Oct 30,2022 12:30

నేనేమీ ఇక మాటాడను
నా మాటలను ఒక కొలిమిలో వేసి
కొన్ని నిషిద్ధాక్షరాలను ప్రకటిస్తా
వికటించిన వాటిని తొలగించి
ప్రమాద స్థలంలో పారేస్తా !
నాకోసం నేనేమీ ఉంచుకోను
ఎవరైనా వినేవాళ్ళుండొచ్చు
ఈ గడ్డు కాలంలో
రానున్న బహు చెడ్డ కాలంలో
వారికై పొట్లాలు కడుతున్నా
నిఖార్సైనవి తీసి నింపాదిగా..!
విలువలు అరికాలు కింద
నలిగిపోతున్న వేళ
గౌరవం నాలిక మడతకింద
వివస్త్రగాంచుతున్న వేళ
బుద్ధి ఏ మురికి కాలువల్లోనో
తేలియాడుతున్న వేళ
కొన్ని మాటలు అవసరం...
వెన్నెముకలను నిలబెట్టడానికి
తలలను పైకెత్తించడానికి
అవి నిప్పుకణికల్లా తగులుతూ
బతుకు మర్మం జన్మ అర్థం
సుర్రుమని తెలుపుతాయి!
విర్రవీగుడు వెర్రితలలు వేసి
ఎవరు తవ్వుకున్న నేలల్లో
వాళ్ళనే పూడ్చి
కొత్త వంగడాలు మొలిపిస్తాయి
కలుపు దేహాలను
ప్రక్షాళన గాంచుతాయి!
అందుకే మాటలతో
యుద్ధం చేస్తున్నా
వాళ్ళ వీళ్ళ మాటలలో
హత్య గావించబడుతున్నా..!!

- రఘు వగ్గు
9603245215