
డిజిటల్ ఇండియా అంటూ ప్రధాని నుంచి కిందిస్థాయి నేతల వరకూ ఇచ్చే నినాదాల్లోని డొల్లతనాన్ని కోవిన్ పోర్టల్‌లో వ్యక్తిగత డేటా చౌర్యం మరోసారి ఎత్తిచూపింది. కనీసం 110 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసిన కోవిన్ పోర్టల్‌కే భద్రత కల్పించలేని కేంద్రం డిజిటల్ ఇండియా ఎలా సాధిస్తుంది? మనదేశం వేగంగా డిజిటలైజ్ అవుతోంది. కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరి పేరు, జండర్, పుట్టిన తేదీ, టీకా తేదీ, స్థలం, ఆధార్‌కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, ఓటర్ ఐడి తదితర సమాచారం కోవిన్ పోర్టల్‌లో నమోదైంది. దేశ జనాభాలో అత్యధికుల నుంచి సేకరిస్తున్న ఈ సమాచారానికి భద్రత కల్పించగలరా? అని అప్పట్లోనే నిపుణులు ప్రశ్నించారు. కోవిడ్-19 నిర్వహణ కోసం ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరి చేయాలన్న కేంద్రం నిర్ణయంపై ఏడాది క్రితం సాంకేతిక నిపుణుడు ఒకరు కర్ణాటక హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ప్రజల సమాచారం భద్రతకు కేంద్రం భరోసా ఇవ్వగలదా? అని ఆయనతోపాటు పలువురు ప్రశ్నించారు. ఆ సందేహాలు నిజమని టెలిగ్రామ్‌లో ష్ట్రaసyశ్రీవaతీఅలో కోవిన్ సమాచారం తాజా లీక్ స్పష్టం చేసింది. కేంద్రం ఎప్పటిమాదిరిగానే వాటిని ఖండించింది. కోవిన్ పోర్టల్‌లో డేటా ఉల్లంఘన జరిగిందా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సైతం ఆరోజు అధికారులెవరూ అందుబాట్లో లేకపోవడం గమనార్హం. అంతా బాగానే ఉందంటూ ప్రకటనలు మాత్రమే విడుదలయ్యాయి. అంతేకాదు ఇప్పటివరకూ ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభం కాలేదు. సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ హ్యాకింగ్ గ్రూప్ ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్‌టి-ఇన్) ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. వ్యక్తిగత సమాచారంతోసహా గోప్యతను రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా 2017లో సుప్రీంకోర్టు సమర్థించినప్పటికీ, ప్రభుత్వం డేటా రక్షణ బిల్లును నేటికీ ఆమోదించలేదు.
కేంద్రం గొప్పగా చెప్పుకుంటున్న డిజిటల్ ఇండియా మాస్టర్ ప్లాన్‌లలో సైబర్ సెక్యూరిటీ ఆడిట్, ఫోరెన్సిక్ విశ్లేషణ, ప్రాథమిక భద్రతా చర్యలు లేవు. డేటా సేకరణ పెంచాలని కోరుకుంటున్న మోడీ ప్రభుత్వం దానిని రక్షించడానికి ఆసక్తికనపరచకపోవడం ప్రజలందరికీ అతిపెద్ద విపత్తుగా మారబోతోంది. గతంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌పై హ్యాకర్లు దాడి చేసి డేటా తస్కరించడం, రూ.200 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేయడం, భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్)పై పంజా విసిరిన తీరు మన భద్రత పరిస్థితిని తేటతెల్లం చేసింది. ఎయిమ్స్‌లో దేశంలోని ప్రముఖుల సమాచారం నిక్షిప్తమై ఉండటం గమనార్హం. సైబర్ దాడులపై అధ్యయనం చేసే ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ) క్లౌడ్ ఎస్‌ఇకె నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా దాడులు పెరుగుతున్నాయి. హెల్త్‌కేర్ రంగంలో దాడులకు గురవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. హెల్త్ కేర్ సమాచారం కోసం హ్యాకర్లు దాడులు చేస్తారని, ఆ సమాచారాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతోపాటు వైద్య, ఆరోగ్య రంగానికి చెందిన వివిధ కార్పొరేట్ సంస్థలకు భారీ మొత్తాలకు అమ్ముకుంటున్నారని క్లౌడ్ ఎస్‌ఇకె సంస్థ సర్వే వెల్లడించింది.
అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాలు తమ డిజిటల్ వ్యవస్థల భద్రత కోసం ప్రభుత్వ సర్వర్లన్నింటినీ ఒకే పోర్టల్ పరిధిలోకి తీసుకొచ్చి, పటిష్టమైన రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేశాయి. మనదేశంలో తాత్కాలిక ప్రయోజనాలు మినహా ఆ తరహా ఆవిష్కరణలపై పాలకులు శ్రద్ధ చూపకపోవడంతో పరిస్థితి దిగజారుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టకుండా జరిగే డిజిటలైజేషన్ ప్రక్రియ మొదటికే మోసంగా మారుతుంది. 2021లో కోవిన్ డేటా లీకైనట్టు ఆరోపణలు వచ్చినప్పుడు సిఇఆర్‌టితో దర్యాప్తునకు ఆదేశించింది. ఆ దర్యాప్తు వివరాలు నేటికీ ప్రజలకు అందుబాట్లో లేవు. ఈ మొత్తం వ్యవహారంపై కూలంకుషంగా దర్యాప్తు చేయాలి. భారతీయుల వ్యక్తిగత సమాచార భద్రతలో జరిగిన ఇంత తీవ్ర ఉల్లంఘనకు బాధ్యులైన వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలి. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పూర్తి భద్రతనిచ్చే సంపూర్ణ రక్షణ వ్యవస్థ సాకారం కావాలి.