Aug 29,2023 19:02

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ.పాల్‌ విశాఖలోని ఆశీలుమెట్ట వద్దనున్న తన ఫంక్షన్‌ హాల్‌ ప్రాంగణంలో తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం భగం చేశారు. అనంతరం కెజిహెచ్‌కు తరలించగా వైద్య పరీక్షలకు ఆయన నిరాకరించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని రాతపూర్వకంగా వైద్యాధికారులకు ఇచ్చి అక్కడి నుంచి మరలా తన ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కెఎ.పాల్‌ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. శాంతియుతంగా తాను దీక్ష చేస్తుంటే దానిని భగం చేశారని తెలిపారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉక్కు పరిరక్షణ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ప్లాంట్‌ కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దీక్ష విరమించాలని తనకు మంత్రులు, నాయకులు ఫోన్లు చేశారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆగాలంటే రాష్ట్రంలోని ఎంపిలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పోరాటానికి దిగాలని, అప్పుడే కేంద్రం స్పందిస్తుందని చెప్పారు. పాల్‌ పోరాటానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, విశాఖ వాసులు మద్దతు తెలిపారు.