
మానవ అభివృద్ధి సూచిక-2022లో భారత్ 132వ స్థానంలో నిలవడం మనల్ని ప్రశ్నార్థకం చేసింది. పైకి అందరూ బాగానే కనిపిస్తున్నా, ప్రతీ కుటుంబంలో కనీసం ఒక్కరైనా మందులు పెట్టె మీద ఆధారపడి జీవిస్తున్నట్లు తెలుస్తోంది. రక్తహీనత, థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఇవే కాకుండా, సీజనల్, దీర్ఘకాలిక అనారోగ్యాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో, సంపాదనలో 2/3 వంతు వైద్య ఖర్చులు నిమిత్తం ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుత జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యులు, నర్సులు మౌలిక సదుపాయాలు లేవు. దీంతో ఏ చిన్న అనారోగ్యం వచ్చినా, ప్రైవేటు ఆసుపత్రుల బాట పడుతున్నారు. సుబ్రహ్మణ్యం నివేదిక ప్రకారం వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో కంటే దాదాపు 12 నుంచి 24 రెట్లు డబ్బు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దీంతో పేద, సామాన్య మధ్య తరగతి ప్రజలు జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. నిరుద్యోగం పెరుగుతున్నది. నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లు, అనారోగ్య సమస్యలతో తల్లడిల్లుతున్నారు. ఇవన్నీ మానవ అభివృద్ధి సూచికలో భారత్‌ను వెనుకకు నెట్టివేస్తుంది.
వైద్య ఖర్చులు ఒక ఎత్తు అయితే, రవాణా, మందులు, నివాసం (లాడ్జ్) ఖర్చులు, ఇతర దైనందిన ఖర్చులు కలిపి తట్టెడు అవుతున్నాయి. రోజువారీ ఉపాధి కోల్పోవాల్సి వస్తున్నది. ముఖ్యంగా తమిళనాడు వలే అన్ని రాష్ట్రాల్లో ''జనరిక్ మందులు''కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కింది గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రతీ కుటుంబాన్ని, వ్యక్తినీ ఆరోగ్య కేంద్రంతో అనుసంధానం చేయాలి. ప్రతీ వ్యక్తీ ఆరోగ్య డేటా అందుబాటులో ఉంచాలి. అన్ని చోట్లా విలేజ్ క్లినిక్కులు, అర్బన్ క్లినిక్కులు ఏర్పాటు చేయాలి. ఆయుష్మాన్ భవ, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు పగడ్బందీగా ఉండాలి. విద్య, వైద్యం వంటి రంగాల్లో ఢిల్లీ, కేరళ రాష్ట్రాల నమూనాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి. ఆశా, అంగన్వాడీ, ఏ.యన్.యమ్ కార్యకర్తలకు తరచూ ఆరోగ్య శిక్షణ ఇవ్వాలి. వైద్య కళాశాలలు, వైద్య సీట్ల సంఖ్య పెంచాలి.
ఇకనైనా ప్రభుత్వాలు వైద్య రంగంపై దృష్టి సారించాలి. నిధులు కేటాయించడం మీద శ్రద్ధ పెట్టాలి. రక్షణ కోసం పోలీసులను యుద్ధ ప్రాతిపదికన ఎలా నియమిస్తున్నారో, అదే విధంగా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి వైద్యులు, ఆసుపత్రులు అందుబాటులో ఉంచాలి. ప్రజలను వైద్య ఖర్చుల నుంచి బయటపడేలా చేయాలి. అప్పుడు మాత్రమే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వెసులుబాటు లభిస్తుంది. తద్వారా విద్యలోనూ, ఉపాధి లోనూ ముందు వరుసలో ఉండటం సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారానే ప్రజలకు అన్ని రకాల అవసరాలు, సౌకర్యాలు సమకూర్చలేవు. పరిశ్రమలు, పర్యాటకం, లాజిస్టిక్స్, సేవారంగం వంటి సంస్థలు భారీ ఎత్తున ఏర్పాటు చేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి బడ్జెట్ కేటాయింపులు పెంచి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి.
- ఐ. ప్రసాదరావు,
సెల్ : 6305682733