ఐఎఎస్‌లు, సాయుధ బలగాలు, రైల్వేతోసహా మొత్తం ప్రభుత్వ యంత్రాంగంతో గ్రామస్థాయి వరకూ సర్కారు గొప్పలు ప్రచారం చేయించాలని కేంద్రం నిర్ణయించడం దారుణం. తద్వారా ఎన్నికల్లో గెలుపు కోసం ఎంతకైనా దిగజారడానికి సిద్ధమని మోడీ సర్కారు మరోసారి నిరూపించుకుంది. కేంద్ర సర్వీసులలోని జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ) వంటి సీనియర్ అధికారులను 'రథ ప్రభారీలు' (ప్రత్యేక అధికారులు)గా నియమించాలని కేంద్రం నిర్ణయించింది. వారి పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర' పేరుతో నవంబర్ 20 నుంచి 2024 జనవరి 25 వరకూ రథయాత్రలు నిర్వహించనుంది. జిపిఎస్, డ్రోన్లు, ఎల్‌ఇడి స్క్రీన్లుతో కూడిన అధునాతన కమ్యూనికేషన్ పరికరాలతో కూడిన ప్రతి రథంలోనూ నలుగురైదుగురు ప్రభుత్వ అధికారులు ప్రయాణించాలని ఆదేశించింది. పరిపాలనా యంత్రాంగమంతా పాలనను గాలికొదిలేసి, మోడీ ప్రచారంలో తలమునకలై, 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలన్నది ఈ ఆదేశాల ఆంతర్యం. సెలవులో ఇళ్లకు వెళ్లిన సైనికులు 'సైనికులు-రాయబారులు' పేరుతో కేంద్ర ప్రభుత్వ ప్రచారానికి తమ సమయాన్ని వినియోగించాలని రక్షణ మంత్రిత్వశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది. తటస్థంగా ఉండాల్సిన సైన్యాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకోవడం, కఠినమైన శిక్షణలో, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సేవలందించిన సైనికులు కుటుంబాలతో గడిపే కొద్దిపాటి విశ్రాంతి దినాలను సైతం హైజాక్ చేయాలనుకోవడం దుర్మార్గం.
దేశ సంపదనంతా కార్పొరేట్లకు కట్టబెట్టడం, భారీ అవినీతి, మత కలహాలు, జాతి కలహాలు, బుజ్జగింపులు, ఎన్నికల బాండ్లు, ఇతర మార్గాల్లో కొల్లగొట్టిన వేల కోట్ల అవినీతి సొమ్మును సోషల్ ఇంజనీరింగ్ పేరుతో కుమ్మరించడం, ఓట్లు కొనడం, ఓటు వేయని వారిపై దాడులు చేయడం, ఆస్తులను తగలబెట్టడం, గెలిచిన ప్రతిపక్ష సభ్యులను కొనేసి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడం తరహా ఎత్తుగడలూ మోడీ, అమిత్‌షాల నేతృత్వంలోని కాషాయ ప్రభుత్వానికి కొత్తకాదు. యుపిఎ-2 ప్రభుత్వ వైఫల్యాలు, భారీఎత్తున హామీలను గుమ్మరించి కార్పొరేట్ మద్దతుతో 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు సామాన్యులకు చేసిందేమీ లేదు. భద్రతరీత్యా విమానాల్లో తరలించాలన్న ఆర్మీ విజ్ఞప్తిని బుట్టదాఖలు చేసి, 2019 ఫిబ్రవరిలో పుల్వామాలో 40 మంది సిఆర్‌పిఎఫ్ మరణానికి కారణమైంది. పైగా కార్పొరేట్ ప్రచారంతో ఊదరగొట్టి, ఉగ్రవాదాన్ని ఎజెండాపైకి తీసుకొచ్చి గెలవగలిగింది. కానీ, ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది.
మోడీ హయాంలో 'వెలుగుతున్న భారతదేశం.. నలిగిపోతున్న భారతదేశం...'గా మారిపోయింది. అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ దిగ్గజాలకు జాతీయ సంపద దోచిపెడుతోంది. అదానీ అవినీతిని హిండెన్‌బర్గ్‌సహా అనేక నివేదికలు దుమ్మెత్తిపోసినా నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టు వ్యవహరించింది. కార్పొరేట్లకు గతంలో ఎన్నడూ లేనంతగా దోచిపెడుతుండటం, ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగం, పేదరికం కారణంగా సామాన్యుల జీవితాలు దుర్భరంగా మారాయి. ప్రపంచ ఆకలి సూచీలో 125 దేశాల్లో 111 స్థానానికి దేశం పడిపోయింది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికీ తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్డి సౌకర్యం, చౌకగా పెట్రోల్, గ్యాస్, పేదరికం నిర్మూలన, 2022 నాటికి ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లాంటి హామీలేవీ నెరవేర్చే చిత్తశుద్ధి కేంద్రానికి లేదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మాటల గారడీని, మైనారిటీ, మెజారిటీలుగా విభజించే మతతత్వ విషాన్ని ప్రజలు తిప్పికొడతారని కర్ణాటక ఎన్నికల్లో స్పష్టమైంది. సిబిఐ, ఇడి, ఐటి లాంటి దర్యాప్తు సంస్థను ప్రతిపక్షాలపై ఎగదోయడం, ఎన్నికల కమిషన్, కాగ్ లాంటి స్వతంత్ర సంస్థలను సైతం దుర్వినియోగం చేయడం, అత్యున్నత న్యాయస్థానాలను సైతం ఇబ్బందిపెట్టడం, రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను కాలరాసే నియంతృత్వ విధానాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, సాయుధ బలగాలను దుర్వినియోగం చేయాలనుకోవడం గతంలో ఎన్నడూ దేశం చూడని ఘోరమైన ఎత్తుగడ. ఇప్పటికైనా తాజా ఆదేశాలను ఉపసంహరించడం మోడీ సర్కారు కనీస బాధ్యత.