Nov 08,2023 12:08

ప్రజాశక్తి-పీలేరు (రాయచోటి-అన్నమయ్య) : అడవిపల్లి ముంపు బాధితులను గత ప్రభుత్వాలు విస్మరిస్తే, జగనన్న ప్రభుత్వం ఆదరించి, ఆలంబనగా నిలిచి, ఇండ్ల పట్టాలు ఇచ్చిందని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తెలిపారు. పీలేరు నియోజకవర్గం, కెవి పల్లి మండలం, అడవిపల్లి ప్రాజెక్టు ముంపు బాధితులకు బుధవారం పీలేరు పంచాయతీ కార్యాలయంలో ఇండ్ల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 119 మంది ముంపు బాధితులకు పీలేరు మండలం, ముడుపుల వేముల పంచాయితీ పరిధిలో ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున స్థలాలు కేటాయిస్తూ పట్టాలను పంపిణీ చేశారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ... అడవిపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో 119 కుటుంబాలు సర్వస్వం కోల్పోయారన్నారు. గత ప్రభుత్వాలు వీరిని విస్మరించినా జగనన్న ప్రభుత్వం వారి సమస్యలు గుర్తించి, ఒక్కొక్కరికి ఐదు సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు కేటాయించిందని అన్నారు. పట్టాల మంజూరులో సహకరించిన తహశీల్దారు ధనుంజయులు, రెవెన్యూ యంత్రాంగాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పీలేరు సర్పంచ్‌ షేక్‌ జీనత్‌ షఫీ, రాష్ట్ర ఏపిఎండిసి డైరెక్టర్‌ హరీష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాథ్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి ఎన్వీ చలపతి, సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌ నారే వెంకటరమణా రెడ్డి, ఎంపిటిసి కంభం నరసింహా రెడ్డి, మహిళా నాయకురాలు మహిత, ఏఎంసి డైరెక్టర్‌ కాలనీ చిన్నా, పర్యాటకశాఖ బోర్డు డైరెక్టర్‌ షేక్‌ షాకీర్‌, తదితరులు పాల్గొన్నారు.