Oct 26,2022 07:10

ర్‌ఎస్‌ఎస్‌ ఆదేశాలను అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతున్నారు. మంత్రివర్గ సలహాలు, సూచనల మేరకు విధులు నిర్వహించాల్సిన ఆయన తనను తాను సర్వాధికారిగా భావించు కుంటున్నారు. కేరళ లోని తొమ్మిది యూనివర్శిటీల వైస్‌ ఛాన్సలర్లు తక్షణమే రాజీనామా చేయాలంటూ ట్విట్టర్లో ఆయన జారీ చేసిన హుకుం ఇటువంటిదే. ఈ ఆదేశాలను నిలిపివేసిన హైకోర్టు ఆ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలంటూ సూచన చేసినా గవర్నర్‌ వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదు. పైగా ఆదేశాల పూర్వాపరాలను, వాటి ప్రభావాలను సవివిరంగా అందచేస్తున్న నాలుగు మీడియా సంస్థలను రాజ్‌భవన్‌లోకి అనుమతించకుండా నిషేధం విధించారు. ఈ నిషేధంపై వ్యక్తమైన విమర్శలను సైతం బేఖాతరు చేశారు. తనకు నచ్చినట్లే అందరూ చేయాలని, అలాగాకపోతే వారిపై వేటు తప్పదన్న రీతిలో నియంతలా వ్యవహరిస్తున్నారు. కేరళ విద్యావ్యవస్థ అనేక విజయాలు సాధించిన విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉన్నత విద్యలోనూ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్త్తోంది. శాస్త్రీయతకు పట్టం కడుతూ అత్యున్నత విలువలతో కేరళ యూనివర్శిటీలు దేశంలో తమదైన గుర్తింపును సాధించాయి. మూఢత్వాన్ని, మతతత్వాన్ని ప్రజలపై రుద్దాలని భావించే సంఫ్‌ుపరివార్‌ శక్తులకు ఈ అంశమే ఆటంకంగా మారింది. తాము ఆడమన్నట్టలా ఆడే ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆ సీట్లోకి రావడంతో తన ఎజెండాను అమలు చేయడానికి సిద్ధమైంది. దీనిని ఏ మాత్రం సహించినా ప్రజాస్వామ్యానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది.
          కేరళ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైనప్పటి నుండి ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ అక్కడి ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరిని అవలంబిస్తున్న విషయం తెలిసిందే. మంత్రులపై విశ్వాసాన్ని ఉపసంహరించుకోవడం ద్వారా వారిని పదవుల నుండి తొలగిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో విశ్వాసాన్ని ఉపసంహరించుకున్నా, మంత్రులు పదవుల్లో కొనసాగవచ్చంటూ సర్దుకున్నారు. అంతకుముందే వివిధ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన 11 ఆర్డినెన్స్‌లకు కాలదోషం పట్టించారు. దేశంలో మత ఘర్షణలకు కారణమవుతున్న ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేతను కలవడానికి రాత్రిపూట రాజ్‌భవన్‌ను వదిలి ఒంటరిగా వెళ్ళారు. ఇలా చెప్పుకుంటూ పోతే గవర్నర్‌ హోదాలో ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ చేస్తున్న అకృత్యాలు ఎన్నో! తాజాగా ఒక యూనివర్శిటీకి సంబంధించి సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అడ్డం పెట్టుకుని మిగిలిన విశ్వవిద్యాలయాల వి.సి లను కూడా రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. మరో అంశమేమిటంటే ఛాన్సలర్‌ హోదాలో కేరళ లోని వైస్‌ ఛాన్సలర్ల నియామకాలన్నీ గవర్నర్‌ చేసినవే! ఒకవేళ వాటిలో ఏవైనా తప్పులు జరిగితే, ముందుగా రాజీనామా చేయాల్సింది ఎవరు ?
       నిజానికి రాజ్యాంగ అసెంబ్లీలో గవర్నర్ల పాత్రకు సంబంధించి ఈ తరహా భయాందోళనలు ఎన్నో వ్యక్తమయ్యాయి. సభ్యులు లేవనెత్తిన సందేహాలకు సమాధానంగా గవర్నర్‌ తనంత తానుగా నిర్వహించాల్సిన విధులేమీ లేవని రాజ్యాంగ డ్రాఫ్టింగ్‌ కమిటీ ఛైర్మన్‌ హోదాలో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్పష్టం చేశారు. మంత్రి వర్గ సలహాలు, సూచనల మేరకే గవర్నర్‌ పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. 'మంత్రివర్గానికి సలహాలు ఇవ్వడం. హెచ్చరించడం. ప్రత్యామ్నాయాలపై సూచనలు చేయడం. మరోసారి పరిశీలించమని చెప్పడం' ఇవి మాత్రమే గవర్నర్‌ చేస్తారని అంబేద్కర్‌ పేర్కొన్నారు. ఆ తరువాత సర్కారియా కమిషన్‌తో పాటు సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఇవే అంశాలను చెప్పింది. అయితే, ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ లాంటి వ్యక్తులకు ఈ రాజ్యాంగ నిర్దేశాలు కనపడవు. ప్రజాతంత్ర, అభ్యుదయ, శాస్త్రీయ భావజాలంపై విషం చిమ్మడమే వారి పని. ఇటువంటి వారికి, వారిని అందుకు ఉసిగొల్పుతున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.