రాజకీయాలు, ఎన్నికల నేపథ్యంలో సాగే సినిమాలు మనకు కొత్తేం కాదు. ఇప్పటికే మనం చాలా సినిమాలు చూశాం. అయితే ఇప్పటిదాకా వచ్చిన అలాంటి సినిమాలు రాజకీయ నాయకుల కోణాన్ని ఆవిష్కరించినవే. అసలు ఓటు ఎందుకు వేయాలి అని ఓ ఓటరు ప్రశ్నించే యాంగిల్‌లో 'మార్టిన్ లూథర్ కింగ్' సినిమాను పూజ కొల్లూరు తెరకెక్కించారు. ఈ సినిమా గత నెల 27న విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, పరిశ్రమలో తన తొలినాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.
'నేను విజయవాడలో సత్యనారాయణపురంలో పెరిగిన ఒక మధ్యతరగతి జర్నలిస్ట్ కూతురుని. పదో తరగతి వరకు కేంద్రీయ విద్యాలయంలో చదివాను. నాకు ఇంటర్‌లో అందరిలాగా ఎంపీసీ, బైపీసీ తీసుకోవాలని లేదు. సైన్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ఐఏఎస్ అవ్వాలనే కల కూడా ఉండేది. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో 'యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ మహేంద్ర' గురించి తెలిసింది. రెండు మూడు వేల మంది అప్లై చేస్తే, నలుగురైదుగురికి అక్కడ సీట్ వస్తుంది. అలా వచ్చినవారిలో నేనూ ఒకదానిని. నాకు అక్కడ స్కాలర్‌షిప్ కూడా వచ్చింది. అక్కడ నేను ఫిజిక్స్ చదివాను, ఎకనామిక్స్ చదివాను. ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. స్పానిష్ నేర్చుకున్నా. వీటితోపాటు ఆర్ట్స్‌లో కూడా ఒకటి ఎంపిక చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉండడం వల్ల ఫిల్మ్ స్టడీస్ తీసుకున్నాను. అక్కడ మాకు ఒకసారి ఓ స్పానిష్ ఫిల్మ్ చూపించారు. ఆ సినిమా స్పానిష్ సివిల్ వార్ గురించి ఉంటుంది. ఒక సినిమాతో ఎంతలా ప్రభావితం చేయొచ్చు అనేది ఆ సినిమా ద్వారా తెలిసింది. సైంటిస్ట్, ఐఏఎస్ అయ్యి చేసే దానికంటే.. సినిమాతో ఎక్కువ ప్రభావితం చేయొచ్చు అనిపించింది. అప్పటి నుంచి ఇక పూర్తిగా సినిమా ద్వారా ప్రజలకు దగ్గరకావాలని అనుకున్నా. చిత్ర పరిశ్రమలో రాణించాలని నిర్ణయించుకున్నాను. సినిమాకి సంబంధించి డిగ్రీ కోసం ఇక్కడ సరైన కాలేజ్ లేదు. అమెరికాలో మంచి కాలేజ్‌లో స్కాలర్‌షిప్ వచ్చింది. అలా అమెరికా వెళ్ళి, నాలుగేళ్లు ఫిల్మ్ మేకింగ్ చదివాను. స్కాలర్‌షిప్‌తో కూడా పై చదువులు చదువుకోవచ్చు. చాలా మంది విద్యార్థులకు ఈ విషయం తెలియదు. అందుకే చెబుతున్నాను.
కాలేజీలో ఉన్నప్పడే షార్ట్‌ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీశాను. ఓ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. అలాగే అమెజాన్ ఫారెస్ట్‌లో నేను తీసిన డాక్యుమెంటరీ కూడా ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది. దాంతో దర్శకురాలిగా అనుభవం ఏర్పడింది. అంతేకాదు.. ఓ సినిమాను బయటకు తీసుకురావాలంటే ప్రతి రంగం మీద పట్టుండాలి. అలా నేను వీడియో ఎడిటింగ్, డ్రెసింగ్ స్టైల్, డైలాగ్స్ రాయడం.. ఇలా ప్రతిపనీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. విదేశాల్లో ఉన్నప్పుడే దర్శకుడు వెంకటేష్ మహాతో పరిచయం ఏర్పడింది. అలా ఆయన తీసిన 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాకి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా చేశాను. అంతేకాదు.. ఒక ముఖ్యపాత్ర కూడా పోషించాను. ఆ సినిమాకు చాలా మంచిపేరు వచ్చింది. దాంతో ఆయన తీసిన మరో సినిమా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాలోనూ కలిసి పనిచేశా. అప్పటికే జనానికి చైతన్యం కలిగించేలా, ఆలోచింపజేసే అంశాలను, కథలను ఎంచుకుని సినిమా చేసే నిర్మాతగా నాకు పేరు వచ్చింది.
ఇప్పుడు 'మార్టిన్ లూథర్ కింగ్' తెలుగు సినిమాకు దర్శకత్వం వహించాను. కానీ, నాకు దర్శకత్వం కొత్తకాదు. నా సొంత కథల్ని చాలామంది నిర్మాతలకి వినిపించాను. కానీ 'ఈ సినిమా మరో ఐదేళ్ల తర్వాత తీయాల్సిన సినిమా. అమ్మాయివి కదా! రొమాంటిక్, కామెడీ సినిమాలు చెయ్యి' అని అనేవారు. నిజానికి వాళ్లు అలా అనడంలో తప్పు లేదు. ప్రతి పరిశ్రమలోనూ ఇబ్బందులుంటాయి. పట్టుదలగా పనిచేయాలి. కానీ, విభిన్నమైన చిత్రాలు తీయాలనేదే నా ప్రత్యేకత' అని అంటారు పూజ.
దివంగత దర్శకురాలు, నటి అయిన విజయనిర్మల తరహాలో వైవిధ్యమైన సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించాలనేది ఆమె ఆశ. 'ఐదేళ్ళ చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ల పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులు మనస్ఫూర్తిగా చూసి, నవ్వుకోవాలని తమిళ రీమేక్ సినిమా 'మార్టిన్ లూథర్ కింగ్' తీశాము. పాత్రల ఎంపిక, ఎడిటింగ్ కూడా చేశా. ఇందులో వినోదంతో పాటు ఓటు విలువని తెలియచేసేలా, బలమైన సందేశం ఉంటుంది. ఓటరే కింగ్ అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాం.' అని సగర్వంగా అంటున్నారు పూజ.