Jul 16,2023 08:28

ప్రజాశక్తి - నందికొట్కూరు/పగిడ్యాల : విప్లవకారుడినని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకోవడం సిగ్గుచేటని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె.రోజా అన్నారు. విప్లవకారుడంటే ఎలా ఉంటారో పవన్‌ కల్యాణ్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు, పగిడ్యాలలో రూ.2.38 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియాలను శనివారం ఆమె ప్రారంభించారు. అనంతరం పాతముచ్చుమర్రి గ్రామంలోని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నివాసంలో ఆమె విలేకరు సమావేశంలో మాట్లాడారు. పవన్‌ కల్యాణ్‌ వార్డు సభ్యుడిగా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గురించి మాట్లాడడం సరికాదన్నారు. 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా క్రీడా కార్యక్రమాలు చేపట్టి క్రీడల అభివద్ధికి దాదాపు రూ.ఐదు కోట్ల ఖర్చు చేసినట్లు తెలిపారు. మంత్రి ఆర్‌కె.రోజా పర్యటన సందర్భంగా నందికొట్కూరు, పగిడ్యాలలో వెలిసిన ప్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే తోగురు ఆర్థర్‌ ఫొటో లేకపోవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే సొంత పనుల మీద క్యాంపు వెళ్లినట్లు ఆయన వర్గీయులు తెలిపారు. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్‌ మధ్య వర్గ విబేధాలున్నాయని అందుకే రాలేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.