ప్రజాశక్తి-కర్నూలు స్పోర్ట్స్ : జిల్లాలోని కర్నూలు, కల్లూరు, చిప్పగిరి మండలాలకు చెందిన మిలిటరీ కాలనీ, పసుపల, శరీన్నగర్, కల్లూరు, అర్దవీడు, చిప్పగిరీ మండలం నేమకల్లు గ్రామాలకు చెందిన ఏడు ప్రభుత్వ పాఠశాలలకు రవీంద్ర విద్యా సంస్థల అధినేత జి.పుల్లయ్య క్రీడా సామాగ్రి వితరణ చేశారు. బుధవారం అబ్బాస్ నగర్‌లోని పాఠశాలలో ఆయన సామాజిక సేవలో భాగంగా తన వంతు కృషిగా ప్రభుత్వ పాఠశాలకు క్రీడా సామాగ్రి వితరణ చేసినట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులను ఆకట్టుకోవడంలో ఆట స్థలాలు, క్రీడా సామాగ్రి ఉపయోగపడతాయని.. ఆ దిశగా వారికి అందుబాటులో క్రీడా సామాగ్రిని, క్రీడా మైదానాలను ఉంచగలిగితే విద్యార్థులు ఆసక్తి కనబరిచే క్రీడల్లో పాల్గొనేందుకైనా పాఠశాలలకు ప్రతిరోజు హాజరవుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి శారీరక సౌష్టవంతో పాటు మేధస్సును పెంచుకునేలా సామాజిక సేవను అందించేందుకు రవీంద్ర విద్యాసంస్థలు ముందు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రతి పాఠశాలకు సుమారు రూ.7000 విలువచేసే క్రీడా సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో సుదూర ప్రాంతమైన చిప్పగిరి మండలం నేమకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల ఉపాధ్యాయ బందం ప్రభాకర్ మద్దిలేటి నేమకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు ముల్లా మహమ్మద్ భాష పాల్గొన్నారు.










