Jun 20,2023 06:46

రెండు ప్రపంచ యుద్ధాల నడుమ కాలంలో వచ్చిన అనుభవాలతో ఎగుమతులపై ఆధారపడి ఆర్థిక వృద్ధి సాధించాలన్న వ్యూహాన్ని చాలా దేశాలు విడిచిపెట్టాయి. నయా ఉదారవాద విధానాలు ముందుకొచ్చాక ఆ నాడు విడిచిపెట్టిన వ్యూహమే మళ్ళీ ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరొకసారి సంక్షోభంలో చిక్కుకుంది. అందుచేత ఈ వ్యూహానికి కాలం చెల్లే సమయం దగ్గరపడింది.

ఎగుమతుల మీద ఆధారపడి సాధించే ఆర్థిక వృద్ధి పైకి ఒక విజయంలా కనిపించినా, ఒక్క దెబ్బకి అదంతా మటుమాయం అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, ఆ వృద్ధి అంతా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి దయ మీద ఆధారపడి వుంటుంది. ఆ ద్రవ్య పెట్టుబడి దురాశకే ఆ వృద్ధి కాస్తా బలైపోతుంది కూడా.

          ముందు శ్రీలంక, తర్వాత పాకిస్తాన్‌, తర్వాత తాజాగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న మరో పొరుగు దేశం బంగ్లాదేశ్‌. తాజాగా ఐఎంఎఫ్‌ నుండి బంగ్లాదేశ్‌ 450 కోట్ల డాలర్ల రుణాన్ని అర్థించింది. ఇదిగాక, ఇప్పటికే ప్రపంచ బ్యాంక్‌ నుండి 100 కోట్ల డాలర్లను, రుణదాతలుగా ఉండే దేశాల నుండి, ఏజన్సీల నుండి 250-300 కోట్ల డాలర్లను రుణంగా కోరుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ వాణిజ్య లోటు రోజురోజుకూ పెరిగిపోతోంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. కరెన్సీ విలువ పడిపోతోంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ఉంది. ఇంధన రంగంలో ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం ఫలితంగా భారీ స్థాయిలో విద్యుత్‌ కోతలు అమలు జరుగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం బింకంగా, పెద్ద ఇబ్బందులేమీ లేనట్టు పైకి వ్యవహరిస్తోంది.
          కొద్ది నెలల క్రితం వరకూ అందరూ బంగ్లాదేశ్‌ ఆర్థిక విజయగాధల గురించి గొప్పగా చెప్తూ వచ్చారు. ఆ ప్రచారాన్ని ప్రస్తుత పరిణామాలు పరిహసిస్తున్నాయి. స్త్రీలలో అక్షరాస్యత 73 శాతానికి చేరిందని, 1971లో పాకిస్తాన్‌ నుండి విడిపోయినప్పుడు ఎంత శాతం శిశు మరణాలు ఉండేవో, వాటిలో సగానికి ఇప్పుడు తగ్గిపోయాయని, మానవాభివృద్ధి సూచికలో ఇండియా కన్నా, పాకిస్తాన్‌, మరికొన్ని దేశాల కన్నా బంగ్లాదేశ్‌ ముందుందని నివేదికలు వెల్లడించాయి. ఈ అభివృద్ధి వాస్తవంగా చెప్పుకోదగ్గదే. చాలా మంది దీనిని ఒక ఆర్థిక అద్భుతంగా అభివర్ణించారు. బంగ్లాదేశ్‌ స్వతంత్రం సాధించిననాటికి అది చాలా బలహీనమైన ఆర్థిక వ్యవస్థగా ఉండేది. అటువంటిది తన పొరుగుదేశాల కన్నా వేగంగా అభివృద్ధి సాధించగలగడం నిజంగానే గొప్ప విషయం. అటువంటిది ఇప్పుడు ఆ దేశం ఉన్నట్టుండి ఇలా ఆర్థిక చిక్కుల్లో కూరుకుపోవడం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
           శ్రీలంక విషయంలో చెప్పినట్టుగానే, ఇక్కడ కూడా ఈ పరిస్థితికి అవినీతి పెరిగిపోవడమే కారణం అని వ్యాఖ్యానించడం జరుగుతోంది. అవినీతి ఎక్కడైనా ఖండించవలసినదే, బంగ్లాదేశ్‌ ప్రస్తుత పరిస్థితికి అవినీతే కారణం అని చెప్పడం తేలికే. కాని అది అసలు కారణం కాదు. మరికొందరు చెప్తున్నది ఇలా ఉంది: ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో చాలా సరుకుల అంతర్జాతీయ ధరలు పెరిగిపోయాయని, అందువలన బంగ్లాదేశ్‌ దిగుమతి చేసుకునే సరుకులకు చెల్లించవలసిన మొత్తం పెరిగిపోయి, అందుకవసరమైన విదేశీ మారకపు నిల్వలు కాస్తా కరిగిపోయాయని వారంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌ ఎక్కువగా తన దేశ అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడుతుందని, ఇప్పుడు ఆ దిగుమతులు చేసుకునే శక్తి సన్నగిల్లడంతో దేశంలో సరుకుల ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణానికి దారి తీసిందని, విదేశీ కరెన్సీ నిల్వలు తరిగిపోయినందువలన బంగ్లాదేశ్‌ కరెన్సీ మారకపు విలువ తగ్గిపోయిందని, ఆ విధంగా పడిపోకుండా ఉండడానికి చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వలేదని వారు వివరిస్తున్నారు. ఈ వివరణలో ఒక లోపం ఉంది. ఇది కేవలం దిగుమతులపైనే తన ఫోకస్‌ అంతటినీ పెట్టింది. బంగ్లాదేశ్‌ నుండి జరిగే ఎగుమతుల్లో 83 శాతం రడీమేడ్‌ దుస్తులదే. ఇప్పుడు దాని ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఈ విషయాన్ని పై వివరణ పరిగణనలోకి తీసుకోలేదు.
