Nov 06,2023 10:48
  • చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి

మన జీవితమే ఒక దీపావళి.' అంటూ సాగే విచిత్రబంధం చిత్రంలోని ఈ పాట గత ఆరు దశాబ్దాలుగా తెలుగు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటూనే ఉంది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు తెర స్మరణీయుడు, ఆత్మీయ ఆచార్య ఆత్రేయ అర్థవంతమైన గీతానికి కె.వి.మహదేవన్‌ మరపురాని సంగీతాన్ని స్వరపర్చారు. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు, గానకోకిల పి.సుశీల ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించారు. అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు, కళాభినేత్రి వాణిశ్రీ అభినయం అద్వితీయం... నాటికీ నేటికీ ప్రతి దీపావళి పండుగ రోజున ఈ పాటలను ప్రేక్షకులు వింటూ ఆనందిస్తుండటం తెలిసిందే.

33

తెలుగు పాటు ఇతర భాషల్లోనూ ఏటేటా వచ్చే సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగల సందర్భంగా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు, పాటలు మనకు పండగలను గుర్తుచేస్తాయి. అలాంటివాటిలో దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. దీపాలు వెలిగించి, బాణసంచా పేల్చడంలో పిల్లలు, పెద్దలు ఎంతో ఆనందంగా, సరదాగా జరుపుకునే దీపావళి పండగ నేపథ్యంలో తెలుగు చిత్రాల్లో అనేక పాటలు వచ్చాయి. 1960లో వచ్చిన దీపావళి సినిమాలో 'కరుణా చూపవయా వరము జూపవయా.. మురళీ మోహనా వినీల మేఘ శ్యామా... మనసు నీపైన మరలిన చాలుగా' అంటూ పాట సాగింది. ఎన్‌టిఆర్‌, సావిత్రి, ఎస్‌విఆర్‌ నటించారు. కృష్ణుడు, నారద పాత్రల్లో ఎన్టీఆర్‌, కాంతారావు మెప్పించారు. ఘంటసాల గానం చేశారు.

44


     నాగేశ్వరరావు, కృష్ణకుమారి నటించిన 'పెళ్లి కానుక' చిత్రంలోనూ దీపావళి సందర్భంగా సాగే పాట ఉంది. చెరువు ఆంజనేయశాస్త్రి రచించిన 'ఆడే పాడే పసివాడ ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి' అనే పాట నేటికీ పండుగ వాతావరణాన్ని గుర్తుచేస్తుంది. షావుకారు జానకి, ఎన్‌టి రామారావు నటించిన 'షావుకారు' చిత్రంలోని 'దీపావళి దీపావళి ఇంటింట ఆనంద దీపావళి' అనే పాట నేటికీ ప్రజల నోళ్లలో నానుతోంది. చిరంజీవి, విజయశాంతి నటించిన 'సంఘర్షణ' చిత్రంలోని 'సంబరాలో సంబరాలు దీపావళి పండగా సంబరాలు' పాట పేదలంతా ఆనందంగా జరుపుకునే పండుగను గుర్తుచేస్తుంది. సురేష్‌, చంద్రమోహన్‌, వాణి విశ్వనాథ్‌ ముఖ్య తారాగణంగా నటించిన కుటుంబ కథా చిత్రం 'ఇంటింట దీపావళి'లో 'ఇంటింటి దీపావళి వచ్చేనమ్మా' పాట కుటుంబ సంబంధాలు- బాంధవ్యాలను గుర్తుచేస్తుంది. దాసరి నారాయణరావు నటించిన చిత్రం 'మామగారు'లో 'ఇయ్యాలే అచ్చమైన దీపావళి వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి' అంటూ పాట సాగుతుంది. ముద్దుల మనవరాలులో 'ఇన్నాళ్ళకు వచ్చిందో దీపావళి.. మమతల దీపావళి దీప కవితావళి' అంటూ సుహాసిని నర్తించగా భానుమతి, చంద్రమోహన్‌, జయప్రద నటించారు. జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలకు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందించారు. నాగార్జున, సిమ్రాన్‌ నటించిన 'నువ్వు వస్తావని' చిత్రంలో 'పాటల పల్లకిలో ఊరేగే చిరుగాలి' పాటలో దీపావళి పండుగ ప్రాశస్త్యాన్ని గుర్తుచేశారు. ప్రభాస్‌ రెబెల్‌ చిత్రంలోనూ, 'జనతా గ్యారేజ్‌' క్లైమాక్స్‌ సన్నివేశంలో, మాధవి నటించిన 'మాతృదేవోభవ', నాని నటించిన 'జెర్సీ' చిత్రాల్లోని పాటల్లో దీపావళి అంశాలు సాక్షాత్కారమయ్యాయి. దీపావళి సినిమాలో హీరో, హీరోయిన్లలో వేణు, ఆర్తిఅగర్వాల్‌ మెప్పించారు. 'ఊరువాడా.. ఉత్సాహంగా వెలుగులు చిమ్మే... చుట్టాలంతా సందడిచేసేలా..జోరుగా సందడి చేస్తాం.దీపాల కాంతుల్లో... మస్తుగా చిందులు వేద్దాం' అంటూ సినీ గాయని మంగ్లీ, 'ఆనందాల దివ్య దీపావళి' అంటూ గీతామాధురి ఆలపించిన గీతాలు సామాజిక మాధ్యమాల్లో విశేష ఆదరణ పొందాయి. స్రవంతి మూవీస్‌ అధినేత స్రవంతి' రవికిశోర్‌ తొలిసారిగా తమిళంలో నిర్మించిన చిత్రం 'కిడ' తెలుగులో దీపావళి పేరుతో అనువదించారు. ఈనెల 11న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

022


                                                       ఆ పాత మధుర గీతాలు శూన్యం

పండుగల సందర్భంగా తాజాగా వస్తోన్న చిత్రాల్లో ఆనాటి మధుర గీతాలు నేడు ఉండకపోవటం బాధాకరం. నాటి పాటల్లో ఆయా పండుగల సంస్కృతిని ప్రతిబింబించేలా సందర్భానుసారంగా కథలు సృష్టించి హృద్యంగా తీసేవారు. ఇప్పుడంతా డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, భయానక దృశ్యాలు, అర్థంకాని రీతిలో పాటలు వస్తున్నాయి. అయితే అన్ని సినిమాలను అదే గాటన కట్టలేము. స్థానిక భాషలు, యాసలు, జానపదాలు అక్కడక్కడా వస్తున్నాయి. పరిశ్రమలోని అన్ని విభాగాల్లోకి ఔత్సాహికులకు ప్రవేశం దొరకుతుండటం కొంత ఆశాజనకమే.

55