
దేశ పౌరులందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాన్ని, అంతస్తులోనూ, అవకాశాలలోనూ సమానత్వాన్ని చేకూర్చడం ప్రధాన లక్ష్యాలుగా భారత రాజ్యాంగం నిర్దేశిస్తోంది. ప్రవేశికలోనే వీటిని పొందుపర్చి ప్రభుత్వ బాధ్యతను, పౌరుల కర్తవ్యాన్ని నొక్కి చెప్పింది. కానీ స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయినా నేటికీ సమానత్వం, సామాజిక న్యాయం ఎండమావులుగానే మిగిలాయి. ఈ లక్ష్యాల సాధనలో ఏటికేడూ ముందుకు పడాల్సిన అడుగు మరింతగా వెనక్కి పడుతుండటం సిగ్గుచేటు. ఆకాశంలో సగంగా భావించే మహిళలను అవకాశాలలో అథ:పాతాళానికి తొక్కివేయడం దుర్మార్గం. మహిళలతో పాటు దళితులు, గిరిజనులు, మైనార్టీలు పట్ల వివక్ష రూపు మార్చుకొని పెరుగుతూ వుందే తప్ప తగ్గడం లేదు. గత 15 సంవత్సరాలతో పోలిస్తే వివక్ష మరింతగా పెరిగిపోయిందని ఆక్స్‌ఫామ్ ఇండియా తన తాజా నివేదికలో పేర్కొంది. ఉద్యోగాలు, జీవనోపాధి, వ్యవసాయ రుణాలు పొందటంలోనూ అసమానతలు పెరగటానికి ముఖ్య కారణం వివక్షేనని కుండబద్దలు కొట్టింది.
ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం దళితులు, గిరిజనుల కంటే మిగిలిన సామాజిక తరగతులకు చెందినవారి నెల వారి సగటు ఆదాయం రూ.5 వేలు ఎక్కువగా ఉంది. ముస్లింల సగటు ఆదాయంతో పోల్చితే ముస్లిమేతరుల సగటు ఆదాయం రూ.7 వేలు ఎక్కువగా ఉంది. పట్టణాల్లో నివసించే ముస్లిం జనాభాలో 15.6 శాతం మందికి రెగ్యులర్ ఉద్యోగాలుండగా, ముస్లిమేతరుల్లో 23.3 శాతం మందికి ఉద్యోగాలున్నాయి. ఇంత వ్యత్యాసాలకు వివక్షతే మూల కారణంగా ఆక్స్‌ఫాం విశ్లేషించింది. పట్టణ ముస్లింలలో 68 శాతం మంది ఉపాధి లేమితో బాధపడుతున్నారు. రెగ్యులర్ వేతనాలు అందుకున్న కార్మిక రంగంలో ముస్లిం-నాన్ ముస్లిం మధ్య ఆదాయ అసమానతలు 70 శాతానికి చేరుకున్నాయి. దీనికి ప్రధాన కారణం మత వివక్షే. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) వంటి మత విద్వేషాన్ని రాజేసే విధానాలతో దేశంలో మైనార్టీల పట్ల వివక్షతకు మరింత ఆజ్యం పోసినట్లయింది.
మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామీణ ప్రాంత మహిళల ఆదాయ అసమానతలకు 100 శాతం కారణం లింగ వివక్షే. పట్టణ ప్రాంతాల్లో నెలకొన్న లేబర్ మార్కెట్లో ఇది 98 శాతంగా ఉంది. పురుషులతో పోల్చుకుంటే సమాన విద్యార్హత, అనుభవం ఉన్నప్పటికీ లేబర్ మార్కెట్లో మహిళలకు తక్కువ వేతనాలు, కూలి అందుతోందని ఆక్స్‌ఫాం పేర్కొంది. దినసరి కూలిలో స్త్రీ, పురుషుల మధ్య అసమానతలకు 95 శాతం లింగ వివక్ష కారణంగా ఉంది. దినసరి కూలి ద్వారా పురుషుల సగటు నెల ఆదాయం రూ.6 వేలు కాగా, మహిళల ఆదాయం కేవలం రూ.3 వేలకు పరిమితం కావడం వివక్ష తీవ్రతకు అద్దం పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో దళితులు, గిరిజనుల పట్ల కుల వివక్ష ఈ పుష్కర కాలంలో గణనీయంగా పెరిగిందని ఆక్స్‌ఫామ్ పేర్కొంది. దినసరి కూలీగా ఉపాధి పొందడం కూడా అణగారిన ప్రజానీకానికి కష్టంగా మారిందంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యుపిఎ ప్రభుత్వ హాయాంలో వామపక్షాల చొరవతో తీసుకొచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఇజిఎ). గ్రామీణ భారతావనిలో సామాజిక వివక్షతను రూపుమాపడంలోనూ, అణగారిన ప్రజలకు ఉపాధి కల్పించడంలోనూ ఎంతగానో దోహదం చేస్తున్నది. కానీ మోడీ సర్కార్ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీపై కత్తి వేలాడదీసింది. నిధులు తెగ్గోసి నిర్వీర్యం చేసేందుకు కుట్ర సాగిస్తోంది. 'ఉపాధి' వేతనాలను కులాల వారిగా విభజించాలని కూడా ఇటీవలే కొత్త నిబంధనను తెరపైకి తీసుకొచ్చింది. దుర్మార్గమైన ఈ విధానాల వల్లే దళిత, గిరిజన, మైనార్టీలు, మహిళల పట్ల వివక్ష పెరిగిపోతోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభ పరిస్థితుల నేపథ్యానికి తోడుగా దేశంలో మోడీ సర్కార్ అమల్జేసిన నోట్ల రద్దు, జిఎస్‌టి వంటి విధానాల వల్ల, ఆ తర్వాత లాక్‌డౌన్ ఆంక్షల ఫలితంగా జీవనోపాధులు అడుగంటాయి. నిరుద్యోగం ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. అణగారిన ప్రజానీకంలో నిరుద్యోగిత ఇతర సామాజిక తరగుతుల్లో కంటే అధికంగా ఉన్నట్లు కూడా ఆక్స్‌ఫామ్ నివేదించింది. మత విద్వేషాలను రెచ్చగొడుతూ, సామాజిక వివక్షతను పెంచుతూ దుర్మార్గమైన విధానాల పాలకులు అమల్జేస్తున్నందునే ఈ దుస్థితికి కారణం. రాజ్యాంగం నిర్దేశించిన సామాజిక న్యాయం, సమానత్వపు లక్ష్యాలను పాలకులు నీరుగారుస్తున్న నేపథ్యంలో ఐక్య పోరాటాలే మార్గం.