కొందరు బంగ్లాదేశీ ఆర్థికవేత్తలు తమ ప్రభుత్వం అనుసరించిన ద్రవ్య విధానమే ఈ దుస్థితికి కారణం అని నిందిస్తున్నారు. వారి వాదన ఇలా ఉంది: బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తన వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు పెంచకుండా స్థిరంగా చాలాకాలం కొనసాగించింది. ఒకవేళ వడ్డీరేట్లను వెంటవెంటనే పెంచివుంటే విదేశాలనుండి ప్రైవేటు ద్రవ్య పెట్టుబడులు ఎక్కువగా దేశంలోకి వచ్చివుండేవి. వాటి తోడ్పాటుతో విదేశీ చెల్లింపుల లోటు ఏర్పడకుండా చూసుకోవడం సాధ్యం అయివుండేది. అప్పుడు బంగ్లాదేశ్‌ కరెన్సీ మారకపు రేటు కూడా పడిపోకుండా నిలదొక్కుకోగలిగేది. కరెన్సీ మారకపు రేటు పడిపోయినందువలన ఇప్పుడు విదేశీ పెట్టుబడులు రాకుండా నిలిచిపోయిన పరిస్థితి అప్పుడు ఏర్పడేది కాదు.
          ఐతే ఈ వాదన కూడా పైపై పరిశీలనతో చేసినదే. బంగ్లాదేశ్‌ వృద్ధి సాధించడం కోసం అనుసరించిన వ్యూహంలోనే అసలు లోపం ఉంది. నయా ఉదారవాద కాలంలో చాలా ఇతర దేశాల మాదిరిగానే బంగ్లాదేశ్‌ కూడా ఎగుమతులను బాగా పెంచడం ద్వారా వృద్ధి సాధించాలనే వ్యూహాన్ని చేపట్టింది.
             దాదాపు ఒక అర్ధ శతాబ్దం కాలంగా ఆర్థికవేత్తల మధ్య చర్చల్లో ఎగుమతులపై ఆధారపడి అభివృద్ధి సాధించాలనే వ్యూహం వెనుక విజ్ఞత ఏమిటన్న చర్చ ఒక భాగంగా ఉంది. తూర్పు ఆసియా దేశాలు సాధించిన ''అద్భుతం''తో పోల్చితే భారతదేశంలో వృద్ధి చాలా మందకొడిగా ఉందంటూ పోలిక తెచ్చి ఆ విధంగా వృద్ధిరేటులో భారత్‌ వెనకబడిపోడానికి కారణం అది ''లోలోపలికి ముడుచుకుపోయే దృష్టి''తో వ్యవహరించడమే అని ప్రపంచ బ్యాంక్‌ విమర్శిస్తూ వచ్చింది. ఐతే వాస్తవ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే ఒకానొక అంశాన్ని ఈ చర్చ పూర్తిగా విస్మరించింది.
ఒక దేశపు ఆర్థిక వ్యవస్థలో ఉండే మొత్తం డిమాండ్‌లో రకరకాల ఖర్చులు అంతర్భాగంగా ఉంటాయి. వీటిలో కొన్ని స్వయంప్రతిపత్తితో ఉంటాయి. అంటే ఇతర అంశాలమీద ఆధారపడకుండా ఉంటాయి. మరికొన్ని ఆ మొత్తం డిమాండ్‌ ఏ వేగంతో పెరుగుతోంది అన్న అంశంమీద ఆధారపడి వుంటాయి. ఎగుమతులు, ప్రభుత్వ వ్యయం-ఈ రెండూ స్వయంప్రతిపత్తి కలిగిన ప్రధాన ఖర్చులు. ప్రజల వినిమయ ఖర్చు వారి వారి ఆదాయాల స్థాయిని బట్టి ఉంటుంది (ఒక్కోసారి అందుకు భిన్నంగా ప్రజల వినిమయం కూడా స్వయంప్రతిపత్తి తో వ్యవహరించే సందర్భాలు ఉంటాయి. ఉదాహరణకు: చాలాకాలంగా మార్కెట్‌లో లభించని సరుకు ఉన్నట్టుండి దొరకడం మొదలైతే ప్రజలు ఆ సరుకును తమ తమ ఆదాయాలతో నిమిత్తం లేకుండా కూడా కొంటారు.).
