
స్వాతంత్య్ర సమయంలో సంస్థానాలపై ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ వైఖరి వెల్లడవుతోంది. హిందూ రాజులు, పాలకులకు వారు గట్టి మద్దతుదారులుగా వున్నారు. నిరంకుశత్వానికి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే సంస్థానాల్లో ప్రజా ఉద్యమాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. స్వతంత్ర భారతదేశ ప్రయోజనాల కన్నా ఫ్యూడల్ పాలకుల ప్రయోజనాలకే వారు ప్రాధాన్యమిచ్చారు. వాస్తవానికి, ట్రావెన్కోర్ మహారాజు స్వాతంత్య్ర ప్రకటనకు వి.డి.సావర్కర్ మద్దతు తెలుపుతూ టెలిగ్రాం పంపారు.
చారిత్రక ప్రాధాన్యత కలిగిన తేదీలను... నియంతృత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం కాశ్మీరీ ప్రజలు సాగించిన పోరాట చిహ్నాలను...రద్దు చేయడమంటే కాశ్మీరు లోయ లోని ప్రజల ఓటు హక్కును రద్దు చేయడమే. వారిని రాజకీయంగా పక్కకు నెట్టే మొత్తం ప్రణాళికలో భాగమే. అసెంబ్లీ సీట్ల పునర్విభజన జరిగిన తీరు, నివాస ప్రతిపత్తిలో జరిగిన మార్పులు...వీటన్నింటిలో
ఈ కోణాలను మనం చూడవచ్చు.
కాశ్మీరీ ప్రజల చారిత్రక వారసత్వాన్ని, గుర్తింపును తుడిచిపెట్టేందుకు జమ్మూకాశ్మీర్ పాలనా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మరోపక్క జమ్మూకి, కాశ్మీరు లోయకి మధ్య మతపరమైన విభజన మరింత పెరిగిలా చర్యలు చేపడుతోంది. కాశ్మీర్లో ఆనాటి ఫ్యూడల్ రాజరికానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తుండగా, 1931లో మహారాజా పోలీసులు జరిపిన కాల్పుల్లో 22 మంది మరణించారు.
వారి స్మృత్యర్ధం జులై 13ను కాశ్మీర్లో అమరవీరుల దినంగా పాటించడం సాంప్రదాయంగా వుంది. కానీ ఇప్పటికి వరుసగా రెండేళ్ళ నుండి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.
2020లో, కేంద్రపాలిత ప్రభుత్వం అమరవీరుల దినోత్సవానికి ఇచ్చే ప్రభుత్వ గౌరవాన్ని ఉపసంహరించింది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ అధినేత అమరవీరుల సమాధులపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పిస్తారు. పైగా అప్పటివరకు ఆ రోజు ప్రభుత్వ సెలవు దినంగా వుండేది. ఇకపై ప్రభుత్వ సెలవు దినం కాదు. అమరవీరుల సమాధులున్న ప్రాంతానికి గేట్లకు తాళాలు వేసి, బారికేడ్లు పెట్టారు. కాశ్మీరీ ప్రజల గుండె చప్పుడును వినిపించే ఈ చారిత్రక తేదీని నిరాకరించడం కాశ్మీరు లోయలోని ప్రజలను నిర్వీర్యం చేస్తున్న మరో ప్రయత్నంగా వుంది.
ఆ తర్వాత కాశ్మీర్ మాజీ మహారాజు హరి సింగ్ పుట్టిన రోజు సెప్టెంబరు 23ను ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జమ్మూ లోని వివిధ సంఘాల నుండి వచ్చిన అభ్యర్ధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్రిటీష్ ఆశ్రిత పక్షపాతంతో నడిచే ఈ రాచరిక సంస్థానాల వ్యవస్థలో ఈ మహారాజు నిరంకుశ భూస్వామ్య పాలనకు ప్రతీకగా నిలిచారు. ఫ్యూడల్ పాలనకు, బ్రిటీష్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ అబ్దుల్లా నాయకత్వం వహించారు. అలా సాగిన ప్రజా ఉద్యమ సమయంలోనే 1931లో కాల్పులు జరిగి 22 మంది అమరవీరులయ్యారు.
అటువంటి నిరంకుశ రాజు పుట్టిన రోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ, షేక్ అబ్దుల్లా పుట్టిన రోజును పాటించడాన్ని మాత్రం 2019 డిసెంబరు నుండి నిలిపివేశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహారాజు పాత్ర సందేహాస్పదమైన రీతిలో వుంది. మౌంట్‌బాటన్ ఒప్పందం ప్రకారం, సంస్థానాలు భారత్, పాకిస్తాన్ ఈ రెండు స్వతంత్ర దేశాల్లో ఎందులో చేరాలో ఎంపిక చేసుకోవచ్చు. కానీ, రాచరికాన్ని అంతమొందించడానికి, ప్రజాస్వామ్య పాలన కోసం నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వాన సాగించిన ప్రజా ఉద్యమానికి వ్యతిరేకంగా మహారాజు తీవ్రమైన అణచివేత చర్యలు చేపట్టాడు. అటువంటి మహారాజు, కొత్తగా ఏర్పడిన ఈ రెండు దేశాల్లో దేంట్లోనూ చేరకుండా జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర దేశంగా వుండాలని కోరుకున్నాడు. 1947 అక్టోబరు 26న మౌంట్‌బాటన్‌కు మహారాజు రాసిన లేఖ ద్వారా అంగీకరించబడిన వాస్తవం ఇది. కానీ, కాశ్మీర్‌ను కలిపేసుకోవడానికి సాయుధ గిరిజన దురాక్రమణదారులను పాకిస్తాన్ పంపిన తర్వాత భారత్‌లో విలీన పత్రాన్ని జత చేస్తూ మహారాజు లేఖ రాశాడు. నేషనల్ కాన్ఫరెన్స్ నేతృత్వంలో ప్రజలు సాగించిన ప్రతిఘటనతో మహారాజు శ్రీనగర్ నుండి జమ్మూకు పారిపోవడం ఆక్రమణ బలగాలను పారదోలడానికి భారత సైన్యానికి సాయపడింది.
