న్యూఢిల్లీ : భారత్‌లో ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది..నియంత తరహా పాలన బలపడుతోందని 'వి-డెమ్' నివేదిక తెలిపింది. ప్రజాస్వామ్య సూచికల్లో గత 10 ఏళ్లుగా భారత్ స్థాయి వేగంగా పడిపోతోందని హెచ్చరించింది. 'మతస్వేచ్ఛ' పట్టికలో అట్టడుగునకు చేరుకుంది. పౌర హక్కులు, వాక్ స్వాతంత్య్రం, ఎన్నికల ప్రజాస్వామ్యం, బలమైన రాజ్యాంగ సంస్థలు..ఇలా అనేక విషయాల్లో భారత్ గణనీయంగా వెనుక పడింది. ఈ ఏడాది లిబరల్ డెమొక్రసీలో భారత్ కు 97వ స్థానం, ఎలక్టోరల్ డెమొక్రసీలో 108వ స్థానం, సమానత్వంలో 123వ స్థానం... ఊహించిం దేనని 'వి-డెమ్' పేర్కొంది. స్వీడన్‌కు చెందిన 'యూనివర్సిటీ ఆఫ్ గోతెన్‌బర్గ్' పరిశోధకులు ప్రతిఏటా ఈ నివేదికను రూపొందిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా..
2022 నాటికి మొత్తం ప్రపంచ జనాభాలో 72 శాతం మంది (సుమారుగా 570 కోట్ల మంది) నియంతృత్వ దేశాల్లో నివసిస్తున్నారు. కేవలం 13 శాతం ప్రజలు స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశాల్లో జీవిస్తున్నారు. 35 దేశాల్లో వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తోంది. 45 దేశాల్లో మీడియాపై సెన్సార్‌షిప్ పెరిగింది. 37 దేశాల్లో పౌర హక్కులకు తీవ్రస్థాయిలో విఘాతం కలిగింది. కాగా అర్మేనియా, గ్రీస్, మారిషస్..తదితర దేశాల్లో ప్రజాస్వామ్యం వేగంగా బలహీనపడుతోందని వి-డెమ్ పేర్కొంది.
కోవిడ్-19 పేరుతో..
అనేక దేశాల్లో ప్రభుత్వాలు కోవిడ్-19 సంక్షోభాన్ని సాకుగా చూపి పౌరుల స్వేచ్ఛ, హక్కుల్ని బలహీనపర్చేలా చట్టాలు చేశాయి. హంగేరీ అధ్యక్షు లు విక్టోర్ ఓర్బాన్ తన అధికారాన్ని నిలబెట్టుకోవ టానికి దేశంలో పలు మార్లు అత్యవసర పరిస్థితులు ప్రకటించారు. అమెరికాలోని కెంటకీలో బొగ్గు తవ్వ కాలకు వ్యతిరేకంగా సాగిన నిరసనలపై అణచివేత, అబార్షన్లను నిషేధిస్తూ టెక్సాస్‌లో నిర్ణయం... అమెరికా స్థాయిని దిగజార్చిందని వి-డెమ్ తెలిపింది.
భారత్‌లో...
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక, పౌర హక్కులను దెబ్బతీస్తూ కేంద్రం ఏకపక్ష ధోరణితో నిర్ణయాలు చేస్తోంది. కోవిడ్ సమయంలో లాక్‌డౌన్‌తో ఎంతోమంది పేదలు రోడ్డునపడ్డారు. 'ఎన్నికలతో కూడిన నియంతృత్వ' దేశంగా భారత్‌ను 2021లో వి-డెమ్ పేర్కొంది. పౌర సంఘాల అణిచివేత, వాక్ స్వాతంత్రంపై దాడులు, మీడియా, పౌర హక్కుల కార్యకర్తలపై నిఘా పతాక స్థాయికి చేరింది. విద్య, సాంస్కృతిక రంగాల్లో అణచివేత, వివక్ష తీవ్రస్థాయికి చేరాయి. తప్పుడు సమాచారం, మతపరమైన ఏకీకరణ..నియంతృత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి. అందువల్లే ఆఫ్ఘనిస్తాన్, భారత్, బ్రెజిల్, మయన్మార్‌లు 'నియంతృత్వ' దేశాలుగా వేగంగా మార్పు చెందుతున్నాయి.










