ప్రజాశక్తి కాకినాడ : కాకినాడ నగర సుందరీ కరణ, ట్రాఫిక్ సమస్యలు, ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీధి వ్యాపారాలను క్రమబద్ధీకరించనున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు తెలిపారు. వీటి నిమిత్తం కాకినాడ నగరంలో వ్యాపారాలకు అనుకూలంగా లేనివి, అనువైన ప్రాంతాలను గుర్తించి 42 జోన్లుగా విభజించినట్లు ఆయన వెల్లడించారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, మెప్మా అధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగ నరసింహారావు మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల సౌకర్యార్థం కాకినాడను 11 రెడ్ జోన్లుగాను, 25 గ్రీన్ జోన్లగాను, 6 యాంబర్ జోన్లుగాను విభజించామన్నారు. గ్రీన్ జోన్లలో నిరంతరాయంగా వ్యాపారాలు చేసుకోవచ్చని, రెడ్ జోన్లలో మాత్రం వ్యాపారాలకు అనుమతించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. యాంబర్ జోన్లలో మాత్రం నిర్దేశించిన సమయాలలో మాత్రమే వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. గతంలో చేసిన సర్వే ప్రకారం కాకినాడ నగరంలో సుమారు 1900 మంది స్ట్రీట్ వెండర్లను గుర్తించామన్నారు. ఈ సంఖ్యను మరోసారి నిర్ధారించుకుని ఆయా జోన్లలో వ్యాపారాలకు అనుమతించే అంశంపై నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేయాలని కమిషనర్ ఆయా శాఖలను ఆదేశించారు. యాంబర్, గ్రీన్ జోన్లలో వ్యాపారాలు చేసుకునేందుకు అనువుగా నగరపాలక సంస్థ తరఫున మంచినీటి సౌకర్యం, పారిశుధ్య నిర్వహణ, ఆయా ప్రాంతాలను చదును చేయడం వంటి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఈ పి సత్య కుమారి, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, డీసీపీ కే హరిదాస్, ఏసీపి నాగశాస్త్రులు, టిపిఆర్ఓ మానే కృష్ణమోహన్, మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డేగల వెంకట రాజు, సివోలు తదితరులు పాల్గొన్నారు.