స్వాతంత్య్రం కోసం మహారాజు ఆలోచన చేస్తున్నపుడు ఆర్ఎస్ఎస్ అందుకు పూర్తిగా మద్దతిచ్చింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిర్వహించే ప్రజా పరిషద్ కూడా దానికి మద్దతిచ్చింది. స్వాతంత్య్రం కోసం ఆయన తీసుకున్న వైఖరిని వారు సమర్ధించారు. విలీనం తర్వాత, కాశ్మీర్ నుండి జమ్మూ విడిపోవడాన్ని సమర్ధించారు. ఇటువంటి మహారాజును, బ్రిటీష్ వారి పూర్వపు మిత్రుడిని ఇలా ప్రభుత్వ సెలవు దినంతో గౌరవిస్తున్నారు. అదే సమయంలో రాచరికానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి గుర్తింపు లేకుండా చేస్తున్నారు. మెజారిటీ ముస్లింలను పాలించిన ఆ మహారాజు హిందువు కావడమన్నదే మహారాజును గౌరవించడంలోని అసలైన వాస్తవమనేది చాలా దారుణమైన అంశం. బ్రిటీష్ వారి వైపు వున్న, జమ్మూకాశ్మీర్ స్వతంత్ర దేశంగా వుండాలనుకున్న హరిసింగ్ పట్ల బిజెపి పాలకుల వైఖరి...హైదరాబాద్ నిజాం పాలకుల పట్ల వైఖరికి పూర్తి భిన్నంగా వుంటుంది. నిజాంను పదవీచ్యుతుడిని చేసిన సైనిక చర్యను ప్రశంసిస్తూ, తెలంగాణలో సెప్టెంబరు 17వ తేదీని విమోచన దినంగా బిజెపి పాటిస్తోంది. నిజాం కూడా భారత్‌లో విలీనం కావడానికి తిరస్కరించాడు. స్వతంత్ర సంస్థానంగానే వుండాలని భావించాడు. కానీ ఈ రెండు సంఘటనల పట్ల బిజెపి వైఖరిలో తేడాకు ప్రధాన కారణం పాలకుల మతం కావడం ఇక్కడ గుర్తించాల్సిన అంశం. మొదటి ఘటనలో పాలకుడు హిందువు కాగా, రెండో సంఘటనలో పాలకుడు ముస్లింగా వున్నారు. ఇరువురూ తమ ప్రయోజనాల కోసం బ్రిటీష్ పాలకుల తైనాతీలు కావడం గమనార్హం.
స్వాతంత్య్ర సమయంలో సంస్థానాలపై ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభ వైఖరి వెల్లడవుతోంది. హిందూ రాజులు, పాలకులకు వారు గట్టి మద్దతుదారులుగా వున్నారు. నిరంకుశత్వానికి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే సంస్థానాల్లో ప్రజా ఉద్యమాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. స్వతంత్ర భారతదేశ ప్రయోజనాల కన్నా ఫ్యూడల్ పాలకుల ప్రయోజనాలకే వారు ప్రాధాన్యమిచ్చారు. వాస్తవానికి, ట్రావెన్కోర్ మహారాజు స్వాతంత్య్ర ప్రకటనకు వి.డి.సావర్కర్ మద్దతు తెలుపుతూ టెలిగ్రాం పంపారు. స్వాతంత్య్రాన్ని ప్రకటిస్తూ హైదరాబాద్ ముస్లిం పాలకుడు తీసుకున్న నిర్ణయాన్ని ఉటంకిస్తూ, హిందూ సంస్థానమైన ట్రావెన్కోర్ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకోవాలని నిర్ణయించడం సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణిస్తూ ఆయన మద్దతు నిచ్చారు. ఈ రకమైన ఫ్యూడల్ అనుకూల, సామ్రాజ్యవాద అను కూల వైఖరి ఇప్పటికీ బిజెపి పాలకుల్లో ఇంకా ప్రబలంగా వుంది.
చారిత్రక ప్రాధాన్యత కలిగిన తేదీలను... నియంతృత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం కాశ్మీరీ ప్రజలు సాగించిన పోరాట చిహ్నాలను...రద్దు చేయడమంటే కాశ్మీరు లోయ లోని ప్రజల ఓటు హక్కును రద్దు చేయడమే. వారిని రాజకీయంగా పక్కకు నెట్టే మొత్తం ప్రణాళికలో భాగమే. అసెంబ్లీ సీట్ల పునర్విభజన జరిగిన తీరు, నివాస ప్రతిపత్తిలో జరిగిన మార్పులు...వీటన్నింటిలో ఈ కోణాలను మనం చూడవచ్చు.
సమైక్య జమ్మూ కాశ్మీర్‌ను మూడు ముక్కలుగా చేయాలన్న ఆర్ఎస్ఎస్ పాత ప్రణాళిక సవరించిన రూపులో తిరిగి కార్యాచరణ క్రమంలోకి వచ్చింది. ఇది రాబోయే రోజుల్లో మరింత విస్తృతమైన ఘర్షణలకు, లోతైన సమస్యలకు బీజాలు వేస్తుంది.
( 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం )