
మనిషన్నాక రకరకాల అలవాట్లు ఉంటాయి. కానీ ఆ అలవాట్ల అదుపులో మనిషి ఉంటేనే ప్రమాదం. ఇక ఆ అలవాటు అతని వ్యక్తిత్వంలో భాగంగా మారిపోయి, అతన్ని దిగజారుస్తుంటే అంతకు మించిన వ్యసనం ఉండదు. అందుకనే వ్యసనం అన్న పదానికి ఆపద, చింత, నిష్ఫల ప్రయత్నం వంటి పర్యాయ పదాలు కనిపిస్తాయి. అలాంటి ఆపదలకు కారణం అయ్యే ఏ అలవాటైనా వ్యసనమే !
'వెలది జూదంబు పానంబు వేటపలుకు
ప్రల్లదంబును దండంబు పరుసదనము?
సొమ్ము నిష్ప్రయోజనముగ వమ్ముసేత
యనెడు సప్త వ్యసనముల జనదు తగుల?'
అంటూ మహాభారతంలోని ఉద్యోగపర్వంలో సప్తవ్యసనాల గురించి చెబుతారు. వ్యభిచారం, జూదం, మద్యపాన సేవనం, వేట, పరుషంగా మాట్లాడటం, కఠినంగా దండించడం, వృథాగా డబ్బు వెచ్చించడం వంటివి సప్త వ్యసనాలని ఈ పద్యం చెబుతుంది. అన్నింటిలోకీ మాదకద్రవ్యాలు తీసుకోవడం అత్యంత ప్రమాదకరమైన వ్యసనం. 'డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం' సందర్భంగా దీనిపైనే ఈ ప్రత్యేక కథనం..
మాదకద్రవ్యాలు తీసుకునే వ్యసనం అనేది దీర్ఘకాలికంగా పునరావతమయ్యేది. ప్రపంచవ్యాప్తంగా పేద, ధనిక దేశాలలో ప్రబలంగా ఉన్న జీవనశైలిలో డ్రగ్స్‌కి, మద్యానికి బానిసలు కావడం ఓ ధోరణిగా మారుతోంది. మద్యపానం, మాదకద్రవ్యాలు, ధూమపానం ఇప్పుడు ప్రధాన ప్రజారోగ్య సమస్యగా పరిణమించాయి. కంప్యూటర్ గేమ్స్, జూదం, పోర్నోగ్రఫీ, ఆహారంతో సహా ఇతర అనేకరకాల వ్యసనాలు వ్యక్తి ఆరోగ్యంపై, సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. సాధారణంగా మందుల దుష్ప్రభావాలు నాడీ వ్యవస్థలో, ముఖ్యంగా మెదడుపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. వైద్యశాస్త్రం ఆధునికతను సంతరించుకున్న తొలినాళ్లలో మార్ఫిన్, కొకైన్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను నొప్పి నివారణకు వాడేవారు. వీటిని వాడాక వాటికి బానిసలు కావాల్సిందే. నల్లమందు, గంజాయి, కొకైన్, నికోటిన్, కెఫిన్, మెస్కాలిన్, సైలోసిబిన్ వంటి ఈ పదార్థాలలో కొన్ని సహజ వనరుల నుండి లభిస్తే, మరికొన్ని సింథటిక్ / డిజైనర్ డ్రగ్స్ నుంచి లభిస్తాయి. ఈ పదార్థాలలోని కొన్ని ఆల్కహాల్, నికోటిన్ వంటివి చట్టబద్ధమైనవి. అయితే.. ప్రిస్క్రిప్షన్ ద్వారా చట్టబద్ధంగా లభించే మరికొన్ని హాని కలిగించేవీ వున్నాయి. చాలా దేశాల్లో చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా, తరచుగా నేర కార్యకలాపాలతో ముడిపడి ఉన్న వ్యాపారానికి ఆజ్యం పోస్తుంది. మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువత.. వారి అలవాట్లకు, అవసరాలకు సంఘ విద్రోహుల వలలో చిక్కి, అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. పలువురు సినీతారలు సైతం డ్రగ్స్ వివాదంలో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. క్లాస్ టు మాస్... అంతా మత్తులో జోగుతున్నారని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

గంజాయిదే అగ్రస్థానం
కృత్రిమంగా తయారుచేస్తోన్న డ్రగ్స్ ఎన్ని ఉన్నా.. గంజాయిదే అగ్రస్థానం. దాని ఆకులు, విత్తనాలు, పువ్వులు వీటి అన్నింటి నుంచి రకరకాల డ్రగ్స్ తయారుచేస్తారు. చరస్ అనేది జీవించి ఉన్న మొక్క నుంచి తయారుచేస్తే, హషిష్ అనేదాన్ని కోసేసిన మొక్కల భాగం నుంచి తయారుచేస్తారు. గంజాయి పచ్చి ఆకుల నుంచి భంగ్ తయారుచేస్తారు. ఉత్తర భారతదేశంలో భంగ్‌ను విరివిగా అమ్ముతుంటారు. కొన్ని పండుగల సమయాల్లో తప్పనిసరి భంగ్ వాడుతుంటారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో లైసెన్స్ వున్న షాపులు సైతం ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఉత్తర అమెరికాలో గంజాయి వినియోగదారులు వుండగా, ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్ల మంది గంజాయి వినియోగిస్తున్నారు. 