Oct 01,2023 12:33

పాము మనల్ని కాటు వేసే ముందు హెచ్చరిస్తుందా? ఆ హెచ్చరికను మనం అర్థం చేసుకుంటే, పాము కాటు నుంచి తప్పించుకోవచ్చా? అనే విషయాలు తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు.

99

'మనం పాములను చూసి భయపడాల్సిన పనిలేదు. ఎందుకంటే పాములకే మనం అంటే భయం' అన్నారు స్నేక్‌ క్యాచర్‌ ధర్మేంద్ర త్రివేదీ. 
గుజరాత్‌కు చెందిన ధర్మేంద్ర త్రివేదీ 38ఏళ్లుగా జనావాసాల్లోకి వచ్చిన పాములను పట్టుకుని, సురక్షితంగా వాటిని అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టే బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. పాముల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు.
పాముల ప్రవర్తన గురించి తెలుసుకుంటే, వాటి కాటుకు గురయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చన్నారు.
'విషం అనేది పాములకు వేటాడే ఆయుధం. దీని ద్వారానే అవి ఆహారాన్నీ సంపాదించుకుంటాయి. అందుకే విషాన్ని చాలా జాగ్రత్తగా వాడతాయి. తప్పించుకోవడానికి దారేదీ కనిపించని పరిస్థితుల్లోనే పాము మనిషిని కాటు వేస్తుంది. పాము ఎదురైనప్పుడు ఏ మాత్రం భయం లేకుండా కదలకుండా ఉండిపోతే, అదే మీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది' అని అన్నారు.
మనదేశంలో పాముకాటు ప్రమాదాలు వర్షాకాలంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. సమయానికి చికిత్స అందకపోతే మరణం సంభవించే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది.
ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ కాటు వేసే ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
'కట్లపాము ఎప్పుడు కాటువేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ ''స్స్‌ స్స్‌..'' అని శబ్ధం చేస్తాయి. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్ధం చేయడం వంటివి చేస్తాయి. పాముల ప్రవర్తనను నిశితంగా గమనించగలిగితే పాము కాటు నుంచి తప్పించుకోవచ్చు' అని ధర్మేంద్ర త్రివేది అన్నారు.
'కట్లపాము విషయానికి వస్తే, రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాలలో కనిపిస్తాయి. అవి బూడిద, గోధుమ రంగుల్లో ఉంటాయి కాబట్టి, ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయి' అని ఆయన అన్నారు.
కాటేస్తే.. ఏం చేయాలి, ఏం చేయకూడదు?
స్నేక్‌ క్యాచర్‌ ధర్మేంద్ర త్రివేదీ 2008లో పామును పట్టుకునే సమయంలో దాని కాటుకు గురయ్యారు.
ఆ సంఘటనను త్రివేదీ గుర్తుచేసుకున్నారు.
'పాము కోరలు ఇంజెక్షన్‌ లాంటివి. ఇంజెక్షన్‌ను ఎలాగైతే నేరుగా కండరంలోకి లేదా నరంలోకి, లేదంటే చర్మపు పొర మధ్యన ఇస్తారో.. అలాగే పాము విషం కూడా శరీరంలోకి మూడు విధాలుగానే ప్రవేశిస్తుంది. పాము కాటుకు గురైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికో, సంబంధిత డాక్టర్‌ దగ్గరకో వెళ్లి, వెంటనే చికిత్స తీసుకోవాలి. అంతేకానీ మంత్రాలతో విషాన్ని తీసేస్తామని ప్రచారం చేసుకునే మాయగాళ్ల దగ్గరకు వెళ్లకూడదు' అన్నారు.
'పాము కరిచిన పది నిముషాల్లోపే నేను ఆసుపత్రిలో చేరాను. సమయానికి సరైన చికిత్స తీసుకున్నందు వల్లే ప్రాణాలతో బయటపడ్డాను. అయితే, నేను తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే పాము కాటు నుంచి తప్పించుకునే వాడిని. కాటు వేయడం పాముల సహజ స్వభావం కదా!' అని వివరించారు.
డా. దోషి మాట్లాడుతూ, 'ప్రస్తుతం పల్లెల్లోనూ 108 అంబులెన్స్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ పాము కాటుకు గురైతే వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలి. వైద్యం కూడా అందుబాటులోనే ఉంది కాబట్టి, పాములను చంపాల్సిన అవసరం లేదు. పాముల విషానికి విరుగుడు ఇచ్చే మందులు అందుబాటులోనే ఉన్నాయి' అన్నారు.
ఏం చేయాలి?
పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకోడదు. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్లాలి.
ఏం చేయకూడదు?
పాము కాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీని వలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టు కట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. పాము కాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణమూ విలువైనదే అని గుర్తుంచుకోవాలి.