ప్రజాశక్తి - ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) : ఎన్నారై వివాహ సంబంధాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఈ వివాహాలకు సంబంధించి చట్టాల విషయంలో మహిళల భద్రత, రక్షణ, సాధికారతపై పార్లమెంట్‌లోనూ చర్చ జరగాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సిఐడి డిపార్ట్‌మెంట్, ఎపి పోలీస్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో మంగళవారం 'విదేశీ వివాహాలు-భారతీయ మహిళల హక్కులు-సాధికారత' అనే అంశపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఐ వివాహాల పట్ల తల్లిదండ్రులు ముందుగా వాస్తవాలు తెలుసుకునేందుకు ఆయా దేశాల్లో ఉన్న తెలుగు అసోసియేషన్‌ల సహకారం తీసుకోవాలని సూచించారు. స్వదేశంలో గానీ విదేశాల్లో గాని ఏ విధమైన సాంప్రదాయంలో వివాహం జరిగిన వెంటనే ఎంబసీలో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. సామాన్యులకు మెరుగైన సేవలు అందిస్తూనే మహిళలు, చిన్నారులు రక్షణ ధ్యేయంగా మహిళా పోలీస్ వ్యవస్థను సమర్థవంతంగా, ఆదర్శనీయంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ కృషిని ప్రశంసించారు. కార్యక్రమంలో సిఐడి ఎడిజి సంజరు, జాతీయ మహిళా సంయుక్త కార్యదర్శి ఎ అశోలి చలై, సిఐడి ఎస్‌పి కెజివి సరిత, వర్సిటీ ప్రొఫెసర్ సరస్వతి రాజు అయ్యర్ తదితరులు పాల్గొన్నారు.










