
'నాడు నేడు'తో తయారు చేసిన గ్రానైట్ గచ్చులు, అద్దాల గదులలో చదువుకోవడానికి విద్యార్థులు ఉండరు. చెప్పడానికి ఉపాధ్యాయులు ఉండరు. మరి ఆ బడి ఎవరి కోసం, ఎందు కోసం? మూసివేయడానికా? ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇటువంటి సంస్కరణలు అమలు చేస్తున్నారంటే, విద్య బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నదా? ఏం చేయదలచుకుందో ప్రజలకు చెప్పాలి ?
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు సంబంధించి నేల విడిచి సాము చేస్తున్నది. విద్యారంగంలో వరుసగా వచ్చిన జీవోలు 172, 117 ఆంధ్రప్రదేశ్ విద్యా రంగాన్ని మునుపెన్నడూ లేని విధంగా అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను బలోపేతం చేయకపోగా పాఠశాలల విలీనం పేరుతో... తరగతుల తరలింపుల పేరుతో... పేద, బడుగు, బలహీన వర్గాలకు విద్యను దూరం చేస్తున్నది. పాఠశాల విద్యలో సరికొత్త సమస్యలు ముందుకొస్తున్నాయి. మంచి విద్య పేరుతో కొద్ది మందికే పరిమితం చేస్తూ ఎక్కువ మందికి ఉన్న కొద్దిపాటి విద్యావకాశాలను దూరం చేయటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
పిల్లలకు చదువు దూరం చేసి రాష్ట్ర అభివృద్ధి సాధ్యమా ?
విద్యాస్థాయి పెరగకుండా జిడిపి వృద్ధిరేటు సాధ్యపడదని తెలిసి కూడా విద్యారంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తున్నది. సంపూర్ణ అక్షరాస్యత సాధన ఇంకా ఆమడ దూరంలో ఉంది. ప్రజలకు విద్యను అందుబాటులో ఉంచి నిరక్షరాస్యతను పారదోలకపోగా...గ్రామాలలో ప్రాథమిక పాఠశాలల నుండి 3,4,5 తరగతులను తరలించడం వలన, ఏకైక ఆంగ్ల మీడియంను అమలు చేయడం వలన, పాఠశాలలను విలీనం చేయడం వలన వచ్చే పర్యవసానాలు సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యాన్ని మరింత దూరం చేస్తాయి. విద్యా హక్కు చట్టంలో ఎక్కడా ఇలా చేయాలని చెప్పలేదు. నాణ్యమైన విద్య అందాలంటే తరగతికి ఒక టీచరు ఉండాలనే అంశాన్ని విస్మరించి, సంస్కరణల పేరుతో, ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని పెంచుకుంటూ పోవడం వలన రాష్ట్రంలో 36,000 మంది టీచర్లను మిగులుగా చూపుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో 1:30, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1:53, ఉన్నత పాఠశాలల్లో 1:60 చేయడం ద్వారా నాణ్యమైన విద్య ఎలా అందివ్వగలదో ప్రభుత్వం చెప్పాలి.
రేషనలైజేషన్ ఎవరి కోసం ?
రాష్ట్రంలో దాదాపుగా 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల భర్తీ లేదు సరికదా...ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పెంచి మిగులు పోస్టులను తేల్చింది. అంతేగాక 117 జీవో అమలుకు పూనుకుని రేషనలైజేషన్ చేయనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో మిగులు పోస్టులు తేల్చి పాఠశాలలను, తరగతులను విలీనం చేసే ప్రక్రియ జోరుగా చేస్తున్నది. 21 మంది విద్యార్థులుండే పాఠశాలల్లో 5 తరగతులకు ఇద్దరు టీచర్లు గతంలో ఉండగా....117 అమలు తరువాత 30 మంది విద్యార్థులకు ఒక టీచర్‌నే పరిమితం చేస్తున్నది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోగల స్కూలు అసిస్టెంట్లను (6,7,8 తరగతులకు బోధిస్తారు) పూర్తిగా తొలగించనుంది. తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉండే యు.పి పాఠశాలల్లో జీవో అమలు తరువాత కేవలం ఐదుగురు మాత్రమే ఉంటారు. గతంలో మండలంలో సగటున 5 నుండి 11 వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండేవి. 117 జీవో అమలుతో మూడు రెట్లు పెరగనున్నాయి. ఇటువంటి సంస్కరణలు విద్యార్థులకుగాని, ప్రజలకుగాని ఉపయోగపడేవిగా ఉన్నాయా? కావాలనే ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచే పని చేస్తున్నది. నానాటికీ విద్యా సంస్థల క్లస్టరైజేషన్ జోరందుకుంటున్నది.
ఒక్క టీచర్‌తో పూర్తి స్థాయి బోధన !
ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. 'ఒక్క టీచరు మా పిల్లలకు పూర్తి స్థాయిలో బోధన ఎలా చేయగలరు?' అనే అనుమానంతో పరోక్షంగా ప్రైవేటు పాఠశాలల్లో నమోదుకు ఆసక్తి చూపే పరిస్థితులు వచ్చాయి. ఒకే పాఠశాలలో చదువుకుంటున్న అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఈ విధానం వలన విడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి సందర్భాలలో ఒకే పాఠశాలకు ఇద్దరూ కలిసి వెళ్లేలా ప్రైవేటు స్కూళ్లను ఎంచుకుంటున్నారు. 'నాడు నేడు'తో తయారు చేసిన గ్రానైట్ గచ్చులు, అద్దాల గదులలో చదువుకోవడానికి విద్యార్థులు ఉండరు. చెప్పడానికి ఉపాధ్యాయులు ఉండరు. మరి ఆ బడి ఎవరి కోసం, ఎందు కోసం? మూసివేయడానికా? ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇటువంటి సంస్కరణలు అమలు చేస్తున్నారంటే, విద్య బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకుంటున్నదా? ఏం చేయదలచుకుందో ప్రజలకు చెప్పాలి ?
ప్రజలకు చదువు కావాలనే ప్రభుత్వం ఇలాగే చేస్తుందా? గడిచిన మూడు సంవత్సరాలలో విద్యా రంగానికి అనేక సవాళ్ళు ఎదురైనాయి. విద్య నుండి ప్రభుత్వం తప్పుకునే సంస్కరణలను రూపొందిస్తున్నారు. కామన్ స్కూలు ఎడ్యుకేషన్ మాటే లేదు. బడ్జెట్లో కోటాయింపులు అంతంత మాత్రం. మాతృ భాషలో బోధన లేదని చెప్పేశారు. ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆంగ్లంలోనే బోధన తప్పనిసరి చేశారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిది అనటంలేదు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతలు, విలీనాల వలన ప్రజలకు చదువు అందుబాటులో ఉంటుందా? పబ్లిక్, ప్రైవేటు పార్టనర్‌షిప్ (పి.పి.పి) అమలు చేయడం వలన క్రమేపి కార్పొరేట్ సంస్థల అధీనంలోనికి వెళతాయి. దీని వలన బాలల డ్రాపవుట్ శాతం పెరుగుతుంది. ముఖ్యంగా బాలికలు విద్యకు దూరం అవుతారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తామని ఊరించి, ఇప్పుడు బడులలో పిల్లలు లేకుండా చేస్తోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇటువంటి విద్యా విధానాలను కోరుకోవడంలేదు.
మరింత వేగంగా....
ఈ విధానాలను ఎందుకు వేగవంతం చేస్తున్నారు? ఎందుకంటే గత 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న పాలక పార్టీలు ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచి ప్రైవేటు పాఠశాలలను విస్తరించే విధంగా చేస్తున్నాయి. ఈ మూడేళ్లలో సంస్కరణలు మరింత వేగవంతం అయ్యాయి. దానికోసం నూతన విద్యా విధానాన్ని, ప్రపంచ బ్యాంకును రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకుంది. నూతన విద్యావిధానంలో కీలకంగా వున్న క్లస్టరైజేషన్‌ను బలపరుస్తూ, నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే 172 జీవోని వేగవంతంగా అమలు చేస్తూ, 6 రకాల పాఠశాలలుగా విడదీసింది. రాష్ట్రంలో విద్య పునర్ వ్యవస్థీకరణ ప్రాజెక్టును, విద్యారంగాన్ని ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.6,800 కోట్లు అప్పు తెచ్చింది. అందులో భాగంగా ఆంగ్ల మీడియం అమలు చేయాలని, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వారు చెప్పిన విధానాన్ని అమలు చేయాలనే కండిషన్లు పెట్టారు. వీటితో లింక్ వున్న బైజూస్‌తో ఒప్పందాన్ని చేసుకుంది. బైజూస్ ఒప్పందం అమలు జరగాలన్నా, నూతన విద్యా విధానంలో వున్న క్లస్టరైజేషన్, విధివిధానాలు అమలు జరగాలన్నా ప్రభుత్వ పాఠశాలలను తగ్గించుకుంటూ రావాలి. కనుక దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఈ విధానాలను అమలు చేసి తీరతామని రాష్ట్ర పాలకులు శాసిస్తున్నారు. దాంతో విద్యా సంవత్సరం ఆరంభమే గందరగోళానికి గురైంది.
ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని విస్మరిస్తోంది. మన రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సాంస్కృతిక భాషా వైవిధ్యం, సమానత్వాలను వ్యాపింపచేయడానికి ఈ విధానాలు ఏ మాత్రం దోహదపడవు. రాజ్యాంగం కల్పించిన నిర్బంధ ఉచిత విద్య ప్రమాదంలో పడబోతున్నది. బహుళజాతి సంస్థల ప్రయోజనాల కోసం, కార్పొరేట్ సంస్థల లాభాల కోసం తీసుకొచ్చే ఈ సంస్కరణలను తిప్పికొట్టడానికి విద్యకు దూరం అవుతున్న వర్గాలు, లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి.
/ వ్యాసకర్త : యు.టి.ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
సెల్ : 8985383255 /
కె. విజయగౌరి