Nov 18,2022 07:14

వైదిక ధర్మ ప్రచారకుల వేదాల అబద్ధపు కట్టడాల్ని కూల్చివేస్తూ... వారు భూస్థాపితం చేసిన భారతీయ భౌతిక వాదాన్ని అదే భూమి పొరల్లోంచి తవ్వితీశాడు. ఒకప్పుడు దేశంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న లోకాయత-చార్వాక తాత్వికతను దేశ ప్రజలకు విడమర్చి చెప్పాడు. వైదిక పురాణాలు ప్రచారం చేసిన భ్రమల్ని బద్దలు కొట్టాడు. అన్నింటికీ 'కారణం'-హేతువు ప్రధానమని, అది వైజ్ఞానిక అవగాహన మీద ఆధారపడి ఉండాలని చెప్పిన మహనీయుడాయన! తత్వశాస్త్రాన్నీ, వైజ్ఞానికతనూ కట్టగట్టి కొత్త ఆలోచనలకు దారులు వేసిన పరిశోధకుడాయన !

కప్పుడు ప్రపంచానికి భౌతిక వాదాన్ని పరిచయం చేసిందే మన దేశం. ఇక్కడి చార్వాక-లోకాయత ఆలోచనా విధానాన్ని మనువాదులు అన్యాయంగా అణగదొక్కారు. భూస్థాపితం చేశారు. తమ కట్టుకథల్ని ప్రచారం చేసుకుని అదే మన సంస్కృతి, అదే మన సంప్రదాయం అని బుకాయించారు. అయినా భౌతిక వాదం ఎక్కడికీ పోలేదు. ఈ నేలలోనే ఉంది. ఈ గాలిలోనే ఉంది. లోకాయత అంటే లోకేశు ఆయుతం: అని అర్థం. అంటే లోకంలో వ్యాప్తి చెందిన ప్రజల దృక్పథం - అని అర్థం! వీరు లోకాన్నే విశ్వసిస్తారు. ఎక్కడా లేని ఇతర లోకాలను నమ్మరు. లోకంలోని లోకులను మాత్రమే విశ్వసిస్తారు. లోకాయత ప్రజల తత్వ శాస్త్రం. ఆధునిక వైజ్ఞానిక పరిశోధనలు జరగక ముందే (బిసిఈ) లోకాయతులు ప్రపంచమే వాస్తవం అన్నారు. నాలుగైదు మూలకాల సంయోగం వల్లనే ఈ ప్రపంచం ఏర్పడిందన్నారు. నీరు, నిప్పు, గాలి, భూమి -నాలుగు మూలకాలయితే, అయిదోది ఆకాశం అన్నారు. చైతన్యం అనేది పంచ భూతాల నుండి వస్తుందన్నారు. 'భూతే బాహ్య చైతన్యం!' మనుషులందరి శరీరాలు ఒకటే - ముక్కు, ముఖం, చేతులు, కాళ్ళు అందరికీ ఒకేలా ఉన్నప్పుడు, జీవన క్రియలు ఒకేలా జరుగుతున్నప్పుడు ఈ వర్ణ వ్యవస్థ ఎందుకూ? ఈ కులాల తారతమ్యాలు ఎందుకూ? అసలు అవి ఉండాల్సిన అవసరం ఏమిటీ? అని లోకాయతులు సాధారణ శకానికి ముందే ప్రశ్నించారు. వీరే అతి ప్రాచీన భారతీయ భౌతికవాదులు. ఈ ప్రపంచాన్ని ఏ శక్తీ నడిపించడం లేదని, ఆత్మ, పునర్జన్మ మోక్షం వంటివి ఉండవని చాటి చెప్పారు.
