ప్రజాశక్తి కాకినాడ : వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల ద్వారా కాకినాడ జిల్లాకు సంబంధించి ఏప్రిల్-జూన్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 976 మంది లబ్ధిదారులకు రూ. 6.74 కోట్ల మేర లబ్ధి జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా. కతికా శుక్లా తెలిపారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద మూడో విడత ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కలెక్టరేట్ వివేకానందహాల్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లా అధికారులు, వివిధ ప్రాంతాలకు చెందిన కొత్తగా పెళ్లయిన జంటలతో కలిసి వర్చువల్‌గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో లబ్ధి మొత్తాన్ని జమచేసిన అనంతరం కలెక్టర్ కతికా శుక్లా, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కాకినాడ జిల్లాలోని లబ్ధిదారులకు మెగా చెక్‌ను అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, ఆపై వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు ఆసరాగా నిలిచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలుచేస్తున్నట్లు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విభిన్న ప్రతిభావంతులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. బాల్య వివాహాలను నివారించడం, పిల్లల చదువులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పథకాలకు అర్హతలను నిర్దేశించినట్లు వివరించారు. ఏటా ఈ పథకాల కింద తొలి విడత లబ్ధిని ఫిబ్రవరిలో, రెండో విడత లబ్ధిని మేలో, మూడో విడత లబ్ధిని ఆగస్టులో నాలుగో విడత లబ్ధిని నవంబర్‌లో ప్రభుత్వం విడుదల చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జేడీ డీవీ రమణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, మెప్మా పీడీ బి.ప్రియంవద తదితరులు పాల్గొన్నారు.










