Dec 01,2022 15:17

ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్‌ జిల్లా) : రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కష్ణ ప్రసాదు అన్నారు. రెడ్డిగూడెం, రంగాపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ 75 కిలోల బస్తా ధాన్యం సాధారణ రకానికి రూ.1530లు, గ్రేడ్‌ ఏ రకపు ధాన్యానికి రూ.1545లను కనీస మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఒక క్వింటాకు (100కేజీలు) ధాన్యం సాధారణ రకానికి రూ.2040లు, గ్రేడ్‌ ఏ రకపు ధాన్యానికి రూ.2060 లను కనీస మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో వుండి సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం అన్నేరావుపేటలో వైఎస్‌ఆర్‌ జలసిరి పథకం కింద రైతులకు ఉచితంగా బోర్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.