          దేవీప్రసాద్‌ చటోపాధ్యాయ అనే మార్క్సిస్టు మేధావి, తత్వవేత్త 1918 నవంబర్‌ 19-1993 మే 8 మధ్య కాలంలో ముందుకొచ్చాడు. వైదిక ధర్మ ప్రచారకుల వేదాల అబద్ధపు కట్టడాల్ని కూల్చివేస్తూ...వారు భూస్థాపితం చేసిన భారతీయ భౌతిక వాదాన్ని అదే భూమి పొరల్లోంచి తవ్వితీశాడు. ఒకప్పుడు దేశంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న లోకాయత - చార్వాక తాత్వికతను దేశ ప్రజలకు విడమర్చి చెప్పాడు. వైదిక పురాణాలు ప్రచారం చేసిన భ్రమల్ని బద్దలు కొట్టాడు. అన్నింటికీ 'కారణం'-హేతువు ప్రధానమని, అది వైజ్ఞానిక అవగాహన మీద ఆధారపడి ఉండాలని చెప్పిన మహనీయుడాయన! తత్వశాస్త్రాన్నీ, వైజ్ఞానికతనూ కట్టగట్టి కొత్త ఆలోచనలకు దారులు వేసిన పరిశోధకుడాయన! చరిత్రకు, సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సైన్సు వెన్నెముక కావడం మనం చూశాం. కానీ, దేవీప్రసాద్‌ చటోపాధ్యాయ కొత్తగా ఫిలాసఫీకీ సైన్సుకూ ఉన్న సంబంధాన్ని హేతు బద్ధంగా చెప్పి - నిరూపించాడు !
        ప్రాచీన భారతీయ భౌతిక వాదాన్ని అధ్యయనం చేసి, ఆయన ప్రకటించిన 'లోకాయత' మాత్రమే కాదు, వైజ్ఞానిక శాస్త్రాల చరిత్రను, ప్రాచీన భారత దేశంలో వైజ్ఞానిక పద్ధతుల్ని ఆయన గ్రంథాలుగా తీసుకొచ్చాడు. ఇవే కాకుండా ప్రాచీన భారతదేశంలో విజ్ఞాన శాస్త్రం-సమాజం వంటి గ్రంథాలు బహుళ ప్రజాదరణ పొందాయి.
         ఆయన గ్రంథం లోకాయత (ఎ స్టడీ ఇన్‌ ఏన్షియంట్‌ ఇండియన్‌ మెటీరియలిజమ్‌-1959) దేశంలోనే కాదు, విదేశాల్లోనూ సంచలనం సృష్టించింది. భారతీయ మార్క్సిస్టు తాత్వికత గూర్చి ప్రపంచానికి ఒక కొత్త అవగాహనను కలిగించింది. దేవీప్రసాద్‌ చటోపాధ్యాయ రచనలు ''సైన్స్‌ అండ్‌ సొసైటీ ఇన్‌ ఏన్షియంట్‌ ఇండియా''- సంపుటాలు; ''వాట్‌ ఈజ్‌ లివింగ్‌ అండ్‌ వాట్‌ ఈజ్‌ డెడ్‌ ఇన్‌ ఇండియన్‌ ఫిలాసఫీ'', ''ట్రూ ట్రెండ్‌ ఇన్‌ ఇండియన్‌ ఫిలాసఫీ'', ''రెలిజియన్‌ అండ్‌ సొసైటీ'' వంటి గ్రంథాలను తిరగేస్తే ఒకప్పుడు ప్రపంచానికి భౌతికవాదం బోధించిన భారతదేశం ఈ రోజు ఎందుకు ఇలా కుప్పగూలిపోయిందో అర్థమవుతుంది. అంతేకాదు, దాన్ని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం మీద ఎంత ఉందో అంచనా వేసుకోవడానికీ వీలవుతుంది. కార్యాచరణకు ప్రేరణ లభిస్తుంది.