2025 నాటికి గంజాయిపై చట్టబద్దంగా 33 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. కెనడాలో 2020లో గంజాయి మార్కెట్ చట్టబద్ధంగా 2.6 బిలియన్ కెనడియన్ డాలర్లు వుండగా, అది 2026 నాటికి 8.62 బిలియన్ కెనడియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కాగా, దేశవ్యాప్తంగా గంజాయి వినియోగాన్ని నిర్దిష్టంగా లెక్కించలేకపోయినా. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లెక్కల ప్రకారం.. 2018లో 12.28 లక్షల కిలోల గంజాయి స్వాధీనం కాగా, 2019లో 4.43 లక్షల కిలోలు దొరికింది. 2020లో అది 8.53 లక్షల కిలోలకు పెరిగింది. గడచిన మూడేళ్లలో మందుల షాపుల్లో దొరికే వివిధ రకాల ఇంజెక్షన్లు, రసాయనాల కాంబినేషన్లతో మత్తును సృష్టించే పదార్థాలను తయారుచేసి, వాడడం పెరిగిందని ఈ సర్వే తేల్చింది. ఆ ప్రకారం 2018లో 1.17 కోట్ల ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకుంటే 2019లో 2.07 కోట్ల ఇంజెక్షన్లు, 2020లో 5.60 కోట్ల చొప్పున స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. దేశంలోనే అత్యధికంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం పంజాబ్‌లో ఉంటున్నట్లు ఎన్సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. దేశంలో గంజాయికి అలవాటుపడ్డవారు రెండున్నర కోట్ల మంది వుంటారని అంచనా.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో పల్లె, పట్నం తేడా లేకుండా చిన్నారులను సైతం డ్రగ్స్ మహమ్మారి కాటేస్తోంది. వీటిని ఉచితంగా రుచి చూపిస్తూ... చిన్నారులను నెమ్మదిగా ఊబిలోకి దించుతున్నారు. గంజాయి, నల్లమందు, మద్యానికి అలవాటుపడిన బాల్యం మత్తుతో చిత్తవుతోంది. దేశవ్యాప్తంగా మద్యం తర్వాత ఎక్కువమంది గంజాయి సేవిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. సరదాగా అలవాటు చేసుకుంటున్న ప్రతి పది మందిలో ఇద్దరూ పూర్తిగా గంజాయికి బానిసలై పోతున్నట్లు 'భారత గ్రామీణ చైతన్య వేదిక' చేసిన సర్వేలో వెల్లడైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి పట్టుబడినా, దాని మూలాలు విశాఖ మన్యంలోనే ఉంటున్నాయి. విశాఖ మన్యంలో 20 వేల ఎకరాల్లో గంజాయి తోటలు సాగవుతుందంటే ఆశ్చర్యపోక తప్పదు మరి. ఆంధ్ర కాశ్మీర్‌గా పేరొందిన లంబసింగి నేడు గంజాయి మాఫియాకు కేంద్రంగా మారింది. లంబసింగికి పర్యాటకులుగా వచ్చేవారిలో కొందరు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలోనూ కోట్లలో వ్యాపారం సాగింది. గంజాయి మాఫియా సోషల్ మీడియాను సైతం వ్యాపార కేంద్రంగా మార్చుకుని ఆన్‌లైన్‌లో వ్యాపారం చేస్తున్నారు.

తల్లిదండ్రుల పాత్ర..
మత్తు మందుకు బానిసవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందినవారే. తల్లిదండ్రుల నిరాదరణ, ఒంటరితనం, చదువు, ఒత్తిడి.. ఇత్యాది కారణాల వల్ల యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకూ పాకుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. మధ్యతరగతి యువతను మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందు వ్యాపారం జోరుగా సాగుతోంది. దాదాపు తొమ్మిది శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పే అవకాశం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు పిల్లలతో సన్నిహితంగా వుంటే, వారిపై శ్రద్ద చూపితే... పిల్లల మాదకద్రవ్యాల దుర్వినియోగ అలవాట్లని తగ్గిస్తాయని పరిశోధనలు చూపిస్తున్నాయి. అందువల్ల, తల్లిదండ్రులు తమ పిల్లలతో మత్తు మందుల గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురించి, మీకు అది ఆమోదయోగ్యం కాదని వారికి స్పష్టంగా తెలియజేయండి.
