
ఆడవాళ్ళకు స్వాతంత్య్రం
ఒక పచ్చి అబద్ధం..
అమ్మ కడుపులోనే
ఆడపిల్లననే వివక్షత..
ఆదిలోనే అంతంచేస్తున్న కాఠిన్యత..
అమ్మ ఒడి నుండి
గుడిలాంటి ఆ బడికి పోతే
అక్కడా ఒక కీచక పర్వం.
విద్యా బుద్ధులు నేర్పవలసిన
గురువులే కామాంధులై
కాటు వేస్తూ..!
మరో మగాడు
మృగాడుగా మారిపోయి
మానవత్వాన్ని ఎక్కడో విసిరేసి
పసితనాన్ని కసిగా నలిపేస్తున్నాడు!!
ప్రేమంటూ ఒకడు
వెకిలి చేష్టలతో వెఱ్ఱి వేషాలు వేస్తూ
మా ధైర్యాన్ని నేలరాల్చే ప్రయత్నాలు ఎన్నో చేస్తాడు, ప్రేమంటూ.. పెళ్లంటూ నమ్మించి ఆకలి తీరాక
మమ్మల్ని ఖననం చేసేస్తాడు.
ఎన్నో చట్టాలు..
మగవాడి చుట్టాలు..
మమ్మల్ని ఇంకా మభ్యపెట్టకండి
ఆడవాళ్ళ ఆక్రందనకు
ఆరంభం తప్ప అంతం లేని
ఈ వ్యవస్థలో మాకు మేమే
ఆయుధాలమౌతాం..
అందమైన గులాబీ కూడా
తన చుట్టూ ముళ్ళను ఏర్పరచుకున్నట్టు
ప్రకృతి పాఠంగా
మేము ప్రతిఘటనా
శక్తులమౌతాం..
ఈ మద మగ మృగాలకు
మరణ మృదంగమౌతాం..
ధైర్య కవచం ధరించి
పిడికిలి బిగించి
పోరాటమే ఊపిరిగా
కదులుతాం..!!
భవితకు బాటలు వేస్తాం..!!
- పద్మజ రామకృష్ణ పి
94918 30278