          లోకాయత వాదాన్ని బృహస్పతి ఆవిష్కరించాడని అంటారు. లోకంలో విస్తృతంగా ప్రచారం పొందినది కనక లోకాయుతం అయింది. ఈ వాదాన్ని చార్వాకం అని కూడా అంటారు. మాధవాచార్య ఆ పదానికి అర్థం చెప్పాడు. చారూ అంటే తియ్యని అని, వాక్‌ అంటే మాట అని చెప్పాడు. యదార్థాల్ని సున్నితంగా చెప్పడం- అని కూడా మనం అనుకోవచ్చు. 1. యావత్‌ జీవేతూ సుఖ్‌జీవేతూ (జీవితాంతం సుఖంగా జీవించు) 2. రుణమూ కృత్వా ఘృత పీవేతూ (అప్పు చేసైనా నెయ్యి తాగు) 3. భస్మీ భూతస్య దేహస్య (కాలిపోయి బూడిద అయ్యే ఈ దేహం) 4. పునరాగమన కృత: (మళ్ళీ తిరిగి వస్తుందని ఎలా అనుకుంటావూ?) నెయ్యి తాగు - అంటే ఇక్కడ నెయ్యనే కాదు. పాలు, పెరుగు, శరీరానికి అవసరమైన పౌష్టికాహారం అని అర్థం. చనిపోయాక ఈ దేహం కాలిస్తే బూడిద అవుతుంది. పూడిస్తే మట్టి అవుతుంది. అంతేగాని ఇక పునరాగమనం ఎక్కడా? శరీరం ఎలా తిరిగి వస్తుంది అని ప్రశ్నించారు. అంటే పునర్జన్మ అబద్ధమనీ, అది ఉండదనీ చెప్పారు. మోక్షానికి కూడా ఆధారం లేదన్నారు.
         శరీరమే ముఖ్యం. వైదికులు చెప్పే ఆత్మ ఉండాలన్నా కూడా శరీరం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి కదా? అప్పు చేసైనా సుఖంగా ఉండు - అన్నది ఎందుకంటే అప్పు తీసుకున్న వాడు, అప్పు ఇచ్చినవాడూ ఇద్దరూ ఏదో ఒక నాటికి నశించాల్సిన వాళ్ళే. కానీ జీవిని, ప్రాణాన్ని కష్టపెట్టకుండా కాపాడుకొమ్మని చార్వాకులు చెప్పారు. మిధ్యావాదాన్ని నమ్మగూడదని- అన్నారు. సంశయ వాదం, సందేహ వాదాన్ని ప్రమాణంగా తీసుకోలేదు. కర్మఫలం ఉండదు. స్నేహితులతో, బంధువులతో బతికినంత కాలం సంతోషంగా గడపడమే జీవితం! వారినందరినీ పక్కకు నెట్టి, ఎక్కడా లేని పరలోక సుఖాల కోసం పూజలు, యజ్ఞాలు చేయడం మూర్ఖుల లక్షణం-అన్నారు. తర్కాన్ని - అనుభవాన్ని - మాత్రమే నమ్ముకోవాలి. అంతేగాని, ఆత్మను, పునర్జన్మను, స్వర్గనరకాలను, కర్మకాండను నమ్ముకోగూడదన్నది వారి సిద్ధాంతం! వైదిక ధర్మంలో యజ్ఞయాగాలకు, జంతు బలులకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ యజ్ఞాలు బ్రాహ్మణాధిపత్యాన్ని సుస్థిరం చేసే కర్మకాండలు. కుల వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించిన లోకాయతులు యజ్ఞాలను, జంతుబలుల్ని తీవ్రంగా అడ్డుకున్నారు. బలి ఇచ్చిన పశువులు స్వర్గానికి వెళ్ళేట్లయితే, ఈ వైదిక పండితులు వృద్ధాప్యంతో సతమతమయ్యే తమ తండ్రిని బలిచ్చి నేరుగా స్వర్గం పంపవచ్చు కదా? అని సవాలు విసిరారు. లోకాయతుల అర్థవంతమైన ప్రశ్నలకు జవాబు చెప్పలేక వైదిక ధర్మ బోధకులు వక్ర భాష్యాలు చెప్పి, భౌతిక దాడులకు పూనుకుని కుట్ర పూరితంగా వారి గ్రంథాల్ని సైతం నాశనం చేశారు. కాల్చేశారు. అందుకే చార్వాక-లోకాయతలపై ప్రాచీన గ్రంథాలు మనకు దక్కలేదు.