ఎలా వచ్చింది ?
ఐక్యరాజ్యసమితి ప్రపంచ వ్యాప్తంగా మాదకద్రవ్యాలను అరికట్టే పనిలో భాగంగా దేశ, విదేశాల ప్రభుత్వాలను హెచ్చరిస్తోంది. ప్రపంచ మానవాళిని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేసేందుకుగాను 'అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినం'గా జూన్ 26వ తేదీని ఐరాస 1987లో తీర్మానించింది. మాదకద్రవ్యాల ఉచ్చులో పడకుండా మానవాళిని రక్షించేందుకు, మాదకద్రవ్యాల వాడకం లేని అంతర్జాతీయ సమాజాన్ని సృష్టించేందుకు ప్రతినబూనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఏటా జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా మాదకద్రవ్యాలను స్వాధీనపర్చుకుని దేశ దేశాల్లో బహిరంగంగా వాటిని తగులబెట్టడం, బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా ప్రజలను చైతన్యపర్చడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం వంటి చర్యలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది.

అనారోగ్య సమస్యలు..
డ్రగ్స్ నిరంతరం వాడటం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తాయి. డిప్రెషన్, మతిస్థిమితం కోల్పోవడం, ఆందోళన వంటి మానసిక సమస్యలు వస్తాయి. గుండె సంబంధిత, శ్వాసకోశ వ్యాధులు.. మూత్రపిండాలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఈ వ్యసనం ఒక్కోసారి మరణానికి దారితీస్తుంది. ఎన్‌ఐడీఏ ప్రకారం... గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి, కేన్సర్, మానసిక అనారోగ్యం, హెచ్‌ఐవీ,హెపటైటిస్ ఇతర ప్రభావాలు ఉండవచ్చు. డ్రగ్స్ వ్యసనం నివారణకు చికిత్స చేయవచ్చు. కాకపోతే, దీనికి కాస్త సమయం, కృషి కావాలి. ఇది దీర్ఘకాల ప్రక్రియ. దీనికి కుటుంబం సహకారంతోపాటు నిపుణుల అవసరం కూడా తోడవ్వాలి.
డ్రగ్స్ లేని సమాజం కోసం..
దేశ భవితకు వెన్నెముకగా నిలవాల్సిన యువత... డ్రగ్స్‌కు బానిసలై ఉగ్రవాదులుగా, సంఘ వ్యతిరేకశక్తులుగా మారుతున్నారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. మత్తులో జోగుతున్న యువతను, వ్యవస్థను... ఆ మత్తు నుంచి బయటకు తీసుకురావాలి. సమాజంలో చోటుచేసుకుంటున్న అనేక అరాచకాలకు, అమానుష ధోరణులకు ఈ మాదక ద్రవ్యాలు, మద్యం ప్రధాన కారణమని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. మానసిక ప్రవర్తనలో విపరీతమైన ధోరణులను ప్రేరేపించి, అరాచకత్వానికి పురిగొలుపుతున్న డ్రగ్స్‌నుంచి యువతను దూరం చేయాలి. డ్రగ్స్ లేని సమాజాన్ని రూపొందించడానికి అంతర్జాతీయ సమాజం మరింత కృషి చేయాలి. డ్రగ్స్ మహమ్మారి మత్తు నుంచి బయటపడితేనే సమాజానికి, యువతకు భవిత. ఇందుకు అవసరమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.

డ్రగ్స్ కర్మాగారం ఆఫ్ఘన్..!
