
పచ్చని చెట్లు... పక్షుల కిలకిలారావాలు... ప్రకృతి సోయగాలతో అనంత జీవకోటితో అలరారుతున్న గ్రహం ఈ మహావిశ్వంలో భూగోళం ఒక్కటే. సౌరకుటుంబంలో ఏ గ్రహానికీ లేని ప్రత్యేకత భూగోళానికి మాత్రమే ఉంది. భూమి చుట్టూ ఓజోన్ వాయువు మేఘాల్లా ఆవరించి సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత (యువి రేస్) కిరణాలను అడ్డుగించడం వల్లే ఈ భూమిపై ప్రాణకోటి ఆవిర్భవించింది. మనుగడ సాధించగలుగుతుంది. మానవుల విపరీత చర్యలతో ఓజోన్ పొర దెబ్బతింటే భూమి నివాస యోగ్యం కాకుండా పోతే మనం పారిపోవటానికి మరో గ్రహమేదీలేదు. అందుకే ఓజోన్ పొరను కాపాడుకోవాలి.
సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల నుంచి భూమిని కాపాడే కవచం ఓజోన్ పొర. మూడు పరమాణువులతో కూడిన ఆక్సిజన్ అణువైన ఓజోన్ (ఒ3) వాయు రూపంలో, లేత నీలం రంగులో ఉంటుంది. జీవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి భూమికి రక్షణ కల్పిస్తూ వస్తున్న ఈ పొరకు ఇప్పుడు మనమే తూట్లు పొడుస్తున్నాం. ఏటేటా అడవులను నరికేయడం, కాలుష్యం పెరగడం వల్ల ఓజోన్ వాయువు రోజు రోజుకూ తగ్గిపోతోంది. దీని వల్లనే భూతాపం పెరగడం, వానలు కురవకపోవడం వంటి అనర్థాలు తరచూ ఎదుర్కొనాల్సివస్తోంది.
ఏకమైన ప్రపంచదేశాలు
ఓజోన్ పొర క్షీణిస్తోందని 1982లో పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటి పరిస్థితులే కొనసాగిస్తే భవిష్యత్తులో జీవకోటికి పెద్ద ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని గమనించిన ఐక్యరాజ్యసమితి, ఓజోన్ సంరక్షణ కోసం ప్రపంచ దేశాలను ఏకం చేసింది. ఆ తరువాత 1987, సెప్టెంబర్ 16న ఓజోన్ సంరక్షణ రోజు రోజుగా ఖరారు చేసింది. ఆపై ప్రతి సంవత్సరం ఇదే రోజున ఒక్కో నినాదంతో ప్రచారం చేస్తూ ఓజోన్ పొరపై అవగాహనా కార్యక్రమాలను కొనసాగిస్తోంది. 2018లో ఓ సంస్థ చేసిన సర్వేలో 2000 సంవత్సరం నుంచి కొన్ని ప్రాంతాల్లో ఓజోన్ 1 నుంచి 3 శాతం మేర తిరిగి పుంజుకుంటోందని తేలింది. కొన్ని చర్యలు తీసుకుంటే 2030లో ఉత్తర ధ్రువంలో, 2050కు దక్షిణ ధ్రువంలో, 2060కు పోలార్ ప్రాంతాల్లో పూర్తిగా ఓజోన్‌ను రక్షించుకునే అవకాశం ఉందని ఆ నివేదిక తెలిపింది. అమెరికన్ మెటీరోలాజికల్ సొసైటీ తన 103వ వార్షిక సమావేశంలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఓజోన్ పొర నాలుగు దశాబ్దాల్లో కోలుకునే మార్గంలో ఉందనీ, ఓజోన్-క్షీణించే రసాయనాలను ప్రపంచవ్యాప్తంగా దశలవారీ తగ్గిస్తే వాతావరణ మార్పులను తగ్గించే ప్రయత్నాలకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొంది. ఓజోన్ క్షీణత పదార్థాలపై 'మాంట్రియల్ ప్రోటోకాల్' ప్రతి సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో చర్చించి కొన్ని సూచనలు చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు వారి మాంట్రియల్ ప్రోటోకాల్ కట్టుబాట్లను నెరవేర్చడంలో సహాయపడటానికి 1991లో బహుళ పక్ష నిధి ఏర్పాటైంది. వీటి ద్వారా పారిశ్రామిక మార్పిడి, సాంకేతిక సహాయం, శిక్షణ, సామర్థ్య నిర్మాణంతో సహా కార్యకలాపాలను ఆమోదించి ఆయా దేశాల్లో అమలు చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయలిషన్ వ్యవస్థాపక భాగస్వామి. ప్రపంచవ్యాప్తంగా స్వల్పకాలిక వాతావరణ కాలుష్య కారకాలను తగ్గించడంపై దృష్టి సారించే ప్రయత్నం చేస్తోంది.

