Jul 29,2023 07:02

           ఆదివాసీల జీవితాలతో ఆది నుంచి చెలగాటమాడుతూ వస్తోన్న కేంద్ర బిజెపి ప్రభుత్వం అడవితల్లిపై గొడ్డలి వేటు లాంటి సవరణలతో ఇప్పుడు అటవీ సంరక్షణ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు వ్యూహం పన్నడం దారుణం. సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం మణిపూర్‌లో గిరిజన తెగల మధ్య విద్వేషాగ్ని రాజేసి.. అక్కడ అంతులేని అరాచకాలు కొనసాగుతుంటే మౌనం దాల్చిన మోడీ సర్కార్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాసం ప్రకటించిన సమయంలోనే లోక్‌సభలో అటవీ సంరక్షణ (సవరణ) చట్టం బిల్లును ఆమోదింపజేసుకోవడం బిజెపి బరితెగింపునకు మరో ఉదాహరణ. ముసాయిదా బిల్లులో ప్రతిపాదించిన సవరణలపై గిరిజనులు, పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా మోడీ సర్కార్‌ ఖాతరు చేయలేదు. వేలాది మంది తమ అభ్యంతరాలను, విజ్ఞాపనలను పంపినా.. బిజెపి ఎంపి రాజేంద్ర అగర్వాల్‌ నేతృత్వంలోని సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) వాటిని బుట్టదాఖలు చేసింది. జెపిసి తీరును నిరసిస్తూ కమిటీలోని ప్రతిపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో బహిరంగంగానే అసమ్మతి ప్రకటించాల్సి వచ్చిందంటే జెపిసి ఎవరి కనుసన్నల్లో పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.
           కేంద్రం ప్రతిపాదించిన సవరణలన్నీ కూడా అటవీ సంరక్షణ (కన్జర్వేషన్‌) చట్టాన్ని అటవీ కార్పొరేటీకరణ చట్టంగా మార్చే కుట్రపూరిత వ్యూహాలను ప్రస్ఫుటం చేస్తున్నాయి. కార్పొరేట్‌, ప్రయివేటు కంపెనీలు అడవితల్లిని తమ కబంధ హస్తాల్లో బంధించేందుకు వీల్లేకుండా అడ్డుపడుతున్న నిబంధనలను నీరుగార్చేలా సవరణలు తీసుకొచ్చింది. అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాల కోసం వినియోగించడానికి బదలాయింపునకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న '100 హెక్టార్లు లేదా అంతకు మించి' అని ఉన్న నిబంధనను సవరించి '1000 హెక్టార్లు పైగా' అని మార్చారు. అంటే ఇక నుంచి వెయ్యి హెక్టార్ల లోపు అటవీ భూమిని వేరే వాటికి వినియోగించడానికి ఎటువంటి అనుమతులూ అక్కర్లేదు. ఇంత పెద్ద మొత్తంలో భూమిని అటవీయేతర ప్రయోజనాలకు బదిలీ చేస్తే జీవావరణం దెబ్బతింటుందని 2019లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖే అభ్యంతరాలు, ఆందోళన తెలిపింది. అలాగే అటవీ భూసేకరణలో గ్రామసభ సమ్మతి తీసుకోవడం అత్యంత కీలకమైనది. కానీ ప్రస్తుత సరవణలతో గ్రామసభ హక్కులకు మోడీ సర్కార్‌ సమాధి కట్టేసింది. అటవీ ప్రాంతంలో చేపట్టే ఏదైనా ప్రాజెక్టుకు అనుమతి కావాలన్నా, తుది ఆమోదం పొందాలన్నా..గ్రామసభ నుంచి ముందస్తు సమ్మతి తీసుకోవడం తప్పనిసరి అని 2009 ఆగస్టు 3న కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఒక ప్రత్యేక సర్క్యులర్‌ కూడా జారీ చేసింది. అయితే ఈ సర్క్యులర్‌ను 2017లో ఇదే మోడీ సర్కార్‌ వెనక్కి తీసుకున్నా.. గ్రామసభ ఆమోదం పొందాలనే నిబంధన మాత్రం అలానే ఉంది. దానిని ఇప్పుడు నీరుగార్చేసింది. అలాగే అటవీ భూమి బదలాయింపునకు అనుమతులు ఇవ్వడానికి ముందుగానే ప్రతిపాదిత ప్రాంతంలోని గిరిజనులందరికీ .. షెడ్యూల్డు తెగలు, సంప్రదాయ అటవీ నివాసుల చట్టం 2006 ప్రకారం దక్కాల్సిన ప్రయోజనాలన్నిటినీ సంబంధిత కలెక్టర్లు చేకూర్చాలి. నూతన సవరణల్లో ఈ నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కి అడవి తల్లికి, అడవి బిడ్డలకి, గ్రామసభకు ఉన్న హక్కులను గంగలో కలిపేశారు.
           'వన (సంరక్షణ్‌ ఏవం సంవర్ధన్‌) అధినీయం-1980గా పేరు మారుస్తున్న ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధంగా అటవీ విధ్వంసానికి దారితీసే సవరణలతో నయవంచనకు పాల్పడుతోంది. కర్బన ఉద్గారాల తగ్గింపుకోసం, అటవీ విస్తరణ కోసం ప్రస్తుత నిబంధనలు అడ్డుగా ఉన్నాయట! దేశ భద్రత కోసం సరిహద్దులో సైనికులకు మౌలిక సదుపాయాల కల్పించేందుకు అటవీ చట్టం అడ్డు వస్తోందట. పర్యావరణ హిత పర్యాటక ప్రాజెక్టులకు నిబంధనలు అడ్డేనట! ఈ అడ్డులన్నింటినీ తొలగించేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం అంటే అడవి బిడ్డలకు ఉన్న రక్షణ కవచాలను తొలగించడమే. 10 కోట్ల మంది అమాయక గిరిజనులను ఇప్పటికే టైగర్‌ జోన్ల పేరిట, రిజర్వు ఫారెస్టుల పేరిట, మైనింగ్‌ లీజులు, సౌర విద్యుత్‌ జోన్ల పేరిట అడవి నుంచి తరిమేస్తున్నారు. మోడీ సర్కార్‌ సాగిస్తున్న ఈ దురాగతాలను తిప్పికొట్టి అడవిని, అడవి బిడ్డలను రక్షించుకునేందుకు సమస్త ప్రజానీకం ముందుకు కదలాలి.