ప్రపంచ నల్లమందు, హెరాయిన్ ఉత్పత్తిలో 80 నుంచి 90శాతం ఆఫ్ఘనిస్తాన్ నుంచే వస్తోంది. గడచిన నాలుగేళ్లలో ఆ దేశంలో నల్లమందు సాగు విస్తీర్ణం 2,50,000 హెక్టార్లకు పెరిగిందని ఐరాస అధికారులు తెలిపారు. ప్రపంచమంతటా మూడు లక్షల హెక్టార్లలో అక్రమ నల్లమందు సేద్యం నడుస్తుంటే, అందులో మూడొంతులకు పైన ఆఫ్ఘన్‌లోనే సాగవుతోంది. 2030నాటికి మాదక ద్రవ్య బానిసల సంఖ్య 11శాతం పెరుగుతుందని ఐరాస అంచనా. అలాగే, మాదకద్రవ్యాల ఉత్పత్తి అత్యధికంగా జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. పాకిస్తాన్, మయన్మార్, టర్కీ, లావోస్, తదితర దేశాల్లో గసగసాల సాగు భారీ స్థాయిలో సాగుతోంది. దీని ద్వారా తయారయ్యే నల్లమందు, దాని నుంచి ఏటా ఉత్పత్తి చేసే మాదకద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 27.5 కోట్ల మంది నిషేధిత మాదకద్రవ్యాలకు బానిసలుగా ఉన్నారని డబ్ల్యూహెచ్‌ఓ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో గంజాయి వాడేవారి సంఖ్య అత్యధికంగా 19.2 కోట్ల వరకూ ఉంటుందని, ఇంజెక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకునేవారి సంఖ్య 1.10 కోట్ల వరకూ ఉంటుందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ''అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అక్రమ మాదకద్రవ్యాల వినియోగం, దుర్వినియోగం యొక్క పరిధి అంటువ్యాధి కంటే ఎక్కువగా ప్రబలింది'' అని న్యూయార్క్‌లోని హంటర్ కాలేజీలో మనస్తత్వశాస్త్ర డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జెఫ్రీ టి. పార్సన్స్ వెల్లడించారు.

యువతపై పంజా..
దేశవ్యాప్తంగా 186 జిల్లాల్లో నాలుగు లక్షల మందికి పైగా మాదక ద్రవ్యాల వినియోగదారులపై జరిపిన సర్వేలో ఎక్కువ మంది గంజాయి, నల్లమందు, కొకైన్, ఏటీఎస్ వంటివాటికి అలవాటుపడినట్లు తేలింది. దేశ జనాభాలో 3.1 కోట్ల మంది దీని కబంధ హస్తాల్లో చిక్కుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో పది శాతం జనాభా నల్లమందు గుప్పిట్లో చిక్కుకున్నారు. గంజాయికి సైతం చాలామంది అలవాటుపడుతున్నారు. గంజాయిని పొడిగా, ద్రవంగా మార్చి విక్రయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య 2.2 కోట్లు ఉంటుందని అంచనా. మరో కోటి మంది అదనంగా దీన్ని వినియోగిస్తూ ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలలో గంజాయి వినియోగం అధికంగా ఉంది. హెరాయిన్ (బ్రౌన్‌షుగర్) సైతం భారత్‌లో అధికమే. మాదక ద్రవ్యాలను వివిధ రూపాల్లో అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. వీటి వినియోగం వల్ల 11 శాతం మంది అర్థాంతరంగా మృత్యువాత పడుతున్నారు. ఇక 20 నుంచి 25 శాతం ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల్లో 25 శాతం మంది జీవితాలను ఇది కబళిస్తోంది. మరో 22 శాతం మంది మత్తులో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు.

ఊహాలోక అనుభూతికోసం..
గంజాయి, కొకైన్, హెరాయిన్, మారిజువానా, మార్పిన్, చేరస్ వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. డ్రగ్స్ తీసుకున్న వారు ఊహా లోకంలో విహరిస్తుంటారు. దీన్నే యూపోరియా అంటాం. ఒకసారి ఈ భావన పొందిన వ్యక్తి మళ్లీ, మళ్లీ అలాంటి అనుభూతినే పొందాలని భావిస్తుంటాడు. ఉన్నత వర్గాల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. ఇటీవల మధ్యతరగతిలోనూ ఈ ధోరణి ప్రబలింది. డ్రగ్స్ వాడకంతో మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇవి దొరక్కపోతే అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడతారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడితే.. కౌన్సిలింగ్ ఇచ్చి కాపాడుకోవచ్చు.
- డా.కళ్యాణ్ చక్రవర్తి,
మానసిక వైద్యనిపుణులు

ప్రపంచ గణాంకాలు..
వియన్నాలోని యూఎన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ విడుదల చేసిన ప్రపంచ ఔషధ నివేదిక ప్రకారం.. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 275 మిలియన్ల మంది మాదకద్రవ్యాలను ఉపయోగించగా.. 36 మిలియన్లకు పైగా ప్రజలు మాదకద్రవ్యాల వినియోగ రుగ్మతలతో బాధపడుతున్నారని పేర్కొంది. 15 నుంచి 64 మధ్య వయస్సు ఉన్నవారిలో 5.5 శాతం మంది గత సంవత్సరం ఒక్కసారైనా డ్రగ్స్ ఉపయోగించారని తెలిపింది. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి కాలంలో చాలా దేశాల్లో గంజాయి వాడకం పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. 77 దేశాలలోని ఆరోగ్య నిపుణులను సర్వే చేయగా.. 42 శాతం మంది గంజాయి వాడకం పెరిగిందని చెప్పారు. అదే విధంగా ఇతర ఔషధాల వినియోగం కూడా పెరిగిందని వివరించారు. గత 24 ఏళ్లలో, కొన్ని ప్రాంతాల్లో గంజాయి వినియోగం నాలుగు రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది.