జీవులన్నింటికీ ప్రమాదమే
ఓజోన్ పొర పాడవ్వటం మనుషులతోపాటుగా భూమిపై నివసిస్తున్న జంతువులు, పక్షులు, చెట్లు అన్నింటికి ప్రమాదమే. ఆ పొర లేకపోతే సూర్యుడి నుంచి వెలువడే తీవ్రమైన అతినీల లోహిత కిరణాలు మనుషులపై పడి కేన్సర్ రావొచ్చు. సూర్యుడి నుంచి పడే కిరణాలను తట్టుకునే శక్తి మనుషులకు ఉండదు. పలు రకాల రోగాల భారిన పడే అవకాశం ఉంది. వర్షాలు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
భూగోళం అగ్నిగోళంగా ...
గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసిపోయిందనీ, ఇక గ్లోబల్ బాయిలింగ్ శకం వచ్చేసిందని ఐక్యరాజ్య సమితి సైతం ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భూగోళం మండే అగ్నిగోళంగా మారుతోందనీ, శీతల దేశాల్లో సూర్యుడు సెగలు పుట్టిస్తున్నాడని పేర్కొంది. ఎండల ధాటికి ఓ వైపు అడవులు దగ్థమైపోతుండగా.. మరోవైపు మంచు కరిగిపోయి వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది జులైలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని యూరోపియన్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్, ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించాయి. సాధారణంగా జులైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యేదని.. కానీ, ఈ ఏడాది దాదాపు 17 డిగ్రీలకు పెరిగిందని వెల్లడించాయి. 1.20 లక్షల సంవత్సరాల్లో భూమి ఇంత వేడెక్కడం ఎప్పుడూ లేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. విపరీత వేడి కారణంగా మంచు కరిగి వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చైనా, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా ఈశాన్య ప్రాంతాలు, జపాన్, భారత్, పాకిస్తాన్‌లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో పగటిపూటతో పోలిస్తే రాత్రి సమయాల్లో వాతావరణం కాస్త చల్లబడుతుంది. కానీ, కాలిఫోర్నియాలోని 'డెత్ వ్యాలీ'లో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. వీటి ఫలితంగా 1950తో పోలిస్తే ప్రపంచ భూభాగంలో దాదాపు మూడో వంతు ఏటా కరువు సంభవిస్తుందని.. ఇది 10 లక్షల మందిని తీవ్ర ఆకలిలోకి నెడుతుందని శాస్త్రవేత్తల నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది చివరితో పాటు 2024లో ఎల్‌నినో ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా బ్రిటన్, ఐర్లాండ్, బాల్టిక్ సముద్రం, జపాన్ సముద్రం, పసిఫిక్, పశ్చిమ హిందూ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. కాగా, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ మేర కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలతో కలిసి ఐక్యరాజ్య సమితి చర్యలు చేపడుతోంది.
రక్షణకు చెట్లను పెంచాలి
ఓజోన్‌ను రక్షించుకోవాలంటే చెట్లను పెంచాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి. క్లోరో ఫ్లోరో కార్బన్ల వాడకాన్ని నిషేధించాలి. సంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో సోలార్ విద్యుత్ వాడకాన్ని పెంచాలి. కాలుష్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. పంటల్లో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి.
ఇంటర్వూ ్య : యడవల్లి శ్రీనివాసరావు
-ప్రొఫెసర్ పి.బ్రహ్మాజీరావు, పర్యావరణ విజ్ఞాన విభాగం అధిపతి, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం