'నాన్నగారూ ఎంసెట్ కౌన్సెలింగ్ ఉంది. నా ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కాలేజ్ నుంచి తెచ్చుకోవాలి. వైజాగ్ ఎప్పుడు వెళ్దాం?' అని ప్రణీత్ తండ్రి రాఘవను అడిగాడు. 'రెండు రోజుల్లో వెళ్దాం. ఇంకా ఫీజు బకాయి ఉందని, చెల్లించమని కాలేజ్ మేనేజ్‌మెంట్ మెసేజ్‌లు పెడుతోంది. 'మనం రెండేళ్ల ఫీజు చెల్లించేశాం కదా!' అన్న ప్రణీత్‌తో 'ఇంకా పాకెట్ మనీలో బకాయి అంటూ 15 వేల రూపాయలు చూపిస్తున్నారు.' అని రాఘవ కొడుకుతో అన్నాడు. 'అవును నాన్నా! పరీక్షలు రాసి, కాలేజీ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా బకాయి రశీదు ఇచ్చారు' అని ప్రణీత్ అన్నాడు. 'కాలేజీకి వెళ్లి అన్నీ మాట్లాడదాంలే!' అని రాఘవ అన్నాడు.
రెండు రోజులు ఆగి, వైజాగ్‌లో చదివిన కాలేజీకి తండ్రీకొడుకులు ఇద్దరూ కలిసి వెళ్లారు. ఒరిజినల్ సర్టిఫికెట్స్ కోసం అడిగితే 'నో డ్యూస్ సర్టిఫికేట్' కార్యాలయంలో తీసుకొని రావాలని రిసెప్షన్ కౌంటర్‌లో చెప్పారు. కార్యాలయంలో క్లర్క్‌కి ప్రణీత్ యొక్క అడ్మిషన్ నెంబర్ చెప్పి, ఫీజు బకాయి వివరాలు చూడమని చెబితే, ఆ క్లర్కు కంప్యూటర్లో చెక్ చేసి, 'ఇంకా మీరు 18, 000 రూపాయలు చెల్లించాల్సి ఉంది' అని రాఘవతో అన్నాడు. 'నేను ఆల్రెడీ ఫీజు చెల్లించాను కదండీ! అలాగే పాకెట్ మనీ అని 10,000 రూపాయలు కలెక్ట్ చేశారు. పోటీ పరీక్షలకు సాఫ్ట్‌వేర్ టాబ్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తామని మరో 3000 అదనంగా తీసుకున్నారు. ఆ సాఫ్ట్‌వేర్ అసలు ఇవ్వనేలేదు. ఇంకా మీరే మాకు బకాయి ఉంటారు' అని రాఘవ అన్నాడు. 'మాకు ఆ విషయాలేమీ తెలియవండీ. ఇక్కడ ఎంత బకాయి ఉంటే అంత చెల్లిస్తేనే మీకు ''నో డ్యూస్ సర్టిఫికెట్'' ఇస్తాం' అని కరాకండిగా చెప్పేశాడు. 'ఇంతకీ 18,000 రూపాయల బకాయి దేనికి సంబంధించిందో ఒకసారి లిస్ట్ ఇవ్వండి' అని రాఘవ అడిగాడు.'లిస్టు ఇవ్వడం కుదరదు. కావాలంటే రాసుకోండి!' అని 'ప్రతి నెలా లాండ్రీ ఖర్చులు రూ. 500, మినరల్ వాటర్ ఖర్చు రూ. 350, పరీక్షల నిమిత్తం తీసికెళ్లినందుకు ఛార్జీలకి రూ.1500, ఫోన్ బిల్లు ప్రతినెల రూ. 350, బిల్డింగ్ మెయింటెనెన్స్ రెండు వేలు, పరీక్ష ఫీజు రూ.1500, మెడికల్ ఛార్జెస్ అంటూ ఓ 4000 రూపాయలు.. ఇవన్నీ లెక్క రాసుకోండి!' అన్నాడు. రాఘవ క్లర్క్ చెప్పిన లిస్టు విని, అవాక్కయ్యాడు. వాటి గురించి క్లర్క్‌ని వివరం అడుగుతుంటే 'మీరు నన్నేమీ అడగకండి.. కావాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు. ఆయన దగ్గరకు వెళ్ళండి!' అంటూ తన సీట్ నుంచి లేచి వెళ్ళిపోయాడు.
