Jul 31,2022 06:59

2014 లోనే బయిటకొచ్చిన ఈ కుంభకోణంపై నిరసన కొనసాగుతున్నా ప్రభుత్వం సరిదిద్దుకోకపోగా సమర్థనలతో సరిపెట్టింది. 2018 నాటికి ఇది తీవ్ర రూపం తీసుకుంది. సిపిఎం ఎం.పి వికాస్‌ రంజన్‌ భట్టాచార్య హైకోర్టులో కేసు వేశారు. మరో వంక నష్టపోయినవారి నిరసన దీక్షలు కొనసాగాయి. రాష్ట్రం మూలమూలలా ఈ స్కామ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలశాయి. నినాదాలు హోరెత్తాయి. అప్పటి నుంచి అటు ప్రత్యక్ష పోరాటం ఇటు న్యాయ పోరాటం కూడా ఉధృతమవుతూ వచ్చాయి. మమత మూడోసారి గెలిచాక కోర్టులో విచారించే న్యాయమూర్తులు కూడా బెదిరింపులు ఎదుర్కొన్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు మమత చెబుతున్నా రాజకీయ బేరసారాలు సాగుతూనే వచ్చాయి. శారదా స్కాం, నారదా స్కాం ఇంకా వివిధ సంస్థల్లో అక్రమాలకు పాల్పడిన ముఖ్య నేతలు నెమ్మదిగా బిజెపిలో చేరి దర్యాప్తును తాత్కాలికంగా తప్పించుకున్నారు.

   మొన్నటి దాకా జాతీయ ప్రత్యామ్నాయ నేతగా ప్రచారం చేసుకున్న బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక్కసారిగా ఉనికిని కాపాడుకోవడానికి ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. నిరాడంబర మూర్తిగా, నీతినిజాయితీల నిప్పుకణికగా ఆమెను చిత్రించిన బడా మీడియా ఇప్పుడు కథ మార్చేస్తున్నది. ప్రపంచంలోనే అరుదైన కమ్యూనిస్టు విజయగాధగా చరిత్రకెక్కిన వామపక్ష సంఘటన మూడున్నర దశాబ్దాల పాలన సహించలేని శక్తుల అండతో ఆశాదీపంగా చూపించబడిన అక్క (దీదీ) ఇప్పుడు చిక్కుల్లో చిక్కిపోయారు. రోత పుట్టించే స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సి) కుంభకోణంలో పుట్టలు పుట్టలుగా కోట్లు బయిటపడ్డాక తృణమూల్‌ సర్కార్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. భవిష్యత్‌ పరిణామాలు తెలుసుగనకే మమత రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలోనే రాజకీయ పిల్లిమొగ్గలు వేశారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా నిలిచిన మాజీ మంత్రి పార్థా చటర్టీ అరెస్టు, యాభై కోట్ల పట్టివేత తర్వాత మరింత దిగిపోయి మోడీతో తక్షణ సమావేశానికి తొందరపడుతున్నారు.

                                                                     ఎస్‌ఎస్‌సిలో జరిగిందేమిటి ?

