Nov 05,2023 07:09

అభివృద్ధి చెందిన, చెందుతున్న పెట్టుబడిదారీ దేశాల్లో సాంకేతిక పెరుగుదల వలన తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఈ కారణంగా పెట్టుబడిదారులకు వచ్చే లాభాల్లో కార్మికులకు వాటా రావాలంటే పని గంటలు తగ్గించాలనే డిమాండ్‌ వస్తోందని ఇతర దేశాల అనుభవాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇండియాలో కూడా అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో కాకపోయినా .... సాంకేతికత, ఆధునికత పెరిగి తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేసే భారం కార్మికులపై పడుతోంది. అందుకని మన దేశంలోని కార్మిక సంఘాలు కూడా వారానికి 35 గంటలకు (5 రోజులు, రోజుకు 7 గంటలు చొప్పున) తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రపంచమంతా వస్తున్న ఈ పరిణామాలను గమనించకుండా నారాయణమూర్తి తమ వర్గాల ప్రయోజనాల కోసం గుడ్డిగా వారానికి 70 గంటలు పని చేయాలని నూరిపోస్తున్నారు.

నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే వుంటారని రష్యా విప్లవనేత లెనిన్‌ చెప్పాడు. సుదీర్ఘకాలం పాటు అభివృద్ధి చెందగలిగే కొత్త (స్టార్టప్‌) కంపెనీలకు, వ్యాపారాలకు పెట్టుబడులు ఫైనాన్స్‌ చేసే (వెంచర్‌ క్యాపిటల్‌) సంస్థ '3 వన్‌ 4 క్యాపిటల్‌' మూడు భాగాల వీడియో సిరీస్‌ను ప్రారంభించింది. నాయకత్వ లక్షణాలను ప్రదర్శించగల్గిన పెట్టుబడిదారులతో ఇంటర్వ్యూలు చేసి తన మొదటి వీడియోను విడుదల చేసింది. 'ఇన్ఫోసిస్‌' పూర్వ యజమాని నారాయణ మూర్తిని, అదే సంస్థకు నాయకత్వం వహించిన మోహన్‌దాస్‌ పారు ఇంటర్వ్యూ చేశారు.
           1947లో ప్రజలకు రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందని, ఆర్థిక స్వాతంత్య్రం రాలేదని మనం ఇప్పటి వరకు చెప్తున్నాం. కానీ నారాయణ మూర్తి తన ఇంటర్వ్యూలో 1947లో తమకు (పెట్టుబడిదారులకు) రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందని, 1991 నుండి ఆర్థిక స్వాతంత్య్రం వచ్చిందన్నారు. 1991కి ముందు పెట్టుబడిదారులకు ఆర్థిక స్వేచ్ఛ లేదని పరోక్షంగా చెప్పారు. '75 సంవత్సరాల ఇండియా' పేరుతో రికార్డవుతున్న ఈ వీడియోలలో సరళీకరణ విధానాలు వచ్చిన తరువాతనే దేశంలో ఆర్థికాభివృద్ధి (జిడిపి) ఎక్కువగా జరుగుతోందన్నారు. అయితే అదే సమయంలో గత 9 సంవత్సరాల మోడీ పాలనలో అభివృద్ధి మందగించటాన్ని ప్రస్తావించలేదు.
          వాస్తవిక భవిష్యత్తును అంచనా వేయగలిగేదిగా షేర్‌ మార్కెట్‌ను నారాయణమూర్తి ప్రశంసించారు. కానీ పెట్టుబడిదారీ వర్గం దీన్ని మోసపూరితంగా నియంత్రించి తమ సంపదలు ఎలా పెంచుకుంటున్నదో మాత్రం చెప్పలేదు. మార్కెట్‌లో రిలయన్స్‌ (యూనిట్‌ 64), అదానీ సంస్థల బాగోతాలను ప్రజలు మర్చిపోతారని ఆయన భావిస్తున్నట్టున్నారు. రాజకీయాలను కూడా శాసించే స్థాయికి షేర్‌ మార్కెట్‌ ఎదిగిందన్న వాస్తవాన్ని దాచిపెట్టడం అసాధ్యం.
