
ఆంధ్రప్రదేశ్‌ను స్వచ్ఛమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు హరిత రాయబారులు (గ్రీన్ అంబాసిడర్లు) ఎంతో శ్రమిస్తున్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచుతున్నారు. కుళ్ళు కాలువల్లో చెత్తను, పూడికను తీసి దోమలు చేరకుండా మన ఆరోగ్యాలను కాపాడుతున్నారు. గ్రామాల్లో మృతి చెందిన జంతువులను తొలిగించి దుర్వాసన లేకుండా చేస్తున్నారు. ఎక్కడైనా అనాథలు చనిపోతే అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. ఇటువంటి పనులు చెయ్యడానికి ఎవరూ ఇష్టపడరు. అయినా చెయ్యడానికిగల కారణం వాళ్ళందరూ రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు, సామాజికంగా ఎన్నో ఏళ్లపాటు అణచివేయబడిన దళితులు. ఇంటిల్లపాదిని ఆరోగ్యంగా ఉంచుతున్న వీళ్లు వారి ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. తమ కుటుంబ సభ్యులకు తిండి పెట్టలేకపోతున్నారు. సంక్రాంతి పండగ అంటే తెలుగు ప్రజలు కొత్త బట్టలు వేసుకొని, మంచి పిండివంటలతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే వీరికి కొద్ది నెలలుగా (9 నుంచి 22 నెలల వరకు) జీతాలు లేవు. దీంతో పండగ రోజు కొత్త బట్టలు, పిండివంటల సంగతి తర్వాత. కనీసం పొట్ట నింపుకోలేక పస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల రాయితీలు ఇస్తుంది. కానీ సామాన్య ప్రజలపై భారాలు మోపుతుంది. అందులో భాగంగానే రాష్ట్రాలకు వచ్చే పన్నులను కేంద్రం జీఎస్టీ పేరు మీద వసూలు చేస్తూ తిరిగి రాష్ట్రాలకు చెందాల్సిన నిధులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు వేసింది. మున్సిపాలిటీ, పంచాయతీ అభివృద్ధికి అవసరమైన నిధులను పన్నుల రూపంలో వసూలు చేసుకొమ్మంది. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం చిత్తం ప్రభు అంటూ పట్టణాలు, మున్సిపాలిటీల్లో నెలకు 60 రూపాయలు చొప్పున చెత్త పన్ను చెల్లించాలంటోంది. కుళాయిలకు మీటర్లు బిగించి నీటి పన్ను వసూలు చేస్తుంది. భూమి అధారితంగా ఇంటి పన్ను పెంచుతున్నది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి 14,000 ట్రైసైకిళ్లు, 1034 ఆటోలు కొన్నది. కానీ వాటిని నడిపే కార్మికులకు మాత్రం సంవత్సరాలు తరబడి జీతాలు చెల్లించడం లేదు. మన రాష్ట్ర వ్యాప్తంగా 23,747 మంది, విజయనగరం జిల్లాలో 2,300 మందికి పైగా గ్రీన్ అంబాసిడర్లు పనిచేస్తున్నారు. వీరికి గౌరవ వేతనం రూ.6000 నుండి రూ.10 వేలకు పెంచుతున్నట్టు 2021 నవంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. పెంచిన జీతం పక్కన పెడితే అసలు జీతాలే సంవత్సరాల తరబడి చెల్లించడం లేదు. దీనితో వారు బతుకు బండి లాగలేక రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేసి చేతులు దులుపుకున్నట్లు...రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా పంచాయతీలు చెల్లించాలని...తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేస్తుందని అంటోంది. దీంతో చాలా ప్రాంతాల్లో పంచాయతీ నిధులు లేకపోవడంతో జీతాలు చెల్లించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చెల్లించినా రెండు, మూడు నెలలు మాత్రమే చెల్లిస్తున్నారు. చాలామంది గ్రీన్ అంబాసిడర్లు జీతాలు రాకపోవడంతో కుటుంబాన్ని సాకలేక పనులు మానేయాలనుకుంటున్నారు. కానీ పని మానేస్తే బకాయి ఉన్న జీతాలు వస్తాయో రావోనన్న భయంతో పనులు చేస్తున్నారు. గ్రీన్ అంబాసిడర్లకు బకాయి జీతాలు చెల్లించాలి. ప్రభుత్వం ఇస్తామన్న గౌరవ వేతనాలు రూ.10,000 ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ సమస్యల పరిష్కారానికై గ్రీన్ అంబాసిడర్లు అందరూ కలిసి ఒక్కటిగా పోరాడాలి.
- డి.రాము,
సెల్ : 9705545164