సోమ వనం అనే అడవికి సమీపంలో నందవనం అనే గ్రామంలో గణపయ్య అనేక రకాల వ్యాపారాలు చేస్తూ ప్రజల మంచితనాన్ని, అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని, మోసం చేస్తూండేవాడు.
ప్రస్తుతం అతను ప్రజలను మోసం చేయడానికి ఎన్నుకున్న వ్యాపారం గుడ్లు అమ్మకం. అలాంటి ఇలాంటి సాధారణ గుడ్లు కావు అవి, ఏకంగా గాడిద గుడ్లు! నిజంగా గాడిద గుడ్లే అని గణపయ్య తన గ్రామంలో అమ్ముతున్నాడు. నా దగ్గర ఉన్నది ప్రత్యేకమైన గాడిద. అది పెట్టే గుడ్లు తింటే శరీరంలోని అన్ని రోగాలూ నయం అవుతాయని ప్రచారం చేశాడు! పాపం ప్రజలు ఆలోచించే ధోరణి, కనీస జ్ఞానం లేకపోవడంతో ఆ గుడ్ల కోసం ఎగబడసాగారు. ప్రతిరోజూ తన ఇంటి ముందు ఉన్న ఓ చెట్టుకు గాడిదని కట్టేసేవాడు. వచ్చే వారందరికీ ఇదిగో ఆ గాడిద గుడ్లే ఇవి అని అమ్మేవాడు.
ఓ రోజు నందవనంలో ఉండే సోమయ్య మేనల్లుడు సత్యం పక్క ఊరి నుండి పనిమీద వచ్చాడు. రాగానే సోమయ్యను ఆప్యాయంగా పలకరించాడు.
'ఏమోరు! నా మేనల్లుడు సత్యం వచ్చాడు కానీ ఈరోజు వాడికి గాడిద గుడ్డు కూర వండు' అన్నాడు.
లోపలి నుంచే 'అలాగేనండి' అంది సోమయ్య భార్య సుగుణమ్మ. ఆ మాటలు విన్న సత్యానికి నవ్వు వచ్చింది. 'ఏంటి గాడిద గుడ్డా!? నువ్వు మరీను, గాడిద గుడ్డు ఏంటి మావయ్య?' అని అన్నాడు. 'నిజమేరా' అని జరిగిందంతా చెప్పాడు. 'ఊరి ప్రజల అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని, మిమ్మల్ని బాగా మోసం చేస్తున్నాడు. అందుకే చదువుకోవటం వల్ల ఇలాంటి మోసాలను అరికట్టవచ్చని చెప్పేది, 'సరే ఆ గుడ్డును నాకు చూపించు' అన్నాడు సత్యం. ఆ గుడ్డును చూడగానే సత్యానికి ఏదో గుర్తుకు వచ్చింది. కొన్ని రోజులు సత్యం గణపయ్య పనులను గమనించసాగాడు. గణపయ్య వేకువ ఝామునే నిద్రలేచి, ఆ ఊరి సమీపంలోని అడవిలోనికి వెళ్లి, అక్కడ నుంచి కొన్ని గుడ్లను ఎవరికీ అనుమానం రాకుండా సంచి నిండా తీసుకురాసాగాడు. అది చూసిన సత్యం ఆ గుడ్డు ఏదో పక్షిది అని గ్రహించాడు.
లాభం లేదని భావించిన సత్యం ఒక ఉపాయం ఆలోచించాడు. తన మామను పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. కొంతసేపటికి గణపయ్య, గాడిదతో కలిసి ఇంటికి వచ్చి సత్యాన్ని పిలిచాడు. 'ఇతని పేరు గణపయ్య. మా ఊర్లో పెద్ద వ్యాపారి' అన్నారు. 'మరి మందు తయారీకి గాడిదను నాకు అమ్మితే.. మీ వ్యాపారం ఎలా?' అన్నాడు. 'నాకు ఇంకో గాడిద ఉందిలేండి అన్నాడు. 'సరే అయితే ఎన్ని బంగారు నాణేలు కావాలి?' అన్నాడు సత్యం. 'ఓ ఇరువై బంగారు నాణేలు' అన్నాడు గణపయ్య. 'అబ్బో నేను పది నాణేలు మాత్రమే ఇస్తాను, లేదంటే చెప్పండి ఇంకొక చోట చూసుకుంటాను' అన్నాడు. 'సరే ఆ పది బంగారు నాణేలే ఇవ్వండి' అన్నాడు గణపయ్య. లోపలికి వెళ్లిన సత్యం ఓ బంగారు పెట్టెతో బయటికి వచ్చాడు. సత్యం ఆ బంగారు పెట్టెలో నుంచి నాణేలను తీసి, పది లెక్కించి ఇచ్చాడు. వాటిని తీసుకున్న గణపయ్య. 'ఇదేంటి ఇవి మామూలు నాణాలేగా..? మోసం...' అంటూ అరవసాగాడు. 'గాడిద పేరు చెప్పి, అడవిలో ఉండే పక్షుల గుడ్లు తెచ్చి అమ్మడం మోసం కాదా..? అడవిలోని పక్షుల గుడ్లను దొంగలించడం మహానేరం' అన్నాడు. 'నువ్వు పక్షల గుడ్లు తెచ్చి.. గాడిద గుడ్లని ఎలా చెప్పావో.. నేనూ అలాగే బంగారు పెట్టలోని నాణేలను బంగారు నాణేల'ని చెప్పాను అన్నాడు. ఇక్కడే ఇంకొంచెం సేపు ఉంటే అసలుకే మోసం వస్తుందని భావించి, వచ్చిన దారినే ఇంటి ముఖం పట్టాడు. అప్పటి నుంచి మోసకారి వ్యాపారాలు మానేశాడు.
సత్యం ఆ గాడిదని అడవిలోకి తీసుకెళ్లి, వదిలేశాడు. ఆ తర్వాత ఊర్లోకి వచ్చి ప్రజలందరికీ మోసాలకు గురికాకుండా ఎలా ఉండాలో అవగాహన కల్పించాడు.
- ఏడుకొండలు కళ్ళేపల్లి
9490832338