభై ఏళ్ళుగా వంశపారంపర్యంగా సాగు చేసుకుంటున్న, అమ్మకాలు, కొనుగోళ్ళు సాగిన, వారసుల మధ్య పంపకాలు సాగిన భూములన్నింటిని నిషేధిత భూములుగా చుక్కల భూములలో చేర్చారు. చుక్కల భూములలో చేర్చడంతో అప్పటివరకు బ్యాంకులలో రుణాలు పొందుతున్న రైతులు రుణాలు పొందలేని స్థితి, అమ్మకాలు, కొనుగోళ్ళు సాగించలేని స్థితి ఏర్పడింది.

                                                         సమగ్ర భూ సర్వే-హక్కుల చట్టాలు

బ్రిటీషు ప్రభుత్వం 1916లో భూముల సమగ్ర సర్వే చేసింది. 1923 భూ రికార్డు సెటిల్‌మెంట్‌ చట్టం చేసింది. ఆ సందర్భంగా ఎవరూ క్లైయిమ్‌ చేయని భూములను రికార్డులలో చుక్కలు పెట్టింది. గడచిన ఈ 100 సంవత్సరాల కాలంలో జమీందారీ విధానం రద్దయ్యింది. ఈనాముల రద్దు చట్టం వచ్చింది. కౌలుదారీ చట్టం వచ్చింది. భూసీలింగ్‌ చట్టాలు వచ్చాయి. బంజరు భూముల పంపకానికిగాను ఎసైన్‌మెంట్‌ చట్టం వచ్చింది. ఫారెస్ట్‌ రైట్‌ యాక్టు వచ్చింది. భూమి సాగు విస్తీర్ణం పెరిగింది. భూ కమతాలు పెరిగాయి. ఈ క్రమంలో లక్షలాది ఎకరాల సాగు భూములు చుక్కల భూముల జాబితాలో చేరాయి. ఆర్‌.ఒ.ఆర్‌ చట్టం వచ్చింది. రైతుకు పట్టాదారు పుస్తకాలు వచ్చాయి. వంద సంవత్సరాలు గడచినా తిరిగి సంపూర్ణమైన భూసర్వే సెటిల్‌మెంట్‌ జరగలేదు. కొన్ని దశాబ్దాలుగా నిషేధిత భూముల నుండి చుక్కల భూములను విముక్తి చేయాలని రైతాంగం ఆందోళన సాగిస్తూ వచ్చారు. రైతాంగం వివిధ రూపాలలో సాగించిన ఆందోళనలతో పాటు హైకోర్టుకు వెళ్ళారు.
      గత రాష్ట్ర ప్రభుత్వం భూమి రికార్డులను డిజిటలైజేషన్‌ చేసింది. డిజిటలైజేషన్‌ సంద ర్భంగా భూమి రికార్డుల నిర్వహణలో అనేక లోపాలు బహిర్గతం అయ్యాయి. రైతుల స్వాధీనంలో ఉన్న భూముల విస్తీర్ణానికి, సరిహద్దులకు, రికార్డులలో ఉన్న విస్తీర్ణానికి, సరిహద్దులకు పొంతన లేకుండా పోయింది. రైతుల ప్రమేయం లేకుండానే వంశపారంపర్య హక్కు భుక్తాలైన భూములు సైతం చుక్కల భూములలో చేరి ఉన్నాయి.
     ప్రస్తుత ప్రభుత్వం భూ హక్కుల యాజమాన్య చట్టం చేసింది. భూములన్నీ డ్రోన్లతో సర్వే చేస్తామని, సమగ్ర సమాచారంతో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తామని చెప్తున్నది. 51 గ్రామాలలో డ్రోన్లతో శాంపిల్‌ సర్వే పూర్తయిందని, 40 గ్రామాలలో రికార్డులు కూడా పూర్తయ్యాయని 2023 చివరి నాటికి మొత్తం సర్వే పూర్తి చేస్తామని చెప్తుంది. ఈ సమగ్ర సర్వేలోనైనా లక్షలాది మంది రైతాంగం ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యను సక్రమంగా పరిష్కరించాల్సి ఉంది.
 

                                                                      హైకోర్టు తీర్పు

భూమి రికార్డులలో పట్టాదారు వివరాలను పొందుపరిచేందుకు ఉద్దేశించిన కాలమ్‌లో ఖాళీగా వదిలివేసి, చుక్కలు పెట్టినంత మాత్రాన అవి ప్రభుత్వ భూములు కావని రాష్ట్ర హైకోర్టు 2014 ఏప్రిల్‌ 28న తీర్పు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలని చెప్పింది. అందుకుగాను 14 అంశాలను తీర్పులో పేర్కొంది. ఆ 14 అంశాలు సక్రమంగా అమలు పరిస్తే చుక్కల భూముల సమస్య పరిష్కారం అయ్యేది. హైకోర్టు తీర్పు అనంతరం 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చుక్కల భూముల పరిష్కారానికి 2017 డాటెడ్‌ లాండ్స్‌ చట్టం చేసింది. చట్టం లక్ష్యం మంచిదే అయినప్పటికీ, అమలు పరచడానికి రెవెన్యూ శాఖ తీరు మారలేదు. సి.సి.ఎల్‌.ఎ నుండి దఫదఫాలుగా సర్క్యులర్లు, మెమోరాండంలు వస్తున్నప్పటికీ చుక్కల భూముల సమస్య పేరుకుపోవడం రెవెన్యూ శాఖ పనితీరుకు నిదర్శనం.
     ప్రభుత్వం చెప్పిన విధంగా రైతాంగం అర్జీలు పెట్టినప్పటికీ పరిష్కారం చేయడంలేదు. 5 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి సోమవారం 'స్పందన' కార్యక్రమంలో వేలాది అర్జీలు వస్తూనే ఉన్నాయి. కోర్టు చెప్పిన ప్రకారం 1) రెవెన్యూ రికార్డులలో ఏదో ఒక దానిలో రైతు పేరు నమోదు అయి ఉండటం, 2) రైతు వద్ద పట్టాదారు పాసు పుస్తకం ఉండడం, 3) రైతు వద్ద వంశపారంపర్య దస్తావేజులు లేదా రాసుకున్న అగ్రిమెంట్లు ఉండడం 4) రైతు 2017కు ముందు 12 సంవత్సరాలుగా ఆ భూమి సాగుదారుగా ఉన్న దాఖలా చూపడం. వీటిలో ఏ ఒక్కటి ఉన్నా నిషేధిత జాబితా నుండి తొలగించి రైతుకు పూర్తి హక్కులతో పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాల్సి ఉంది. ఈ కాలంలో పేదలకు ఇచ్చిన సాగుకు లాయికైన బంజరు భూములకు, అటవీ హక్కుల చట్టం ప్రకారం పేదలకు ఇచ్చిన భూములకు నిషేధాలు తొలగించి హక్కులు ఇవ్వాల్సి ఉంది. ఈ చర్యలన్నీ సమగ్ర సర్వే లోపుగానే రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూశాఖ గ్రామ సభల ద్వారా పరిష్కరించాల్సి ఉంది.

/వ్యాసకర్త రైతుసంఘం సీనియర్‌ నాయకులు/

వై. కేశవరావు

Dotted-lands-are-the-bane-of-farmers