        దేవీప్రసాద్‌ చటోపాధ్యాయ లాంటి పరిశోధకుల కృషితో కొంతలో కొంత సమాచారం బయటికొచ్చింది. చార్వాక - జ్ఞాన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ప్రత్యక్ష ప్రమాణాలుంటేనే దేనినైనా స్వీకరించాలని ఈ సిద్ధాంతం చెప్పింది. ప్రత్యక్ష అనుభవం అనేది రుచి, వాసన, స్పర్శ, దృష్టి, శబ్దం వల్ల గ్రహించొచ్చు. జ్ఞానేంద్రియాలకు అందని భ్రమలు-కల్పితాలు! అప్రత్యక్ష విశ్వాసాల్ని భౌతికవాదం పరిగణన లోకి తీసుకోదు. గాలి, నీరు, అగ్ని, భూమితోనే ప్రతి పదార్థం రూపొందుతుంది గనక, ''పదార్థమే'' జీవనానికి ప్రధానం అన్నారు. 'మేటర్‌'ని గుర్తిస్తుంది గనక, ఈ సిద్ధాంతం ''మెటీరియలిజం'' అయ్యింది. జీవించి ఉన్న ప్రాణిలోని స్పృహ (కాన్షస్‌నెస్‌)ను వైదిక ధర్మం ''ఆత్మ'' అని భావించింది తప్పితే - ఆత్మ అనేది లేదన్నది చార్వాకులు గట్టిగా చెప్పారు.
           ఒక రకంగా చార్వాక-లోకాయత అనేది భారతీయ తాత్విక దృక్పథంలో ప్రధానమైంది. ప్రపంచానికే తొలిసారి భౌతికవాదం గురించి చెప్పిన దేశం మన భారతదేశం. ఆ విషయం భారతీయులందరూ సగర్వంగా చెప్పుకోవాల్సింది పోయి, మనువాదుల చేతుల్లో కీలుబొమ్మలై, కల్పనల్లో ఊహించుకున్న దేవీ దేవతల మూర్తులకు పూజలు చేస్తూ దిగజారిపోయారు. ఆధిపత్య వర్గాలు ప్రజలను అబద్ధాల వెంట పరుగులు పెట్టించడానికి పుక్కిటి పురాణాలను, మూఢవిశ్వాసాలను ప్రోత్సహించాయి. అలా శతాబ్దాలు గడిచిపోయాయి. మధ్య మధ్యలో దేవీప్రసాద్‌ చటోపాధ్యాయ లాంటి వివేకవంతులు ఆధునిక కాలంలో కూడా భౌతికవాద ప్రాశస్త్యాన్ని ఎలుగెత్తి చెప్తూనే ఉన్నారు. 'దేబీదా'గా ప్రేమగా పిలవబడ్డ దేవీ ప్రసాద్‌ చటోపాధ్యాయ చదువుకునే రోజుల్లో డిగ్రీలోనూ, పి.జి లోనూ గోల్డ్‌ మెడల్స్‌ సంపాదించారు. తత్వశాస్త్ర విద్యార్థిగా, అధ్యాపకుడిగా ఒక కొత్త ఒరవడి సృష్టించినందుకు చివరి దశలో ఆయనను ఒక సైన్స్‌ సంస్థ 'గెస్ట్‌ సైంటిస్ట్‌'గా సగౌరవంగా నియమించుకుంది. న్యూఢిల్లీ లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌లో కొంతకాలం ఉన్నారు. ఇది చాలా చాలా అరుదైన విషయం! భారత ప్రభుత్వం ఆయన కృషిని గుర్తించి, ఆయన మరణించిన తర్వాత ఐదేళ్లకు 1998లో పద్మభూషణ్‌ ప్రకటించింది. ఆయన కృషి వృధా పోలేదు.
        ప్రస్తుతం పచ్చి మితవాద, మతవాద శక్తులు తమ భావజాలాన్ని ప్రజల మీద రుద్దుతున్న నేపథ్యంలో దేవీప్రసాద్‌ రచనలు అభ్యుదయ కాముకులకు, లౌకిక వాదులకు బలమైన ఆయుధాలుగా తోడ్పడతాయి. రాగల కాలాలలో యువత బుద్ధుడు చెప్పిన ''అత్‌ దీపోభవ' (నీవే దీపానివి అయిపో) అన్న మాటని గుండెల్లో నింపుకుని, వైజ్ఞానిక భౌతిక-మానవ వాదానికి దారులు వేస్తారు. తప్పదు!!

/ వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త/

డా|| దేవరాజు మహారాజు