అక్కడ ఎదురుగా కనబడుతున్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బోర్డు ఉన్న గది లోపలికి రాఘవ వెళ్ళాడు. అక్కడ సీట్లో కూర్చున్న వారితో 'తన కుమారుడు ప్రణీత్ ఇంటర్మీడియట్ చదివాడని, నేను పూర్తిగా అన్ని ఫీజులూ చెల్లిస్తే.. ఇంకా బకాయిలు ఉన్నాయని కౌంటర్లో చెబుతున్నారు' అని చెప్పాడు.
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కాస్త నిర్లక్ష్యంగా 'అక్కడ ఎంత బకాయి ఉంటే అంత చెల్లించి, వెళ్ళండి. మేం చేసేదేమీ లేదు. మేనేజ్‌మెంట్ నుంచే వాళ్లకు బకాయి వివరాలు వస్తాయి. అవి చెల్లిస్తేనే వారు మీకు ''నో డ్యూ సర్టిఫికెట్'' ఇస్తారు. అప్పుడే మీ సర్టిఫికెట్స్ మీకు అందుతాయి' అని చెప్పాడు. 'మరి పోటీ పరీక్షల నిమిత్తం సాఫ్ట్‌వేర్ టాబ్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తామని మూడు వేల రూపాయలు అదనంగా తీసుకున్నారు కదా! సాఫ్ట్‌వేర్ కూడా ఇన్‌స్ట్టాల్ చేయలేదు. మరి ఆ డబ్బులు సంగతి ఏమిటి?' అని రాఘవ గట్టిగా అడిగాడు. 'అవి బుక్స్, యూనిఫామ్స్‌తో కలిపి ఉంటాయి. బుక్స్ కింద అది జమవుతుంది. మీకేమీ తెలియనట్టు ఉందే' అని హేళనగా మాట్లాడాడు. రాఘవకు చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ వారి చేతిలో ఉండిపోయాయి. అక్కడ బకాయిలు కడితేనే, వారు ''నో డ్యూస్ సర్టిఫికెట్'' ఇస్తారు. అది సబ్మిట్ చేస్తేనే వీరు ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇస్తారు.
మనసులోని బాధను ఆపుకోలేక రాఘవ ఒక సగటు తండ్రిగా 'విద్యార్థిని జాయిన్ చేసుకునేటప్పుడు ఈ విషయాలు ఏమీ చెప్పరు. రెండేళ్లు ఇలాగే ఫీజు ఉంటుందని చెబుతారు. పాకెట్ మనీ, కొన్ని ఖర్చులు మినహాయించి తిరిగి మిగిలిన మొత్తం మీకే చెల్లిస్తామని చెబుతారు. సెకండియర్ అయ్యేటప్పటికీ అన్ని రకాల ఫీజులు కట్టమంటారు. విద్యార్థికి సంబంధంలేనివన్నీ కలిపి మరీ వసూలు చేస్తారు. చెల్లించకపోతే సర్టిఫికెట్స్ ఇవ్వమంటారు. ఇలా దోపిడీ చేయడం మీకు అలవాటైపోయింది. పిల్లలను చేర్పించిన మేము కూడా మీరు చెప్పినట్లు ఫీజు కట్టి వెళ్ళిపోతున్నాం. మూకుమ్మడిగా ప్రశ్నించేవారు లేరు. మీరు అదనంగా వసూలు చేస్తున్న మొత్తం ఎందుకు వసూలు చేస్తున్నారన్న విషయం కూడా తల్లిదండ్రులకు తెలియదు' అని తన అసహనం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌పై చూపి, బయటకు వచ్చేశారు.
తన కుమారుడు 10వ తరగతి పరీక్షలు రాసిన వెంటనే 'మా కాలేజీలో చేర్పించండి... చేర్పించండి..' అంటూ పదేపదే తన దగ్గరకు వచ్చి, తమ ఊరు పక్కనే ఉన్న కుమార్‌కి ఫోన్ చేస్తే 'ఏం చేస్తామండి!... తప్పదు ఆ బకాయి కట్టేసి సర్టిఫికెట్స్ తీసుకోండి!' అంటూ ఫోన్ కట్ చేశాడు.తన బాధ ఎవరికి చెప్పుకోవాలో రాఘవకు అర్థం కాలేదు. చేసేదేమీ లేక క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్లి, వాళ్లు చెప్పిన బకాయి మొత్తం చెల్లించి ''నో డ్యూస్ సర్టిఫికెట్'' తీసుకున్నాడు. అది కార్యాలయంలో ఇచ్చి, ఒరిజినల్ సర్టిఫికెట్స్ తెచ్చుకున్నారు.
ఇది కార్పొరేట్ విద్య మాయాజాలం.
మొర్రి గోపి
8897882202