Jan 19,2023 17:38
  • భారీగా మొహరించిన పోలీసులు
  • టీడీపీ కార్యాలయం కూల్చివేత

ప్రజాశక్తి - విజయవాడ రూరల్‌ : గొల్లపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును పోలీసులు గురువారం హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఇక్కడి టిడిపి కార్యాలయానికి సంబంధించిన లీజుపై వివాదం జరుగుతోంది. లీజుదారుడు ఆలూరి చిన్నా, ఆయన కుటుంబ సభ్యుల మధ్య గొడవ తలెత్తడంతో హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది. స్థల వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆలూరి చిన్నా కుటుంబ సభ్యులకు డిసెంబరు 28న తహశీల్దార్‌ నోటీసులిచ్చారు. కాగా పార్టీ కార్యాలయాన్ని అధికారులు, పోలీసులు తొలగించారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. గురువారం తెల్లవారుజామునుంచే అధికారులు, పోలీసులు స్థానిక టీడీపీ కార్యాలయాన్ని తొలగించారు. పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు, ఫర్నిచర్‌, కంప్యూటర్లను తరలించారు. రోడ్డుకు ఆనుకొని కూర్చునే పసుపురంగు బల్లలు సైతం తొలగించారు. టీడీపీ కార్యాలయం వైపు ఎవరూ రాకుండా ముందస్తుగా నియంత్రణ చర్యలు చేపట్టారు. బారికేడ్లు పెట్టి ఎవరినీ అనుమతించడంలేదు. ఈ విషయం టిడిపి నాయకులు, కార్యకర్తలకు అక్కడకు చేరుకొని నిరసన తెలియజేశారు.
అధికార దుర్వినియోగం : దేవినేని ఉమా
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కళ్లల్లో ఆనందం చూడటానికే పోలీసులు టీడీపీ కార్యాలయాన్ని కూల్చడం వంటి పనులు చేస్తున్నారని ఉమ విమర్శించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని మండిపడ్డారు. పార్టీ ఆవిర్భావం నుంచి అదే స్థలంలో కార్యాలయం ఉందని, రాజకీయ కుట్రలో భాగంగానే టిడిపి కార్యలయాన్ని కూల్చారని దేవినేని ఉమా ఆరోపించారు.