ఎస్‌ఎస్‌సి పాఠశాల టీచర్ల నియామకం కోసం పరీక్షలు నిర్వహిస్తుంది. వామపక్ష ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధతో గొప్ప ప్రగతి సాధించింది. ప్రైవేటు కార్పొరేట్‌ విద్యాసంస్థలు అక్కడ విస్తరించలేదంటే కారణం ప్రభుత్వ విద్యారంగం సమర్థంగా నడవడమే. ఆ కాలంలో టీచర్ల నియామకం ఎలాంటి జోక్యాలు లేకుండా నిబంధనల ప్రకారం నడిచింది. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక కొద్ది కాలంలోనే ఇదంతా గోల్‌మాల్‌గా మారింది. నియామకం కోసం పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకున్నవారికి ఉద్యోగాలు హుళక్కి కాగా అంతు తెలియని రీతిలో వెనకనున్న వారు అవలీలగా పోస్టులు సంపాదించారు. 2013లో టెట్‌ ఫలితాలలో కేవలం 1.07 శాతం అభ్యర్థులు మాత్రమే అర్హత సాధించినట్టు ప్రకటించారు. 55 లక్షల మంది అభ్యర్థులు రాసినట్టు మొదట వివరాలు రాగా తర్వాత హఠాత్తుగా 45 లక్షల మంది మాత్రమే రాసినట్టు ప్రకటించారు. తర్వాత 17 లక్షల 72 వేలకు కుదించారు. 18,792 మంది అర్హత సాధించారని వెల్లడించారు. ఇదంతా పెద్ద బూటకమని, పరీక్షా పత్రాలను తృణమూల్‌ కార్యాలయంలోనే దిద్దారని కూడా బహిర్గతమైంది. తద్వారా తమ బంధుమిత్రులను, కార్యకర్తలను మాత్రమే ఎంపిక చేశారు. కల్నా నియోజక వర్గ ఎంఎల్‌ఎ కుటుంబంలో ఎనిమిది మందికి పోస్టింగులు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. ముకుల్‌ రారు, పార్థా చటర్జీ, మదన్‌ మైత్రాల కమిటీ ఈ నియామకాలు ఖరారు చేసింది. 2014 లోనే బయిటకొచ్చిన ఈ కుంభకోణంపై నిరసన కొనసాగుతున్నా ప్రభుత్వం సరిదిద్దుకోకపోగా సమర్థనలతో సరిపెట్టింది. 2018 నాటికి ఇది తీవ్ర రూపం తీసుకుంది. సిపిఎం ఎం.పి వికాస్‌ రంజన్‌ భట్టాచార్య హైకోర్టులో కేసు వేశారు. మరో వంక నష్టపోయినవారి నిరసన దీక్షలు కొనసాగాయి. రాష్ట్రం మూలమూలలా ఈ స్కామ్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలశాయి. నినాదాలు హోరెత్తాయి. అప్పటి నుంచి అటు ప్రత్యక్ష పోరాటం ఇటు న్యాయ పోరాటం కూడా ఉధృతమవుతూ వచ్చాయి. మమత మూడోసారి గెలిచాక కోర్టులో విచారించే న్యాయమూర్తులు కూడా బెదిరింపులు ఎదుర్కొన్నారు. బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నట్టు మమత చెబుతున్నా రాజకీయ బేరసారాలు సాగుతూనే వచ్చాయి. శారదా స్కాం, నారదా స్కాం ఇంకా వివిధ సంస్థల్లో అక్రమాలకు పాల్పడిన ముఖ్య నేతలు నెమ్మదిగా బిజెపిలో చేరి దర్యాప్తును తాత్కాలికంగా తప్పించుకున్నారు. ముకుల్‌ రారు, అభిషేక్‌ బెనర్జీ, సువేంద్రు అధికారి ఇలా మమత బృందంలో కీలక నేతలు చాలామంది బిజెపిలో చేరారు. వారంతా బిజెపి శిబిరంలో చేరి రక్షణ పొందడమే గాక తమ లోగుట్టు వెల్లడించారని పరిశీలకుల అభిప్రాయం. బెంగాల్‌ వామపక్షాలు, మీడియా కూడా అనేక అవినీతి వ్యవహారాలు బయిటపెడుతున్నా కేంద్రం సకాలంలో చర్యలు తీసుకోలేదు. శారదా స్కాంలో చిట్‌ఫండ్‌ వ్యాపారం సొమ్మును మీడియా లోకి మళ్లించడం, మమత అనుకూల ప్రచారంతో ఓటర్లను మభ్యపెట్టడం వీరి వ్యూహంగా నడిచింది. వాస్తవానికి సింగూరు నందిగ్రామ్‌లపై దుష్ప్రచారం వెనక కూడా ఇదే వుంది. సిపిఎంను దెబ్బతీసేందుకు ఆరోజును మావోయిస్టులు, ముస్లింలీగ్‌, బిజెపి, కాంగ్రెస్‌ కూడా చేతులు కలిపిన చరిత్ర ఇప్పుడు గుర్తుకు వస్తుంది. అరాచకం మూర్తీభవించిన మమతను వీరనారిగా, పేదల మనిషిగా వీరంతా ప్రచారం మోగించారు. వామపక్ష పాలనలో తప్పులు కొన్ని దొర్లి వుండవచ్చు గాని అవినీతి మచ్చ అసలు చూపించలేక అసత్య ప్రచారాలు చేపట్టారు. కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులన్నీ కలసి మమతను గెలిపించారు. సాదా చీర, సామాన్యమైన ఇల్లు అంటూ ఆమె నిరాడంబరతను వేనోళ్ల కీర్తిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారు (మమత పేదల కాలనీలో వున్నట్టు చెప్పుకున్నా ఆ ఇంటి మరమ్మతులకు, జనావాసంలో ఆమె రక్షణకు మామూలు కంటే ఎక్కువ ఖర్చవుతుంది. నిజానికి జ్యోతిబసు, బుద్ధదేవ్‌ భట్టాచార్యతో సహా ఎవరూ ముఖ్యమంత్రి నివాసంగా భవనం తీసుకోలేదు. జ్యోతిబసు స్వంతింట్లోనే వుండేవారు. బుద్ధదేవ్‌ ప్రభుత్వ గృహ సముదాయంలో వున్నారు. అసలు బెంగాల్‌కు ముఖ్యమంత్రి నివాసం అంటూ లేదు). ఏమైనా వ్యక్తిగత నిరాడంబరత మాటున నీతినిబంధనలు ఎలా పాతరేశారో ఇప్పుడు ఖచ్చితమైన ఆధారాలతో దొరికిపోయింది. తమ ప్రత్యర్థులపైన కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఎన్‌ఐఎ వంటి వాటిని కేంద్రం దుర్వినియోగపరుస్తున్న మాట నిజమే. పార్లమెంటు సమావేశాల సమయంలో తృణమూల్‌తో సహా వివిధ ప్రతిపక్షాలు దీనిపై ఒక ప్రకటన చేశాయి కూడా. అయితే అవినీతి ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలున్నప్పుడు దర్యాప్తు వద్దని దాని ఉద్దేశం కాదు. ఈ దర్యాప్తులలో ద్వంద్వనీతి అన్నది సమస్య. ఇప్పుడు ఎస్‌ఎస్‌సి వ్యవహారంలో కూడా దర్యాప్తు హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్నది.
 