         అయితే నారాయణ మూర్తి తన ఇంటర్వ్యూలో కొన్ని వాస్తవాలను కూడా అంగీకరించారు. సరళీకరణ విధానాలు మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి, సంపన్నులకు మాత్రమే ఉపయోగపడ్డాయని...దిగువ మధ్యతరగతికి, పేదలకు లాభించలేదని ఆయన చెప్పక తప్పలేదు. వాస్తవాల నుండి ఎవరూ తప్పించుకోలేరు. మరింత మంచి భవిష్యత్‌ కోసం ఏం చేయాలో చెప్పమని కోరినప్పుడు ఆయన సూచించిన ప్రత్యామ్నాయం ఆదిలోనే హంసపాదులా తయారైంది. ఇక్కడ కూడా వాస్తవాలకు దూరంగా వెళ్ళిన నారాయణ మూర్తి బండి పల్టీ కొట్టింది. నారాయణ మూర్తి, మోహన్‌దాస్‌ పారులు కేవలం తమ అభిప్రాయాలనే కాక మొత్తం బడా కార్పొరేట్‌ పెట్టుబడుల కోర్కెలను ఆవిష్కరించారు. తమ వర్గ ప్రయోజనాలకు ఏది లాభమో అదే చెప్పారు.
             జపాన్‌లో కార్మికులు, ఉద్యోగలు సమ్మెలు చేయరని, ఎక్కువ పనిచేసి తమ నిరసనను తెలియజేస్తారని చాలా కాలం నుండి వింటున్నాం. దీనికి సింగపూర్‌ను కూడా జతచేయడం మనకు తెలుసు. అందుకనే ఆ దేశాలు బాగా అభివృద్ధి చెందాయని ప్రచారం చేశారు. అయితే అదిప్పుడు నడవడంలేదు. కానీ నారాయణ మూర్తి మరలా దీన్ని అందుకున్నారు. 75 పంవత్సరాల భారతదేశం మరింత అభివృద్ధి కావాలంటే, తమకు మంచి భవిష్యత్‌ కావాలంటే దేశ యువత వారానికి 70 గంటలు (రోజుకు 11.66 గంటలు అంటే 12 గంటలు) పనిచేయాలని సూచించారు.
           కార్మికులు ఎక్కువ గంటలు పనిచేయబట్టే అక్కడ ఉత్పాదకత పెరిగి జపాన్‌, జర్మనీలు అభివృద్ధి చెందాయని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ప్రపంచంలో మన దేశ కార్మిక ఉత్పాదకత చాలా తక్కువని, ఉత్పాదకతను పెంచుకోవాలని, అందుకోసం వారానికి 70 గంటలు పని చేయాలని సూచించారు. ఇటీవల (అక్టోబర్‌ 31) హిందూ పత్రికలో వచ్చిన పరిశోధనాత్మక వ్యాసంలో పేర్కొన్న అంశాలను చూసినప్పుడు ఆయన చేసిన వాదన తప్పని తేలింది.
            జపాన్‌, జర్మనీల గురించి నారాయణ మూర్తి చెప్పినది, మనం చిన్నప్పటి నుండి వింటున్నది వాస్తవం కాదని తేలింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్‌లలో కార్మికులు సంవత్సరానికి 2200 నుండి 2400 గంటలు పనిచేశారు. అక్కడ 5 రోజుల వారం కాబట్టి ఆ ప్రకారం లెక్కేసినా ఈ దేశాలలో పనిచేసింది రోజుకు 8.3 నుండి 9 గంటలు మాత్రమే. నారాయణ మూర్తి ఊహించిన దానికంటే 3 గంటలు తక్కువ. కానీ ఆ తర్వాతి కాలంలో 1970 నుండి 2020 నాటికి ఈ దేశాలలో 1400 నుండి 1600 గంటలు మాత్రమే పనిచేశారు. రోజుకి 5.3 నుండి 6 గంటలు మాత్రమే పనిచేశారు.
          నారాయణ మూర్తి మరో విషయం దాచిపెట్టారు. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందే జర్మనీ, జపాన్‌ దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయనే వాస్తవాన్ని ఆయన చెప్పలేదు. మన దేశంలో 2019లో నిర్వహించిన కాల వినిమయ సర్వే ప్రకారం 15-29 సంవత్సరాల మధ్య ఉన్న భారత దేశ కార్మికులు సరాసరిన రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో 7.2 గంటలు, పట్టణాల్లో 8.5 గంటలు పని చేశారు. జపాన్‌, జర్మనీ దేశాల కార్మికుల కంటే ఎక్కువ గంటలు పని చేశారు.
