భూహక్కు పత్రాల పంపిణీ గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్ కృత్తికా శుక్లా
ప్రజాశక్తి కాకినాడ : భూ రికార్డుల ప్రక్షాలనలో భాగంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి సంబంధించి భూ హక్కు పత్రాల పంపిణీ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర భూ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ సర్వే సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో కలిసి విజయవాడ సీసీఎల్ఎ కార్యాలయంలో నుంచి రీ సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, సర్వే అధికారులతో కలిసి హాజరయ్యారు. రెండో దశ రీసర్వే పనులు, భూ హక్కు పత్రాల పంపిణీ, సరిహద్దు రాళ్లు వేసే ప్రక్రియ తదితర అంశాలపై సీసీఎల్ఎ అధికారులు జిల్లా కలెక్టర్లతో చర్చించి పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర భూ సర్వేను చేపట్టడం జరిగిందన్నారు. రీ సర్వే పనులు పూర్తైన గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రధానంగా సరిహద్దు రాళ్లు వేసే ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయాలని ఇందుకు జిల్లా అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని పనులలో పురోగతి చూపాలని కలెక్టరు కృతికా శుక్లా తెలిపారు. సమావేశంలో ఏడీ సర్వే బి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.