                                                                     నోట్ల కట్టలు గుట్టలు గుట్టలు

టెలికాం కుంభకోణంలో అప్పటి మంత్రి సుఖ్‌రాం ఇంటిపై దాడి చేసినపుడు విపరీతంగా అవినీతి సొమ్ము పట్టుబడింది. ఆ సమయంలో కార్టూనిస్టు ఆరె.కె లక్ష్మణ్‌ ఒక చిత్రం వేశారు. 'ఏమిటి...చిన్న నోట్‌ రాసుకుందామంటే కాగితం ముక్క లేదు! అంతటా ఈ నోట్ల కట్టలైతే ఎలా చావను?' అని సుఖ్‌రాం తన పి.ఎ తో అంటూ వుంటాడు. పార్థా చటర్జీ సన్నిహితురాలైన మాజీ నటి అర్పితా ముఖర్జీ ఇంటిపై దాడి చేసినపుడు అదే విధంగా గది నిండా దాచివున్న రూ.21 కోట్ల నగదు పట్టుబడింది. అక్కడ దొరికిన వివరాలతో మరో దాడి చేస్తే ఇంకో 29 కోట్లకు పైగా దొరికింది. బంగారం, ఖరీదైన కానుకలు, విలువైన పెయింటింగులకు లెక్కే లేదు. ఇంత ప్రత్యక్షంగా నోట్ల కట్టలతో దొరికిపోయిన సందర్భాలు అరుదు. పార్థా చటర్జీని అరెస్టు చేసిన వెనువెంటనే ... ఆరోపణలు రుజువైతే చర్య తీసుకుంటామని మమతా బృందం గంభీరోక్తులు పలికింది. మమతా ఒక సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొంటూ అవినీతిని ఎన్నడూ సహించే ప్రసక్తి లేదన్నారు. ఇంతలోనే ఆయనను తొలగించాలని అంతర్గతంగా వత్తిడి పెరగడంతో పార్టీ పదవుల నుంచి, మంత్రి పదవి నుంచి కూడా తొలగించి చేతులు దులుపుకున్నారు. పార్థా చటర్జీ ముఖ్య నాయకుల ఫిరాయింపుల తర్వాత కొన్నేళ్లుగా మమతకు కుడిభుజంగా చక్రం తిప్పుతున్నవాడే గానీ ఆషామాషీ మనిషి కాదు. ఆమెకు తెలియకుండానూ ఆమె పాత్ర లేకుండానూ ఇంత పెద్ద కుంభకోణం ఇంత కాలం సాగడం అసంభవం. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మహ్మద్‌ సలీం తదితరులు ఈ సర్కారు అవినీతి పుట్ట అని ఈ తీగతో పాటు మొత్తం దొంక కదిలించాల్సిందేనని కోరారు. ముఖ్యమంత్రి కూడా వైదొలగాలని కోరుతూ వామపక్షాలు పెద్ద ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి.
 