            ఉత్పాదకత పెరుగుదల సాంకేతికత మీద ఆధారపడి ఉంటుంది. పని గంటలను బట్టి కాదని జర్మనీ, జపాన్‌ల అనుభవాలు రుజువు చేశాయి. ఆ రెండు దేశాల్లో పనిగంటలు తగ్గాయి. ఉత్పాదకత మాత్రం తీవ్రంగా జపాన్‌లో గంటకు 43 డాలర్లు, జర్మనీలో గంటకు 69 డాలర్లకు పెరిగింది. మన దేశ కార్మికులు అక్కడి కార్మికుల కంటే ఎక్కువ పని చేసినా 1970లో ఉత్పాదకత గంటకు 2 డాలర్ల నుండి 2020లో 9 డాలర్లకు కొద్దిగానే పెరిగింది. గంట పనికి ఉత్పత్తి అయ్యే స్థూల జాతీయోత్పత్తి భాగాన్ని శ్రమ ఉత్పాదకతగా లెక్కిస్తారు. జర్మనీలో 4.2, జపాన్‌లో 8 శాతం మాత్రమే అసంఘటిత రంగ కార్మికులు ఉండగా, మన దేశంలో నూటికి 89 మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. అసంఘటిత రంగం కూడా అత్యధికంగా ఉంది. అటువంటప్పుడు జర్మనీ, జపాన్‌ కార్మికులతో ఇండియా కార్మికుల ఉత్పాదకతను పోల్చడం పెద్ద తప్పు.
            నారాయణమూర్తి తన ఇంటర్వ్యూలో అమెరికా, చైనాలను పదే పదే ప్రస్తావించారు. ఒకప్పుడు తమ వర్గాల ప్రపంచ సమావేశాల్లో ఎక్కువగా అమెరికా పేరు వచ్చేదని, చైనా పేరు తక్కువగా వచ్చేదని చెప్పారు. ఇప్పుడు అమెరికా పేరు గురించి చెప్పుకోవడం తగ్గి, చైనా పేరు ప్రపంచ సమావేశాల్లో ఎక్కువగా వస్తోందని చెప్పారు. ఈ విషయం చెప్పిన నారాయణ మూర్తి జపాన్‌, జర్మనీల కార్మికుల పని గంటలను మాత్రమే ప్రస్తావించారు. చైనా గురించి చెప్పలేదు.
            ఇటీవల కాలంలో అమెరికాలో మోటారు రంగ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేసి విజయం సాధించారు. ఆ సమ్మె తర్వాత అమెరికాలో ఉన్న 40 గంటల పనిని (5 రోజులు, రోజుకు 8 గంటలు) 32 గంటలకు (4 రోజులు, 8 గంటలు చొప్పున) తగ్గించాలని అక్కడి కార్మికవర్గం డిమాండ్‌ చేసింది. ఫ్రాన్స్‌లో వారానికి 35 గంటలు (5 రోజులు, రోజుకు 7 గంటలు) పనిచేస్తున్నారు. దీనిని 32 గంటలకు తగ్గించాలని అక్కడి కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. నార్వే, స్విట్జర్‌లాండ్‌, డెన్మార్క్‌, బెల్జియం దేశాల్లో కూడా 35 గంటల పని విధానం ఉంది.
           అభివృద్ధి చెందిన, చెందుతున్న పెట్టుబడిదారీ దేశాల్లో సాంకేతిక పెరుగుదల వలన తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఈ కారణంగా పెట్టుబడిదారులకు వచ్చే లాభాల్లో కార్మికులకు వాటా రావాలంటే పని గంటలు తగ్గించాలనే డిమాండ్‌ వస్తోందని ఇతర దేశాల అనుభవాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇండియాలో కూడా అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో కాకపోయినా...సాంకేతికత, ఆధునికత పెరిగి తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తి చేసే భారం కార్మికులపై పడుతోంది. అందుకని మన దేశంలోని కార్మిక సంఘాలు కూడా వారానికి 35 గంటలకు (5 రోజులు, రోజుకు 7 గంటలు చొప్పున) తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ప్రపంచమంతా వస్తున్న ఈ పరిణామాలను గమనించకుండా నారాయణమూర్తి తమ వర్గాల ప్రయోజనాల కోసం గుడ్డిగా వారానికి 70 గంటలు పని చేయాలని నూరిపోస్తున్నారు.
         మోడీ ప్రభుత్వం 2020లో పార్లమెంట్‌లో పాస్‌ చేసిన లేబర్‌ కోడ్ల ప్రకారం కూడా వారానికి 48 గంటలకు మించి కార్మికులతో పని చేయించుకునే అవకాశం లేదు. అటువంటిది ఇప్పుడు 70 గంటలు పనిచేయాలని నారాయణ మూర్తి చెప్తున్నారు. కార్మిక శ్రమను మరింత తీవ్రతతో దోపిడీ చేయాలనే పెట్టుబడిదారుల ఆకాంక్ష నారాయణ మూర్తి అసంబద్ధ వాదనలో కనపడుతోంది. అయితే దేశ కార్మిక వర్గం తమకు ఈ అవకాశం ఇవ్వదని నారాయణ మూర్తి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెట్టుబడిదారీ వర్గం తెలుసుకోవాలి.

( వ్యాసకర్త సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు )
పి. అజయ కుమార్‌

ajay kumar