Aug 01,2023 16:41

ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ) : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్‌ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేసే కార్మికులకు రిస్క్‌ అలవెన్స్‌,హెల్త్‌ అలవెన్స్‌ ఇవ్వాలని,కాంట్రాక్ట్‌ ఔట్సోర్సింగ్‌ వర్కర్స్‌ని పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌(సిఐటియు)ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ జే సురేంద్రకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి డి క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్‌ రెడ్డి మున్సిపల్‌ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారన్నారు .కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌ కార్మికులను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా పర్మినెంట్‌ చేస్తానని హామీ ఇచ్చారన్నారు.ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఆ హామీని నెరవేర్చలేదన్నారు.కార్మికులు అనేక ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్‌ కార్మికులకు ప్రతి సంవత్సరం ఇవ్వవలసిన యూనిఫారం, సబ్బులు, నూనె, రేన్‌ కోట్లు ఇవ్వటం లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు గిరిబాబు,వారే రాజేష్‌, శేఖర్‌, మోహన్‌రావు, సింహాచలం, సుబ్రహ్మణ్యం, సత్తిబాబు, అర్జయ్య, దుర్గ, శకుంతల, సిఐటియు నాయకులు సిరపరపు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.