                                                                      రాజకీయ భవితవ్యం ?

ఈ పరిణామాల తర్వాత మమతా బెనర్జీ మోడీతో సయోధ్యకు ప్రయత్నించవచ్చనేది ఒక అంచనా కాగా ఆమె సమావేశం కోసం ప్రయత్నించడం అదే సంకేేతమిస్తున్నది. 2021 ఎన్నికలకు ముందు వరసకట్టి బిజెపి లోకి ఫిరాయించిన ముఖ్యులు అనేకమంది ఆమె విజయం తర్వాత తిరిగి వచ్చారు. వారిలో చాలామందిపై కేసులున్నాయి. ఇప్పుడు బిజెపి నాయకుడుగా వున్న సువేందు అధికారి కూడా అలా వెళ్లిన వారే. 2021లో గెలుపు తర్వాత తిరిగివచ్చిన అభిషేక్‌ బెనర్జీ, ముకుల్‌ రారు వంటి వారు తృణమూల్‌లో మళ్లీ కీలక స్థానాలు పొందారు. మొత్తంపైన రెండు పార్టీల్లో అదే నాయకులు ముఖ్య పాత్రధారులుగా వున్నారనేది వాస్తవం. దాగుడు మూతల వ్యవహారంగా వున్న ఈ రెండు పార్టీల అవకాశవాద సంబంధాల గురించి స్పష్టంగా చెప్పడం కష్టం. వామపక్షాలు అదృశ్యమైపోయాయని చెల్లు చీటి రాసినవారు కూడా ఇప్పుడు వాటి భవిష్యత్‌ పాత్ర గురించి మాట్లాడుతున్నారు. ఈ మధ్య స్థానిక ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలు రావడం ఇందుకు మరో కారణం.
      అవినీతి సొమ్ము అపారంగా కలిగివున్న మమతను కాపాడేందుకు ఇప్పుడు అనేక విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు రాజ్‌దీప్‌ సర్దేశాయి జరిపిన ఒక చర్చలో ఇండియా టుడే కన్సల్టింగ్‌ ఎడిటర్‌ జయంత్‌ ఘోషాల్‌ మమతకు ఈ అవినీతి గురించి తెలియదని చెప్పారు. ఆ పార్టీ ఎం.పి స్వాగత్‌రారు కూడా పార్థా చటర్జీ తమకందరికీ అప్రతిష్ట తెచ్చారని అంటుంటే, తను కుట్రకు బలైనాని ఆయన ఆక్రోశిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఇవేవీ తెలియదని సమర్థించడానికి సన్నిహిత నేతలు తంటాలు పడుతున్నారు. నిజానికి అనేక రకాలైన మాఫియా ముఠాలతో తృణమూల్‌ కు గట్టి బంధమే వుంది. ఈ కేసులోనే ఎనిమిది బినామీ ఖాతాలు స్తంభింపచేశారు. మూడు ఉత్తుత్తి కంపెనీలు దొరికాయి. మరింత లోతుగా ఖచ్చితంగా దర్యాప్తు సాగితే ఇంకా చాలా బయిటకొస్తాయి. ఇన్నేళ్లు ఆందోళన చేస్తున్నవారిని పట్టించుకోని పాలక పార్టీ కార్యదర్శి అభిషేక్‌ ముఖర్జీ... వారికి ఉద్యోగాలు ఇస్తామంటూ చర్చలకు వెళ్లడం నష్ట నివారణ వ్యూహమే. బిజెపి ఇప్పుడు చాలా మాట్లాడుతున్నా ఇన్నాళ్లు ఎందుకు దాటేశారనేది చెప్పాల్సి వుంటుంది. ఈ కుంభకోణంపై తొలి నుంచి వివిధ రూపాలలో పోరాడుతున్న సిపిఎం, వామపక్షాలు మాత్రం దోషులందరని బోనెక్కించేదాకా వదలిపెట్టడం జరగదు. మమతా బెనర్జీ రాజీనామా చేసి మరెవరినైనా ముఖ్యమంత్రిగా చేయాలనే పోరాటం కొనసాగించనున్నాయి.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి