Nov 02,2023 07:15

           ప్రతిపక్ష నేతలతో పాటు, పలువురు పాత్రికేయులపై నిఘా పెట్టడం ద్వారా నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య, పౌరహక్కుల విధ్వంసానికి పాల్పడింది. రాజ్యాంగ విలువలను నిలువునా పాతరేసింది. ప్రపంచ ప్రఖ్యాత మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ యాపిల్‌ జారీ చేసిన అలెర్ట్‌ మెసేజ్‌లతో ఈ వ్యవహారం బట్టబయలైంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ది వైర్‌ వ్యవస్థాపక ఎడిటర్‌ సిద్ధార్థ వరదరాజన్‌తో పాటు పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు, పాత్రికేయుల ఫోన్లు 'స్టేట్‌ స్పాన్సర్డ్‌ అటాకర్స్‌' నిఘా జాబితాలో ఉన్నట్లు యాపిల్‌ మెసేజ్‌ల ద్వారా తేలడంతో దేశ వ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకుని ఉండాలి. నిష్పక్షపాత విచారణ ద్వారా వాస్తవాలను వెలికి తీసి, తన నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధపడాలి. కానీ జరిగింది వేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెదవి విప్పలేదు. స్పందించిన కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ కూడా అలెర్ట్‌ మెసేజ్‌లు పంపిన యాపిల్‌ సంస్థపై ఎదురుదాడికి దిగారు. దబాయింపులతో ప్రభుత్వ అనైతిక చర్యలను కప్పి పుచ్చుకోవాలని చూస్తున్నారు. తమ కనుసన్నలలో నడిచే కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం (సిఇఆర్‌టి) ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పడం కంటితుడుపు చర్యే! సాంకేతిక పొరపాట్ల వల్ల అప్పుడప్పుడు ఇటువంటి మెసేజ్‌లు వస్తుంటాయన్న మరో వాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. అదే నిజమైతే ప్రతిపక్ష నాయకుల ఫోన్లకే ఆ మెసేజ్‌ ఎందుకు వచ్చింది? బిజెపి, దాని మిత్రపక్షాల నాయకులకు ఎందుకు రాలేదు?
నరేంద్రమోడీ ప్రభుత్వం తన ప్రత్యర్థులపై ఈ తరహా చర్యలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అనేక టెక్‌ కంపెనీలు ఈ తరహా సర్కారు కుట్రలను బట్టబయలు చేశాయి. రెండు సంవత్సరాల క్రితం దేశ వ్యాప్తంగా కలకలం రేపిన ఇజ్రాయిల్‌కు స్పైవేర్‌ పెగాసెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీడియా పరిశోధన చేసి స్పైవేర్‌ వినియోగం గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు ప్రచురించినప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. చివరకు అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని నియమించిన నిపుణుల కమిటీకి సహకరించేందుకు మొండిగా తిరస్కరించింది. ఎన్‌.రామ్‌ వంటి ప్రముఖ పాత్రికేయులు తమ ఫోన్ల హ్యాకింగ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తే, ఆ ఆరోపణ తప్పు అని చెప్పలేదంటేనే కేంద్రం తప్పు చేసిందని అర్ధమైపోయింది. ఇప్పుడు అదే తప్పును పునరావృతం చేసింది. యాపిల్‌ తాజాగా పంపిన మెసేజ్‌ల వంటివాటిని 2019లోనే యాహు సంస్థ కొందరికి పంపింది. 'గవర్నమెంట్‌ బ్యాక్డ్‌ యాక్టర్స్‌ మీ ఖాతాను లక్ష్యంగా చేసుకున్నారు. దీనివల్ల మీ సమాచారం వారికి చేరుతుంది' అని యాహు అప్పట్లో పేర్కొంది. అదే సంవత్సరం గూగుల్‌ కూడా 500 మంది దాకా తమ ఖాతాదారులు ప్రభుత్వ బ్యాక్డ్‌ హ్యాకర్ల బారిన పడ్డారన్న అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ అన్ని సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వం నుండి మౌనమే సమాధానంగా వచ్చింది.
           బీమా కోరెగావ్‌ కేసులో నిందితులుగా ఉన్న కొందరి కంప్యూటర్లలోకి రిమోట్‌ పద్ధతిలో చొరబడి తప్పుడు సమాచారాన్ని ఉంచడం ద్వారా వారిపై దోషుల ముద్ర వేశారన్న విషయం తెలిసిందే. ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. చేయని నేరానికి వారు ఇంకా జైళ్లలోనే మగ్గుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రతిపక్ష నేతలు, పాత్రికేయుల ఫోన్లను హ్యాక్‌ చేయడం ద్వారా అటువంటి కుట్రకే కేంద్రం తెరలేపిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు వీటిని తోసివేయలేం. ఈ తరహా కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టక పోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృత్తం కాకుండా చూడాలంటే దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి.