May 12,2023 07:38

           ప్రజాస్వామ్యంలో ప్రజలను భాగస్వామ్యం చేయకుండా ప్రయివేటు శక్తులు, లేదా సైన్యం ఏ రూపంలో జోక్యం చేసుకున్నా అది అరాచకానికి, అశాంతికి, అస్థిరత్వానికి దారితీస్తుంది. పాకిస్తాన్‌లో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) అధినేత, పాక్‌ మాజీ ప్రధానమంత్రి, ఇమ్రాన్‌ ఖాన్‌ను అత్యంత భయానక వాతావరణంలో నేషనల్‌ అకౌంటబిలిటి బ్యూరో (ఎన్‌ఎబి) అరెస్టు చేయడం, అనంతరం దేశవ్యాప్తంగా హింస చెలరేగడం ఆందోళనకరం. ఇమ్రాన్‌ను అరెస్టు చేయరాదంటూ గతంలోనే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసినా ఎన్‌ఎబి బలగాలు వాటిని ఖాతరు చేయలేదు. సంఘ విద్రోహులను వేటాడినట్లు ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ చేపట్టి..అందునా కోర్టు ప్రాంగణంలో ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. ఆయన అరెస్టయిన వెనువెంటనే దేశవ్యాప్తంగా ఇమ్రాన్‌ మద్దతుదారులు భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి మరీ సైనిక బలగాలు ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుంటుంటే మిన్నుకుండిపోయిన ప్రభుత్వం.. అరెస్టు అనంతరం చేపట్టిన నిరసనలను అణిచేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దించి ఇమ్రాన్‌ మద్దతుదారుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. నిరసనలు, హింసాత్మక ఘటనలతో పాకిస్తాన్‌ అట్టుడికింది. 50 మంది వరకు చనిపోయినట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రజాస్వామ్య పాలనలో ఇలాంటి ఘటనలు అవాంఛనీయం. ఇమ్రాన్‌ అరెస్టు చట్ట ఉల్లంఘనేనంటూ, ఆయనను తక్షణమే విడుదల చేయాలని పాకిస్థాన్‌ సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి ఉమర్‌ అట బందియాల్‌ సముచిత ఆదేశాలు జారీ చేయడం కాస్త ఊరట కలిగించే అంశం.
            ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన కేసు ఇప్పటిది కాదు. పాకిస్తాన్‌కు చెందిన ఒక రియలెస్టేట్‌ సంస్థ, ఇతరులు జరిపిన మనీలాండరింగ్‌ అవినీతి కేసుల్లో బ్రిటన్‌ పోలీసులు పాక్‌ కరెన్సీలో 50 బిలియన్లకు సరిపడా అక్రమాలను నిర్ధారించి, ఆ సొమ్మును ఇస్లామాబాద్‌కు పంపారు. ఆ మొత్తాన్ని అక్రమాలకు పాల్పడిన వారి చేతుల్లో బాధితులుగా మారిన వారికి చెల్లించేందుకు ప్రధానిగా ఉన్నపుడు ఇమ్రాన్‌ ఖాన్‌, అతని భార్య విలువైన నగలు, కొంత భూమి, నగదుతో సహా ఐదు బిలియన్ల మేరకు లంచంగా తీసుకున్నారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే ఎన్‌ఎబి ఆయనను అరెస్టు చేసింది. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఖాన్‌ చెబుతుండగా..ఆయన అక్రమాలను అధికారిక పత్రాలే తేటతెల్లం చేస్తున్నాయన్నది ప్రభుత్వ పెద్దల వాదన.
         పాక్‌ సహా అనేక దేశాల్లో అధికారంలో ఉన్న పెద్దలు అవినీతికి పాల్పడటం అసాధారణమేమీ కాదు. అయితే రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్‌గా పెట్టుకుని అక్రమ కేసుల్లో ఇరికించడం ద్వారా వేధింపులకు పాల్పడటం పాలకులకు పరిపాటిగా మారింది. లాటిన్‌ అమెరికాలో అనేక దేశాల పరిణామాలు దీన్ని వెల్లడించాయి. ప్రస్తుత బ్రెజిల్‌ అధ్యక్షులు లూలా డసిల్వాను గత ఎన్నికల్లో పోటీలో లేకుండా చేసేందుకు నాటి బోల్సనోరా ద్వారా అమెరికా ఎలా కుట్ర పన్నిందో చూశాం. ఇమ్రాన్‌ ఖాన్‌కు లూలాకు ఎలాంటి పోలికలేదు. కానీ తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. అయితే అది చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా జరగాలే తప్ప సహజ న్యాయసూత్రాలను ధిక్కరించి కాదు. ఇమ్రాన్‌ విషయంలోనూ అమెరికా మార్కు కుట్ర కోణం కనిపిస్తోంది.
            ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా మాస్కో వెళ్లి పుతిన్‌తో భేటీ కావటం పాకిస్తాన్‌లో అమెరికా అనుకూల శక్తులకు మింగుడు పడలేదు. పాక్‌ సైనిక దళాల మాజీ అధిపతి జనరల్‌ జావేద్‌ బజ్వా రష్యా వైఖరిని ఖండించాలని కోరగా ప్రధానిగా ఉండగా తాను తిరస్కరించానని, తరువాత అమెరికాను సంతుష్టీకరించేందుకు బజ్వా స్వయంగా ఖండించినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఒక సభలో వెల్లడించారు. అందువలన ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో తెరవెనుక అమెరికా అనుకూల శక్తుల హస్తం లేదని చెప్పలేము. ఏదేమైనా అణిచివేత, నియంతృత్వ పోకడలు ఏ రూపంలో సాగినా అవి ప్రజాస్వామ్యానికి చేటు కలిగించేవే. పాక్‌లో ప్రజాస్వామ్యం తుమ్మితే ఊడిపోయే ముక్కులా వున్న ఈ పరిస్థితుల్లో సైనిక జోక్యానికి ఎంతమాత్రం అవకాశమివ్వరాదు. ప్రత్యర్థులను ఎలాగైనా దెబ్బతీయాలనే సంకుచిత రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టకుండా రాజకీయపక్షాలు వివేచనతో వ్యవహరించాలి.