Nov 11,2022 06:52

ర్మాన్ని రక్షించండి...ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అని నిత్యం పలికేచోట అధర్మం రాజ్యమేలుతోంది. రెండేళ్లుగా తిరుపతి నగరంలో న్యాయం కోసం కడుపు మాడ్చుకుని రిలే దీక్షలు చేస్తున్న అటవీ కార్మికులను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఈ పేద కార్మికుల న్యాయమైన సమస్యలను పట్టించుకుని పరిష్కరించే ఓపిక, తీరిక లేదన్నట్టుగా వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది.
          'అయినవారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో' అన్న లోకోక్తి ఇక్కడ అతికినట్టు సరిపోతుంది. ఒకే నీడన 362 మంది కార్మికులు 30 ఏళ్లుగా పని చేస్తుంటే 162 మందిని పర్మినెంటు చేసి, సిఐటియు ఆధ్వర్యంలో పోరాడుతున్న 200 కార్మికులను లక్ష్మీశ్రీనివాస కార్పొరేషన్‌లో కలిపివేసిన ఘన చరిత్ర టిటిడి యాజమాన్యానిది.
        స్వల్ప కారణాలను సాకుగా చూపి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా టిటిడి యాజమాన్యం, బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించాయి. 30 ఏళ్లుగా టిటిడి లోని అటవీ విభాగాన్ని నమ్ముకుని పనిచేస్తున్న 362 మంది కార్మికుల్ని పర్మినెంటు చేయమని పోరాడుతుంటే అధికార పార్టీ నేతలు తమ స్వార్ధపూరిత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 200 మంది కార్మికులకు అన్యాయం చేశారు.
     వాస్తవంగా తిరుమల కొండ పచ్చదనానికి ప్రసిద్ధి. ఒక్కసారి వచ్చిన యాత్రికులు ఈ వాతావరణానికి పులకించి మళ్లీ, మళ్లీ రావాలని కోరుకుంటారు. ప్రధాని మోడీ సైతం మెచ్చి టిటిడికి 'స్వచ్ఛభారత్‌' అవార్డును అందించారు. ఈ అవార్డు రావటానికి ప్రధాన కారకులు అటవీ కార్మికులని పలువురు ఐఏఎస్‌లు బహిరంగంగానే చెబుతుంటారు.
      తిరుపతి నగరంలోని రోడ్ల మధ్య డివైడర్లు, పార్కులు తిరుమలలోని శిలాతోరణం, సుందరమైన పార్కుల అభివృద్ధిలో కీలకమైన పాత్రధారులు ఈ అటవీ కార్మికులు. గతంలో వేసవి రోజుల్లో ఒకసారి తిరుమల కొండ తగలబడిపోతుంటే భారత సైన్యం సైతం హెలికాప్టర్‌లతో మంటలను ఆర్పటానికి ప్రయత్నం చేసి చేతులెత్తేసింది. నాటి గవర్నర్‌ నరసింహన్‌ జోక్యం చేసుకుని పలు విధాలుగా ప్రయత్నం చేశారు. విధిలేని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఈ అటవీ కార్మికులు ఒళ్లంతా గోతాలు చుట్టుకుని పచ్చటి మండలు (ఆకులతో కూడిన చెట్ల భాగాలు) పట్టుకుని మంటలను ఆర్పివేసి 'శభాష్‌' అనిపించారు. ఇంత కష్టం చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు పూర్వ ఇ.ఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ విశ్వప్రయత్నం చేశారు.
        టిటిడి బోర్డు 362 మంది కార్మికులకు టైమ్‌ స్కేలు అమలు చేయాలని 2019లో తీర్మానించింది. తీర్మానాన్ని అమలు చేయకుండా రకరకాల సాకులు చెబుతూ వెయ్యి రూపాయల అదనపు జీతం తోడు చేసి ఇవ్వాల్సిన అలవెన్స్‌లన్నీ రద్దు చేసి టిటిడి యాజమాన్యం టైమ్‌ స్కేల్‌కు కొత్త భాష్యాన్ని చెప్పింది.
         తాను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో రెగ్యులరైజ్‌ చేస్తానని ఎన్నికలకు ముందు స్వయంగా వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. తిరుపతి పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రిని టిటిడి అటవీ కార్మికులు కలిస్తే...అరే! మీరు రెగ్యులరైజ్‌ కాలేదా!?...అంటూ ఆశ్చర్యం ప్రకటించి 24 గంటల్లో అమలవుతుందని ప్రకటించారు. ఆ 24 గంటలు ఎప్పుడు వస్తాయా!? అని ఏడాదిగా కార్మికులు ఎదురు చూస్తున్నారు.
