- బిజెపి పాలిత రాష్ట్రాలదే అగ్రస్థానం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : మహిళల అదృశ్యం అనేది దేశవ్యాప్త సమస్య అని, ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో అదృశ్యమైన బాలికలు, మహిళల్లో 78 శాతం మందిని గుర్తించామని, ఈ విషయంలో ఎపి రెండోస్థానంలో ఉందని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో మూడువేల కేసులకు సంబంధించి ఏడు రోజుల్లో చార్జిషీటు దాఖలు చేశామని వివరించారు. మహిళలు, బాలికలు అదృశ్యంలో బిజెపి పాలిత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముందున్నాయని, తెలంగాణ తదితర రాష్ట్రాలు తొలి పదిస్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎపి 11వ స్థానంలో ఉందని, దీన్ని రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థకు అంటగట్టడం సరికాదని వివరించారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి ఫరిడవిల్లుతోందని, అన్ని రంగాల్లో వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. సంక్షేమ పథకాలన్నీ మహిళల పేరుతోనే ఇస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకూ మూడుకోట్ల మంది మహిళలకు ప్రత్యక్ష ప్రయోజనాలు, మరో కోటిన్నర మందికి పరోక్ష ప్రయోజనాలను బదిలీ చేశామని తెలిపారు. వారి సంరక్షణ కోసం దిశ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులకు స్వచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని పద్మ వివరించారు. మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై బహిరంగంగా చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయా? అని ఆమె ప్రశ్నించారు.










