Dec 14,2022 07:33

నూతన చట్టం ప్రకారం మేజర్‌ పోర్టులు సొంతగా కార్గో హ్యాండ్లింగ్‌ చేయకూడదు. మేజర్‌ పోర్టుల వద్ద ఉన్న జనరల్‌ బెర్త్‌లు, ఆయిల్‌ బెర్త్‌లు, కంటైనర్‌ బెర్త్‌లు, కంటైనర్‌ టెర్మినళ్లు, క్రూజ్‌ టెర్మినల్‌ తదితరాలన్నీ ప్రైవేట్‌ సంస్థలే నిర్వహించాలి. కేవలం ల్యాండ్‌లార్డ్‌ పోర్టులుగా మాత్రమే విధులు నిర్వర్తించాలి. ఆఖరికి పోర్టుల భూములు, ఉద్యోగుల క్వార్టర్లు, పోర్టులు నిర్వహిస్తున్న ఆసుపత్రులు, స్టేడియమ్‌లు, గ్రౌండ్లు అన్నీ కూడా ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చేయాలి. వీటిని ప్రైవేట్‌ సంస్థలకు అప్పజెప్పినందుకు ఆ సంస్థలు పొందే ఆదాయంలో కొద్ది భాగం పోర్టులకు ఇస్తాయి. 2024 నాటికి 500 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌కు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేగాక 2030 నాటికి దేశంలో మొత్తం పోర్టు రంగంపై, సముద్రతీర వ్యాపారంపై అదానీ పోర్ట్సు సంస్థ ఏకస్వామ్యం సాధించటానికి మోడీ- అదానీ ద్వయం వ్యూహ రచన చేసింది.

        స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన ప్రభుత్వ పోర్టులను క్రోనీ పెట్టుబడిదారులు కబళించి వేస్తున్నారు. ఒక్కొక్క పోర్టును తమ వశం చేసుకుంటున్నారు. ప్రభుత్వ మేజర్‌ పోర్టులనే గాక రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పెట్టుబడిదారుల మైనర్‌ పోర్టులను కూడా మింగేస్తున్నారు. మొత్తం పోర్టు రంగంలో ప్రభుత్వ పాత్ర లేకుండా చేయడానికిగాను చట్టాలన్నిటిని మార్చేందుకు కేంద్ర బిజెపి సర్కార్‌ తెగబడుతున్నది.
       నేడు దేశంలో 12 మేజర్‌ పోర్టులు, 185 మైనర్‌ పోర్టులు ఉన్నాయి. మైనర్‌ పోర్టుల్లో 64 మాత్రమే ఎక్కువభాగం సరుకుల ఎగుమతి, దిగుమతి రవాణా చేస్తున్నాయి. మేజర్‌ పోర్టులు కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వ పోర్టులు. 'భారత పోర్టుల చట్టం- 1908' కింద ఇవి రెగ్యులేట్‌ చేయబడుతున్నాయి. మైనర్‌ పోర్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో ఉంటాయి. రాష్ట్ర పరిధిలో నిర్మించే మైనర్‌ పోర్టులకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదు. భారత పోర్టుల చట్టం-1908, భారత రాజ్యాంగం...పోర్టుల నిర్వహణలో కేంద్ర, రాష్ట్రాల మధ్య స్పష్టమైన అధికారాల విభజన కూడా చేశాయి.
         స్వాతంత్య్రం వచ్చిన తరువాత పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేక కేంద్రీకరణ జరిగింది. ప్రభుత్వ రంగంలోనే పోర్టుల నిర్మాణం జరగాలని తీర్మానించి లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. 1991 నాటికి ప్రభుత్వ రంగంలో 11 మేజర్‌ పోర్టులు ఏర్పడ్డాయి. 1999లో తమిళనాడులో ఎన్నూరు (ప్రస్తుతం కామరాజర్‌ పోర్టు) పోర్టును కంపెనీ చట్టం కింద నిర్మించారు. ఆ తరువాత ప్రభుత్వ పోర్టుల నిర్మాణం ప్రభుత్వ విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల నిలిపేశారు.
         అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ రంగంలో ఉన్న మేజర్‌ పోర్టులు బ్రహ్మాండమైన పురోగతి సాధించాయి. సముద్ర రవాణా సరుకుల ఎగుమతి దిగుమతుల్లో స్వయంసమృద్ధి సాధించాయి. అవసరాలకు అనుగుణంగా స్థాపిత శక్తిని పెంచుకుంటూ విస్తరించాయి. దేశ భద్రతకు కూడా రక్షణ గోడలుగా నిలిచాయి. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. ప్రభుత్వ పోర్టు ఉన్న ప్రతి నగరం మహానగరంగా విస్తరించటానికి, సేవారంగం బహుముఖంగా అభివృద్ధి కావటానికి దోహదపడ్డాయి. సృష్టించబడుతున్న సంపద ఆదాయ పున:పంపిణి ద్వారా ప్రజలకు తగిన విధంగా ఆదాయాలు, వారి జీవితాలు మెరుగుపడేందుకు, కొనుగోలు శక్తి పెరగటానికి తద్వారా మార్కెట్‌లో సరుకులకు డిమాండ్‌ పెరగటానికి దోహదం చేశాయి.
         దేశంలో 1991 నాటికి ప్రభుత్వ పోర్టులు తప్ప ప్రైవేట్‌ పోర్టుల పాత్ర లేదు. 1994 నాటికి మేజర్‌ పోర్టుల ద్వారా 215 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌ (ఓడల ద్వారా సరుకులు ఎగుమతి, దిగుమతి) చేసే స్థాయికి ఎదిగాయి. అప్పుడు మైనర్‌ పోర్టుల ద్వారా కేవలం 2.5 మిలియన్‌ టన్నులు అనగా 1.16 శాతం మాత్రమే కార్గో హ్యాండ్లింగ్‌ జరిగింది. అది కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న మైనర్‌ పోర్టుల ద్వారానే అధిక భాగం జరిగేది.
            దేశంలో సరళీకరణ విధానాలు 1991లో చేపట్టిన తరువాత ప్రభుత్వ పోర్టుల అభివృద్ధి నిలిచిపోయింది. ఆధునీకరణ పేర పోర్టు రంగంలోకి విదేశీ, స్వదేశీ ప్రైవేట్‌ పెట్టుబడులకు గేట్లు తెరిచారు. 2008 నుండి ప్రభుత్వ - ప్రైవేట్‌-భాగస్వామ్య విధానం (పిపిపి) కింద బెర్త్‌లు, కంటైనర్‌ టెర్మినళ్ల నిర్మాణం వంటివి చేపట్టటానికి కార్పొరేట్‌ సంస్థలకు అనుమతి ఇచ్చారు. అలాగే వివిధ రాష్ట్రాల పరిధిలో బడా మైనర్‌ పోర్టుల నిర్మాణాలకు సైతం అనుమతులు ఇచ్చారు.
దీంతో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మేజర్‌ పోర్టుల కార్గోహ్యాండ్లింగ్‌ దారుణంగా పడిపోయింది. ఒక పథకం ప్రకారం మేజర్‌ పోర్టుల కార్గోహ్యాండ్లింగ్‌ మైనర్‌ పోర్టులకు మళ్ళించబడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో చూస్తే దేశంలో ఉన్న అన్ని మేజర్‌, మైనర్‌ పోర్టుల ద్వారా 1318 మిలియన్‌ టన్నుల కార్గోహ్యాండ్లింగ్‌ చేయబడింది. దీనిలో మేజర్‌ పోర్టుల ద్వారా 54 శాతం (720 మిలియన్‌ టన్నులు), మైనర్‌ పోర్టుల ద్వారా 46 శాతం (598 మిలియన్‌ టన్నులు) కార్గో హ్యాండ్లింగ్‌ జరిగింది. ఏడాది కేడాది మేజర్‌ పోర్టుల కార్గో హ్యాండ్లింగ్‌ ప్రాబల్యం తగ్గిపోయేలా పాలకులు అనేక విధానాలు చేపట్టారు.
           కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత పోర్టు రంగంలో బడా కార్పొరేట్ల గుత్తాధిపత్యం పెంచేందుకు అన్ని రకాల చట్టాలను, నిబంధనలను మార్చేస్తున్నారు. కొద్దిమంది క్రోనీలకు పోర్టులను ధారాదత్తం చేస్తున్నారు. పిపిపి విధానాన్ని మరింత సరళతరం చేశారు. మేజర్‌ పోర్టులకు రక్షణగా ఉన్న 'మేజర్‌ పోర్టుల చట్టం-1963'ను మార్చేశారు. ఈ చట్టం అమలులో ఉండటం వల్ల పోర్టులను 100 శాతం అమ్మేయటం సాధ్యం కాదు. అలాగే వివిధ ప్రభుత్వ పోర్టుల ఆస్తులపై కార్పొరేట్‌ సంస్థలకు పూర్తిస్థాయి హక్కులు కల్పించబడవు. ఇప్పటి వరకు పోర్టు రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం మేజర్‌ పోర్టుల ఆస్తులపైన 30 ఏళ్ళ లీజుకే పరిమితం కాబడ్డాయి. ఆస్తులు పూర్తిగా కార్పొరేట్లకు బదిలీ కావటానికి అవకాశం లేదు. అందువల్ల నరేంద్రమోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పోర్టుల ఆస్తులను కార్పొరేట్‌లకు పూర్తిగా బదిలీ కావటానికి అనేక చట్టాలు తీసుకొస్తున్నారు.
           మేజర్‌ పోర్టుల చట్టం-2021ని పార్లమెంట్‌లో ఆమోదింపచేసుకున్నారు. దీంతో దేశంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 12 మేజర్‌ పోర్టులు నవంబర్‌ 2021 నుండి ఈ కొత్త చట్టం పరిధిలోకి వచ్చాయి. ఈ నూతన చట్టం ప్రకారం మేజర్‌ పోర్టులు సొంతగా కార్గో హ్యాండ్లింగ్‌ చేయకూడదు. మేజర్‌ పోర్టుల వద్ద ఉన్న జనరల్‌ బెర్త్‌లు, ఆయిల్‌ బెర్త్‌లు, కంటైనర్‌ బెర్త్‌లు, కంటైనర్‌ టెర్మినళ్లు, క్రూజ్‌ టెర్మినల్‌ తదితరాలన్నీ ప్రైవేట్‌ సంస్థలే నిర్వహించాలి. కేవలం ల్యాండ్‌లార్డ్‌ పోర్టులుగా మాత్రమే విధులు నిర్వర్తించాలి. ఆఖరికి పోర్టుల భూములు, ఉద్యోగుల క్వార్టర్లు, పోర్టులు నిర్వహిస్తున్న ఆసుపత్రులు, స్టేడియమ్‌లు, గ్రౌండ్లు అన్నీ కూడా ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చేయాలి. వీటిని ప్రైవేట్‌ సంస్థలకు అప్పజెప్పినందుకు ఆ సంస్థలు పొందే ఆదాయంలో కొద్ది భాగం పోర్టులకు ఇస్తాయి.
            గత జులైలో బొంబాయిలో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ (జెఎన్‌పిటి)ను దేశంలో మొట్టమొదటి ల్యాండ్‌లార్డ్‌ పోర్టుగా మోడీ ప్రభుత్వం ప్రకటించింది. ఇది ప్రభుత్వ పోర్టు. 7 వేల ఎకరాల్లో నిర్మించబడింది. ప్రపంచంలో ఉన్న కంటైనర్‌ టెర్మినల్‌ పోర్టుల్లో 27వ ర్యాంకు కలిగి వుంది. దీనికి వందల కోట్లు రిజర్వు నిధులు వున్నాయి. టర్నోవర్‌లో 50 శాతంపైగా లాభాలు ప్రతి ఏడాది పొందుతున్నది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ పోర్టును పూర్తిగా బడా కార్పొరేట్‌ల పరం చేశారు.
          కరోనా కాలంలో ఆత్మ నిర్భర్‌ భారత్‌ పేర దేశంలో జాతీయ మోనెటైజేషన్‌ పైప్‌లైన్‌ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మి 2022-25 మధ్యకాలంలో రూ.6 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 9 పోర్టుల్లో 31 బెర్త్‌లను కార్పొరేట్‌ల పరం చేసి రూ.14,483 కోట్లు రాబట్టటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మేజర్‌ పోర్టులలో 86 ప్రాజెక్టులను పిపిపి కింద కార్పొరేట్‌ సంస్థలు నిర్వహిస్తున్నాయి. అలాగే ఈ పోర్టుల కింద ఉన్న మొత్తం 240 బెర్త్‌లలో 66 బెర్త్‌లు కార్పొరేట్‌ సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. 2025 నాటికి మిగిలిన బెర్త్‌లనింటిన్ని కార్పొరేట్‌లకు కట్టబెట్టటానికి ప్రయత్నం చేస్తున్నారు.
          ఇప్పుడు సముద్ర తీర ప్రాంతంలో నిర్మించే పోర్టులపై రాష్ట్రాలకు ఎటువంటి అధికారం, హక్కు లేకుండా మరో చట్టం తీసుకురాబోతున్నది. 'భారత పోర్టుల బిల్లు-2022' పేర ముసాయిదా బిల్లును తయారు చేసి పార్లమెంట్‌ ముందు ఉంచబోతున్నది. ఈ బిల్లు అమలులోకి వస్తే ఇప్పటి వరకు రాష్ట్ర పరిధిలో ఉన్న సముద్ర తీరంలో కొత్తగా మైనర్‌ పోర్టుల ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్న మైనర్‌ పోర్టుల నిర్వహణ, అజమాయిషీ కలిగి ఉండే అధికారాలను రాష్ట్రాలు కోల్పోతాయి. ''మారిటైమ్‌ స్టేట్స్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌'' లో రాష్ట్రాలు కేవలం సలహాలు, సూచనలు చేయడానికే పరిమితం కాబడతాయి. ఈ చర్య రాష్ట్రాలకు సముద్రతీరంపై ఉన్న హక్కులు, సమాఖ్య స్ఫూర్తిని చావుదెబ్బ తీస్తుంది.
           ఈ నిరంకుశ బిల్లు వెనుక 9 రాష్ట్రాల పరిధిలో ఉన్న (మొత్తం 7517 కి.మీ) తీర ప్రాంతం మొత్తాన్ని కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేయడమనే కుట్ర దాగివుంది. ఈ బిల్లు ద్వారా మొత్తం తీరప్రాంతంపై కేంద్రానికే సర్వహక్కులు కల్పించుకోబోతున్నది. ఇప్పటికే కార్గోహ్యాండ్లింగ్‌లో కార్పొరేట్‌ పోర్టుల ఆధిపత్యం పెరుగుతున్నది. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు తమ పరిధిలోని ప్రాంతీయ బడా పెట్టుబడిదారుల చేత అనేక పోర్టులు నిర్మించాయి. కొన్ని పిపిపి కింద కూడా ఉన్నాయి. వీటన్నింటిపై కేంద్ర అజమాయిషీతోపాటు వాటిని అదానీ లాంటి క్రోనీల పరం చేయటానికి మోడీ ప్రభుత్వం పాల్పడుతున్నది.
           దేశంలో ఇప్పటికే పోర్టు రంగంలో అదానీ సంస్థ అతి పెద్ద సంస్థగా ఎదిగింది. దేశంలో అన్ని పోర్టుల ద్వారా జరిగే కార్గో హ్యాండ్లింగ్‌లో 30 శాతం వాటాకి చేరింది. గత ఏడాది ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పెట్టుబడిదారులు విశాఖలో నిర్మించిన గంగవరం పోర్టును, నెల్లూరు వద్ద నిర్మించిన కృష్ణపట్నం పోర్టును మోడీ అండతో అదానీ సొంతం చేసుకున్నారు. దేశంలోని ప్రాంతీయ ప్రైవేటు పోర్టులన్నిటినీ స్వాధీనం చేసుకోవటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2024 నాటికి 500 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌కు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేగాక 2030 నాటికి దేశంలో మొత్తం పోర్టు రంగంపై, సముద్రతీర వ్యాపారంపై అదానీ పోర్ట్సు సంస్థ ఏకస్వామ్యం సాధించటానికి మోడీ- అదానీ ద్వయం వ్యూహ రచన చేసింది. ఈ వ్యూహం దేశ ఆర్థిక వ్యవస్థకే కాక దేశ రక్షణకు కూడా పెనుముప్పు తెస్తుంది.

(వ్యాసకర్త సెల్‌ : 9490098792)
డా|| బి.గంగారావు

డా|| బి.గంగారావు