- ప్రపంచవ్యాప్తంగా అక్రమ మాదక ద్రవ్యాల వినియోగదారుల సంఖ్య దాదాపు 275 మిలియన్లు
- ప్రపంచవ్యాప్తంగా గంజాయి వినియోగదారుల సంఖ్య 200 మిలియన్లు
- ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గంజాయి వినియోగదారులు ఉన్న ప్రాంతం.. ఉత్తర అమెరికా
- ప్రతి సంవత్సరం 30-40 మిలియన్ల అమెరికన్లు గంజాయిని తాగుతున్నారు
- ప్రపంచవ్యాప్తంగా కొకైన్ వినియోగదారుల సంఖ్య 24.6 మిలియన్లు.
- ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ ఇంజెక్ట్ చేసే వ్యక్తుల సంఖ్య 14.2 మిలియన్లు
- డ్రగ్స్ ఇంజెక్షన్ చేసుకునే వ్యక్తులు అత్యధికంగా ఉన్న ప్రాంతం... యూరోప్
- 2025 నాటికి, గంజాయిపై చట్టబద్ధమైన ఖర్చు ప్రపంచవ్యాప్తంగా 33 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.
- కెనడాలో 2020లో చట్టబద్ధమైన వయోజన-వినియోగ గంజాయి మార్కెట్ పరిమాణం 2.6 బిలియన్ కెనడియన్ డాలర్లు. అది 2026 నాటికి, 8.62 బిలియన్ కెనడియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
సాహితీకారులపై ప్రభావం..
ఈ డ్రగ్ మహమ్మారికి మానవ మేధస్సు సైతం బానిసవుతోంది. బాగా చదువుకున్నవారు, సాహిత్యంలో మునిగితేలుతున్న వారు కూడా ఈ మత్తుకు అలవాటు పడుతున్నారు. ప్రఖ్యాత అమెరికన్, యూరోపియన్ రచయితలు చాలా మంది ఈ డ్రగ్స్ ప్రపంచంలో మునిగితేలినవారే. అల్డస్ హక్స్లీ, జాన్ కీట్స్, చార్లెస్ బోదిలేర్, జార్జ్ బెర్నార్డ్ షా, మపాసా, జాక్ లండన్ నుంచి అయాన్ రాండ్ దాకా చాలా పెద్ద లిస్టే వుంది. ఈ మత్తు పదార్థాలకు పుస్తకాల్లో ూశ్‌ీ, ఔవవస, +తీaరర, నవతీb అంటూ చాలా పేర్లు వున్నాయి. వీటిని తీసుకున్నప్పుడు మనిషిని 'ఇంద్రియాల్ని దాటిన ఒక స్థితికి తీసుకువెళ్తుంది. అక్కడ సృజనాత్మకత స్థాయి అత్యున్నత దశకి చేరి ఏ ఆటంకాలూ లేకుండా ప్రవహిస్తుంద'ని జేమ్స్ జాయిస్ అంటాడు. ప్రతిదాన్ని గమనించే విధానం మామూలు మనిషి కంటే లోతుగా నిశితంగా ఉంటుందట. 'పాఠకుడికి సాధ్యమైనంత గొప్ప అనుభూతిని ఇవ్వడంలో భాగంగానే తాను త్రాగుతా'నని ఎర్నెస్ట్ హెమింగ్వే బాహాటంగానే వెల్లడించాడు. జేమ్స్ జాయిస్, ఎఫ్.స్కాట్ ఫిడ్జ్రాల్డ్, ఓ.హెన్రీ లాంటి గొప్ప రచయితలు కూడా విపరీతమైన ఆల్కాహాల్ వల్లే మరణించారు. జాజ్, గిటార్ కళాకారులు తదేక ధ్యానంతో అలుపు తెలియకుండా వాయించడానికి దీన్ని ఆశ్రయిస్తుంటారు. ఒకరకంగా కొవ్వొత్తుల్లా కరుగుతూ పాఠక ప్రపంచానికి అమూల్యమైన నిధులు అందించి పోయారు.
రాజాబాబు కంచర్ల - 9490099231