           రాష్ట్ర హైకోర్టు సైతం ఈ కార్మికులకు సమాన పనికి - సమాన వేతనం ఇవ్వాలని ఆదేశించింది. ఆ ఆదేశం నేటికీ అమలు కావటం లేదు. 2019లో టిటిడి బోర్డు చేసిన తీర్మానం ప్రకారం టైమ్‌ స్కేలు అమలు చేయకపోగా కొత్త భాష్యాలు చెప్పి బలవంతంగా లక్ష్మీశ్రీనివాసా కార్పొరేషన్‌లో కలిపివేశారు. కోర్టు ఆదేశాలు ధిక్కరించిన కారణంగా రాష్ట్ర హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి.
        న్యాయం జరగకపోవటంతో...2020వ సంవత్సరం లో కోర్టు ఆదేశాలను, ముఖ్యమంత్రి హామీని (లేదా) టిటిడి బోర్డు తీర్మానం ప్రకారం అలవెన్స్‌లతో కూడిన టైమ్‌ స్కేలును అమలు చేయాలని కోరుతూ కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్షలు ప్రారంభించి ఈ నవంబర్‌ 12వ తేదీ నాటికి రెండు సంవ్సతరాలు పూర్తవుతుంది. రెండేళ్లు కావస్తున్నా పేద అటవీ కార్మికుల కష్టాన్ని టిటిడి యాజమాన్యం పట్టించుకోకపోవటం అన్యాయం.
        టిడిపి అధికారంలో ఉన్న రోజుల్లో అటవీ కార్మికులకు మద్దతుగా ప్రస్తుత రాష్ట్ర మంత్రి రోజా, ప్రభుత్వ విప్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిలు ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక కనీసం పట్టించుకోవడం మానేశారు. రెండేళ్లుగా వంతుల వారీగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న అటవీ కార్మికులను పట్టించుకోకపోవటం ఏపాటి న్యాయమో పాలకులు చెప్పాలి.
         ఈ రెండేళ్లలో అటవీ కార్మికుల దీక్షాశిబిరం వద్ద వివిధ పార్టీల జాతీయ, రాష్ట్ర నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. కార్మికుల దీక్షా శిబిరానికి వచ్చి ప్రతి రోజూ ఫోటోలు తీసి ఇంటలిజెన్స్‌ పోలీసులు ప్రభుత్వానికి పంపుతున్నారు. ప్రతిరోజూ ఉదయం కార్యాలయానికి వస్తూనే 'అటవీ కార్మికుల దీక్షలు' గురించిన సమాచారం చూడాల్సి వస్తున్నదని స్వయంగా తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకట రమణా రెడ్డి వ్యాఖ్యానించారు.
       అధికారులకు, ప్రభుత్వానికి తెలియక కాదు. సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాన్ని కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది కార్మికులు అనారోగ్యంతో మరణించారు. మరికొంత మంది పని ప్రదేశాలలో పాము కాటుకు గురయి, మంటలలో కాలిపోయి, దుమ్మధూళిలో దీర్ఘకాలికంగా పని చేస్తూ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో కొందరు కార్మికులు ఊపిరితిత్తుల జబ్బులకు గురై మరణించారు. టిటిడిని, తిరుమల వెంకన్న స్వామిని నమ్ముకుని 30 ఏళ్లుగా పని చేస్తున్న వారిలో జీవించి ఉన్న వారికైనా న్యాయం చేయమని సిఐటియు నాయకత్వంలో పోరాడుతుంటే అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు అమానుషంగా ఉంది.
         ఇప్పటికైనా తిరుమల వెంకన్న సేవలో ఉన్న పేద అటవీ కార్మికులకు టిటిడి పెద్దలు, రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

/ వ్యాసకర్త : సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, తిరుపతి /
కందారపు మురళి

కందారపు మురళి