Jul 05,2023 06:56

సిఎఫ్‌డబ్ల్యు పరిధిలో ఉన్న రెగ్యులర్‌ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సెలవులను ఎన్‌హెచ్‌ఎంలో కూడా అమలు చెయ్యాలి. కాని రాష్ట్రంలో అమలు చెయ్యడంలేదు. ప్రతి సంవత్సరం వేతనాలలో కనీసం 5 శాతం ఇంక్రిమెంట్‌ ఇస్తూ ప్రతీ 3 లేదా 5 సంవత్సరాలకు బేసిక్‌ వేతనాలను పెంచాలి. బోనస్‌లు, ఇన్‌సెంటివ్‌లు అమలు చెయ్యాలి. మెడికల్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌లు వర్తింపచెయ్యాలి. కార్మిక చట్టాలు అమలు చెయ్యాలి. ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చెయ్యాలి. కాని ఇవేవీ అమలు చెయ్యకుండా రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది.

          ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ విభాగంలో 189 క్యాడర్లలో 22 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. దాదాపు 16 సంవత్సరాలుగా వీరిలో ఎక్కువ మంది రాష్ట్ర ప్రజానీకానికి సేవలందిస్తున్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ అధికారులు వీరిపై వివక్ష చూపుతున్నారు. ఈ వివక్షకు వ్యతిరేకంగా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగులు ఆందోళనల బాట పట్టారు. తమకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు అమలుచేస్తున్న విధంగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు చెయ్యాలని కేంద్ర మార్గదర్శకాల ప్రకారం హ్యూమన్‌ రిసోర్స్‌ సెల్‌ను ఏర్పాటు చేసి హెచ్‌.ఆర్‌ పాలసీని అమలు చెయ్యాలని, ఒకే క్యాడర్‌ ఒకే వేతనం అమలు చెయ్యాలని, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌లలో వలే రెగ్యులరైజ్‌ చెయ్యాలని కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు.
           2005 ఏప్రిల్‌ 12న కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఆరోగ్య సేవలను విస్తరించే క్రమంలో మాతా శిశు సంరక్షణ కోసం, నియోనేటల్‌, మెటర్నటీ మోర్టాలిటీ రేటు తగ్గించటానికి, మురికి వాడల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్యసేవలను అందించటానికి నేషనల్‌ రూరల్‌ హెల్త్‌ మిషన్‌ను, 2013 మే 1న పట్టణ ప్రాంతంలోని పేదలకు సేవలందించటానికి నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం దీనిని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో భారతదేశం లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి వచ్చే నిధులను వినియోగించుకుంటూ లక్షలాది మంది ఉద్యోగులను వైద్య, ఆరోగ్య శాఖలో నియమించుకొని ప్రజలకు సేవలందిస్తున్నాయి. కాని మన రాష్ట్రంలో కేంద్ర నిధులను వివిధ వైద్య, ఆరోగ్య పథకాలకు వాడుకుంటూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం అమలు చెయ్యాల్సిన హెచ్‌.ఆర్‌ పాలసీకి తిలోదకాలు ఇచ్చింది. సిఎఫ్‌డబ్ల్యు పరిధిలో ఉన్న రెగ్యులర్‌ ఉద్యోగులకు వర్తించే అన్ని రకాల సెలవులను ఎన్‌హెచ్‌ఎంలో కూడా అమలు చెయ్యాలి. కాని రాష్ట్రంలో అమలు చెయ్యడంలేదు. ప్రతి సంవత్సరం వేతనాలలో కనీసం 5 శాతం ఇంక్రిమెంట్‌ ఇస్తూ ప్రతీ 3 లేదా 5 సంవత్సరాలకు బేసిక్‌ వేతనాలను పెంచాలి. బోనస్‌లు, ఇన్‌సెంటివ్‌లు అమలు చెయ్యాలి. మెడికల్‌ ఇన్సూరెన్స్‌, యాక్సిడెంట్‌ ఇన్సూరెన్స్‌లు వర్తింపచెయ్యాలి. కార్మిక చట్టాలు అమలు చెయ్యాలి. ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చెయ్యాలి. కాని ఇవేవీ అమలు చెయ్యకుండా రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. అమానుషంగా వ్యవహరిస్తున్నది.
           దేశ వ్యాప్తంగా నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌లో దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులు, మన రాష్ట్రంలో 22 వేల మంది పనిచేస్తున్నారు. వీరు లేకుండా రాష్ట్రంలో వైద్య ఆరోగ్య సేవలు పూర్తి స్థాయిలో అందే పరిస్థితి లేదు. కోవిడ్‌ కాలంలో కూడా వీరు సేవలందించారు. వేలాది మంది కోవిడ్‌ బారిన పడ్డారు. పదుల సంఖ్యలో చనిపోయారు. ఆంత్రాక్స్‌ వైరస్‌ నుండి కరోనా వైరస్‌ వరకు భయపడకుండా సేవలందించారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్‌ ఉద్యోగులకి మాత్రమే కోవిడ్‌ కాలంలో చనిపోయిన వారికి రూ. 10 నుండి రూ. 25 లక్షల వరకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించింది. కాని కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మాత్రం రూ. 2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంది. దుర్మార్గపు యజమానిగా వ్యవహరించింది. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వీరు సేవలందిస్తున్నా వీరికి నామ మాత్రంగా వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నది. పి.ఎఫ్‌ మినహా ఎటువంటి సౌకర్యాలను వర్తింపచెయ్యటంలేదు. కనీసం వైద్య, ఆరోగ్య శాఖలో ఇతర కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వర్తింపచేస్తున్న మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ను కూడా అమలు చెయ్యకుండా రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నది. గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ సంవత్సరం పెంచాల్సిన 5 శాతం వేతనాలను పెంచకపోవడం వలన ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 150 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు చెయ్యకుండా తాత్సారం చేస్తున్నది.
           నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ లోని వివిధ విభాగాలైన అర్బన్‌ హెల్త్‌, ఆర్‌ఎన్‌టిసిపి, ఆర్‌బిఎస్‌కె, ఆర్‌బిఎస్‌యు, ఎన్‌ఆర్‌సి, ఎస్‌ఎన్‌సియు, ఎన్‌టిఎల్‌పి, ఎన్‌ఎంహెచ్‌పి, ఆర్‌కెఎస్‌కె, ఎంహెచ్‌పి, ట్రామా, బ్లడ్‌ బ్యాంకులు, ఆయూష్‌, అడాలసెంట్‌ హెల్త్‌ తదితర విభాగాలలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన స్పెషలిస్టు డాక్టర్లు, డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ఎఎన్‌ఎంలు, ఫార్మాసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫిజియో థెరపిస్టులు, సైకాలజిస్టులు, న్యూట్రీషియనిస్టులు, ఓటి, ఎక్స్‌రే టెక్నీషియన్లు, డెంటల్‌ హైజీనిస్టులు, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ, డిఇఓ, కంటింజెంట్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌, ఆఫీసు సిబ్బంది, క్లాస్‌ 4 సిబ్బందికీ, డిస్ట్రిక్ట్‌ ప్రోగ్రాం, స్టాటెస్టికల్‌ ఆఫీసర్లు, జిల్లా క్యాడర్లు, అనేక ఇతర క్యాడర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఒకే క్యాడర్‌, ఒకే క్వాలిఫికేషన్లు ఉన్నప్పటికీ ఒక్కొక్క విభాగంలో ఒక్కో రకంగా వేతనాలు చెల్లిస్తున్న పరిస్థితి ఉంది. ఒకే క్యాడర్‌కు ఎన్‌హెచ్‌ఎం లోని ఒక్కో విభాగంలో ఒక్కోరకమైన వేతనాలు చెల్లిస్తున్నారు. ఆయూష్‌ డాక్టర్లు, ఫిజియో థెరపిస్టులు, న్యూట్రీషియనిస్టులు, సైకాలిజిస్టులు, స్టాఫ్‌నర్సులకు... తదితర క్యాడర్లకు వేరు వేరు వేతనాలు చెల్లిస్తున్నారు. ఆర్‌కెఎస్‌కె కన్సెల్టెంట్లకు, ఆర్‌బిఎస్‌కె లోని డిఐఇసి మేనేజర్లకు, ఆయూష్‌ లోని కాంపౌండర్లకు అర్బన్‌ హెల్త్‌ లోని అన్ని క్యాడర్లకు ఉత్తర్వుల కన్నా తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఉన్న ఈ లోపాలను సరిచెయ్యకపోగా అదే విధానాన్ని కొనసాగిస్తున్న దుస్థితి నేడు రాష్ట్రంలో ఉన్నది.
           ఈ నేపథ్యంలో తమపై వివక్షను ఆపాలని, వైద్య, ఆరోగ్యశాఖ లోని ఇతర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వలే మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు చెయ్యాలని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్‌ఆర్‌ పాలసీని అమలు చెయ్యాలని, ఒకే విభాగంలో ఒకే క్యాడర్‌ మధ్య వేతన వ్యత్యాసాలను సరిచెయ్యాలని, వేర్వేరు విభాగాల లోని ఒకే క్యాడర్‌ మధ్య వ్యత్యాసాలను తొలగించాలని, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా లీవ్‌లు, సౌకర్యాలు కల్పించాలని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగులు కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ సేవలు అందించటంలో కీలక పాత్ర పోషించే ఈ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.
 

( వ్యాసకర్త ఎ.పి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ) ఏ.వి. నాగేశ్వరరావు

( వ్యాసకర్త ఎ.పి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ) ఏ.వి. నాగేశ్వరరావు