Feb 11,2023 07:42

              ''కేంద్ర పశు సంవర్ధక శాఖ డౌన్‌ డౌన్‌'' అని గట్టిగా ఆంబోతులు రంకెలు వేస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ శబ్దాలు వినవస్తున్న దిశగా పరిగెత్తాను. చూతును కదా! కలెక్టర్‌ కార్యాలయం దగ్గర వందలకొద్దీ ఆంబోతులు గుమిగూడాయి. వాటిలో కొన్ని ముసిలి ఆంబోతులు కలెక్టరాఫీసు ముందు కాళ్ళు మునగదీసుకుని బైఠాయించాయి. కలెక్టర్‌ గారితో సహా యావన్మందీ లోపలికి వెళ్ళలేక, ఏంచేయాలో తోచక బిక్కమొహాలు వేసుకుని చూస్తున్నారు. పోలీసు పటాలాలు వచ్చాయి. ఆంబోతుల మీద లాఠీ చార్జి చేయబోతే అవి తిరిగి కొమ్ములతో కుమ్మేశాయి. ఆ వైనం చూసిన పోలీసు కమిషనర్‌ వెంటనే లాఠీచార్జి ఆపెయ్యమని ఆదేశాలు ఇచ్చాడు. ఒకానొక ఉత్సాహవంతుడైన, తొందరగా ప్రమోషన్లు కొట్టేయాలన్న యావ బాగా ఉన్న ఒకానొక సర్కిల్‌ గారు నీటి ఫిరంగులను ప్రయోగించమని సూచించేడు. కమిషనర్‌కి ఆ సలహా నచ్చింది. కాని ఆ నీటి ఫిరంగుల ప్రయోగం కాస్తా బెడిసికొట్టింది. ట్యాంకర్‌ లోని నీళ్ళన్నీ అయిపోయాయి కాని ఆంబోతులు కదల్లేదు. ఎప్పటినుంచో స్నానాలు లేకుండా ఉన్నాయేమో మహదానందంగా నీటి ఫిరంగుల ప్రయోగాన్ని ఆస్వాదించాయి. పనికిమాలిన సలహా ఇచ్చాడని కమిషనర్‌ సదరు సిఐ మీద మండిపడ్డాడు. ఆ సిఐ తన ప్రమోషన్‌ కోరికను వదిలేసుకుని అక్కడినుంచి చల్లగా జారుకున్నాడు.
           తమను ఈ లోగా సంప్రదించిన కలెక్టర్‌ గారికి '' మనుషుల మీద మీ పోలీసులు వ్యవహరించినట్టు పశువుల యెడల వ్యవహరిస్తే గనుక అది జంతుహింస చట్టం వర్తించే వ్యవహారంగా మారిపోయి మీ మెడకు చుట్టుకోగలదు జాగ్రత్త'' అని హెచ్చరించేరు న్యాయ కోవిదులు. తమకు తెలిసినంతవరకూ సెక్షన్‌ 144లు, సెక్షన్‌ 30లు, 351లు వగైరాలన్నీ జంతువులకి వర్తించిన దాఖలాలు ఏవీ లేవని కూడా స్పష్టం చేసేరు. ''పోనీ, పులుల్నో, సింహాల్నో రప్పిద్దామేమిటి?'' అని కలెక్టర్‌ గారు అడిగితే ''అసలే అవి అంతరించిపోతున్న జాతులు. వాటిని రంగంమీదకు తెస్తే అంతర్జాతీయ సమస్య అయిపోతుంది జాగ్రత్త '' అని చీఫ్‌ సెక్రటరీ జిల్లా కలెక్టర్‌ కి వార్నింగిచ్చేడు.
          మరేమిటి దారి? ఎన్నో చిక్కు సమస్యల్ని పరిష్కరించిన అనుభవం ఉన్న ఒకానొక మాజీ అయ్యేయెస్‌ ని సలహా అడిగేరు. ''అయ్యా! ఇది పశువులతో వ్యవహారం. మనుషులతోనైతే వేరు. పశువులతో ప్రజాస్వామ్య పద్ధతి తప్ప మరో విధంగా వ్యవహరించలేం. సంప్రదింపులే శరణ్యం'' అని ఆయన సలహా ఇచ్చేడు. పశువులతో డీల్‌ చేయడంలో తలపండిన వారెవరని వెతకగా ఒకానొక బందెలదొడ్డి నిర్వాహకుడు తగిలేడు. అతగాడిని బతిమాలి, కాళ్ళూ, గెడ్డం పట్టుకుని మొత్తానికి చర్చలకు పంపేరు.
ఓ లారీడు పచ్చిగడ్డి వెంటరాగా ఆ మధ్యవర్తి చర్చలకు పయనమయ్యాడు.
            మొత్తానికి సుదీర్ఘచర్చల తర్వాత ఆ మధ్యవర్తి వెనక్కి వచ్చేడు. కేంద్ర పశుసంవర్ధక శాఖ ఫిబ్రవరి 14ను ''పశు కౌగిలి'' దినంగా అమలు జరపమన్న సర్క్యులర్‌ ను బేషరతుగా ఉపసంహ రించు కోవాలన్నదే ఆంబోతుల డిమాండ్‌ అని అధికారులకు వివరించేడు. కలెక్టర్‌ గారికి గాని అక్కడున్న అధికారులకి గాని ఆ డిమాండ్‌ అంతుపట్టలేదు. పశువులని ప్రేమించమంటే అందుకు అభ్యంతరం ఆ పశువుల నుంచే ఎందుకొచ్చిందో వాళ్ళకి బోధపడడం లేదు. అప్పుడు ఆ మధ్యవర్తి ఆందోళనకారుల వినతి పత్రాన్ని వాళ్ళకి చూపించేడు. అందులో ఇలా ఉంది:
             ''ఇన్నేళ్ళుగా మా మెడలకి కాడి కట్టి దున్నించేరు. బళ్ళు లాగించేరు. గానుగలు ఆడించేరు. రిటైర్‌ అవగానే కబేళాలకి పంపేరు. ఇక మా ఆడవాళ్ళని పాడి కోసం వాడుకున్నప్పుడు మా బిడ్డలకి దక్కవలసిన పాలు దక్కకపోయినా భరించాం. ఎందుకు? మేం పశువులం గనక. ఇతరులకు ఉపయోగపడాలన్నదే మా జీవిత పరమార్ధం అని మాకు తెలుసు గనక. కాని ఇప్పుడు మీ అకృత్యాలు మితి మీరిపోయాయి. ఇక సహించం. తక్కిన ప్రపంచం అంతా ప్రేమికుల దినంగా జరుపుకుంటున్న ఫిబ్రవరి 14న మీరు పశుకౌగిలి దినం పాటించమని ఆదేశాలు ఇచ్చారు. ఇక ప్రతీ వాడూ వచ్చి మమ్మల్ని వాటేసుకుంటాడన్నమాట. మీ మనుషులకి ఇంగిత జ్ఞానం పోయిందని అర్ధం అవుతోంది. మేం పశువులమనుకున్నారా? మనుషులమనుకున్నారా? ఖబడ్దార్‌ ! మర్యాదగా వెంటనే ఆ దిక్కుమాలిన సర్క్యులర్‌ ని వెనక్కి తీసుకోండి.''
కలెక్టర్‌ గారు వెంటనే ఆ వినతి పత్రాన్ని కేంద్ర పశు సంవర్ధక శాఖకి ఆగమేఘాల మీద పంపేడు. కాని ఆ మేఘాలు ఢిల్లీ వెళ్ళేలోపు గాలివాన వచ్చి చెదిరిపోయాయి.
          ఆ రోజు ఫిబ్రవరి పదిహేను. ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. కాజువాలిటీ వార్డు ఇన్‌చార్జి రిపోర్టు తయారుచేసేడు. ''పశు కౌగిలి దినం సందర్భంగా ఆ పశువులని ముందు నుంచి వాటేసుకోబోయి కొమ్ములు గుచ్చుకుని గాయపడినవారు మూడు వందల డెబ్భై మంది. వారిలో దాదాపు మూడు వందల మంది పరిస్థితి విషమంగా ఉంది. పక్కనుంచి పశుకౌగిలి కోసం ప్రయత్నించి ఆ పశువుల గిట్టల కింద నలిగి ఫ్రాక్చర్లు అయినవాళ్ళు ఆరు వందల తొంభై మంది, వారిలో ఎక్కువమందికి చెప్పరానిచోట్ల చితికిపోయి ట్రామా లోకి వెళ్ళిపోయారు. ఇక వెనకనుంచి వాటేసుకోబోయి ఆ పశువుల వెనక కాళ్ళు ఝాడించి తన్నిన కారణంగా మూతిపళ్ళు రాలిపోయినవారు రెండు వేలమందికి పైగానే ఉంటారు. ఇంకా ఎంతమంది బాధితులున్నారో తెలియదు.'' అని ఆ రిపోర్టులో ఉంది.
          ఢిల్లీ లోని ఎయిమ్స్‌లో పశుకౌగిలి దినం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖామాత్యుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని టీవీ చానెళ్ళు బ్రేకింగ్‌ న్యూస్‌ ఇస్తున్నాయి.
         ''మమ్మల్ని బలవంతం చేసే మృగాళ్ళని ఏంచేయాలో ఇప్పుడు బాగా తెలిసింది'' అని మహిళా లోకం యావత్తూ ముక్తకంఠంతో ప్రకటించింది.
          తన శిష్య బృందాన్ని చుట్టూ కూచోబెట్టుకుని స్వామి అలౌకికానంద తీర్ధులవారు ''నోరూ వాయీ లేదని పశువులని చులకనగా చూడవద్దు. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు గాని పశువులతో మాత్రం పెట్టుకోవద్దు'' అని బోధ చేశారు.

                                                                                   ***

         ''అవునవును...పశువులతో మాత్రం పెట్టుకోవద్దు...పంచరైపోతుంది. అయినా పశువులను ప్రేమగా, లాలనగా దగ్గరకు తీసుకోవడానికి ప్రత్యేకంగా ఒక రోజు కావాలా ఏంటి? ఆ పని ఎప్పుడైనా చేయొచ్చుకదా..!'' అంటున్న నన్ను తట్టి మరీ నిద్ర లేపింది మా శ్రీమతి.
''ఏవండీ కలగంటున్నారా? ఆఖరికి మీరు కలవరించిందే జరిగిందండీ. కేంద్ర పశు సంవర్థక శాఖ 'కౌ హగ్‌ డే' ఆలోచనను వెనక్కు తీసుకుందట...'' అనడంతో ''...అయితే కలలోలా ఎవరికీ ఏ గాయాలూ కావన్నమాట... హమ్మయ్య.'' అని ఊపిరి పీల్చుకున్నాను.
- సుబ్రమణ్యం