          ఒక ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ పెరిగినప్పుడే ఆ మేరకు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అప్పుడే ఆ ఆర్థిక వ్యవస్థ వృద్ధి సాధిస్తుంది. అందుచేత డిమాండ్‌ను పెంచాలంటే స్వయంప్రతిపత్తి కలిగిన అంశాలమీద దృష్టి పెంచాలి (అంటే ఎగుమతులను పెంచడం, ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం). ప్రస్తుత నయా ఉదారవాద వ్యవస్థలో దేశాల హద్దుల్ని స్వేచ్ఛగా దాటి ద్రవ్య పెట్టుబడులు ప్రవహించే పరిస్థితి ఉంది. ఆ పెట్టుబడుల ప్రవాహం ఆగిపోకుండా ఉండాలంటే ఏ దేశమైనా ఒకానొక స్థాయిని మించి తన బడ్జెట్‌లో ద్రవ్యలోటును పెరగనివ్వకూడదు. అదే సమయంలో ఆ విధానాల ఒత్తిడి కారణంగా తన దేశంలో సంపన్నులపై పన్నులను పెంచేందుకు ఏ ప్రభుత్వమూ సిద్ధం కాదు. అందువలన ప్రభుత్వ వ్యయాన్ని పెంచే అవకాశాలు పరిమితం అయిపోయాయి. ఇక వృద్ధి సాధించాలంటే ఎగుమతులను పెంచడం ఒక్కటే మార్గం. నయా ఉదారవాద వ్యవస్థ లో ఆర్థిక వృద్ధి ప్రధానంగా ఎగుమతులపైన ఆధారపడి జరుగుతుంది. ఇలా ఎగుమతులపై ఎక్కువగా దృష్టి పెట్టి ఏదైనా దేశం వృద్ధిసాధించవచ్చు. కాని ఏ దేశానికైనా వృద్ధిని కొనసాగించే విషయంలో ప్రభుత్వం పోషించే పాత్ర ఇరుసులాగా పని చేస్తుంది. తూర్పు ఆసియా దేశాల ప్రభుత్వాలు అటువంటి పాత్రనే పోషించాయని కొందరు వాదిస్తూంటారు కూడా.
         ఎగుమతులను బాగా పెంచడం ద్వారా వృద్ధి సాధించాలనే దేశాలలో రెండు తరహాలవి ఉన్నాయి. వాటి మధ్య తేడాను మనం చూడగలగాలి. మొదటి తరహా దేశాలు ఒక క్రమ పద్ధతిలో తమ ఎగుమతులను పెంచుకుంటూ ఆ క్రమంలో వాణిజ్య చెల్లింపు ఖాతాలో మిగులు సాధించి తమ విదేశీ మారకపు నిల్వలను భారీగా పెంచుకుంటాయి. ఈ తరహా దేశాలకు ప్రధాన ఉదాహరణ చైనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ప్రతికూల పరిణామాలు వచ్చినా, ఆ ప్రభావం వలన ఆ దేశపు విదేశీ వాణిజ్య ఖాతాలో ఉన్న మిగులు కొంతమేరకు తగ్గుతుందే తప్ప అంతకు మించి ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ ఎటువంటి ఆర్థిక సంక్షోభంలోనూ చిక్కుపడిపోదు.
            ఐతే, చాలా దేశాలు రెండో తరహాకు చెందుతాయి. ఈ దేశాల విదేశీ వాణిజ్య చెల్లింపుల ఖాతాలో ఎప్పుడూ లోటు కొనసాగుతూనే వుంటుంది తప్ప మిగులు ఉండదు. ఆ లోటును ప్రైవేటు ద్రవ్య పెట్టుబడి ప్రవాహాల సహాయంతో పూడ్చుకుంటూ వుంటాయి. వాటి వద్ద విదేశీ మారకపు నిల్వలు ఉంటాయి. ఐతే అవి ప్రధానంగా రుణాల ద్వారా సమకూర్చుకున్నవే. భారతదేశం ఈ కోవకే చెందుతుంది. దక్షిణాసియా దేశాలలో చాలా భాగం, మూడో ప్రపంచ దేశాలలో చాలా భాగం ఈ కోవకే చెందుతాయి.
           ఈ తరహా దేశాలలో విదేశీ వాణిజ్య చెల్లింపుల ఖాతాలో లోటు ఒక్కోసారి వేరే వేరే కారణాల వలన పెరిగిపోవచ్చు. అది కరోనా కాలంలో టూరిస్టులు తగ్గిపోయినందువలన విదేశీ మారకపు ఆదాయం పడిపోవడం వంటిది కావచ్చు (శ్రీలంకలో జరిగినట్టు). లేదా ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా దిగుమతుల ధరలు పెరిగిపోయి లోటు పెరిగిపోవచ్చు. లేదా, ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యం కారణంగా ఎగుమతులు తగ్గిపోయి దాని ఫలితంగా లోటు పెరిగిపోవచ్చు (బంగ్లాదేశ్‌లో ఈ రెండు కారణాలూ ప్రభావాన్ని చూపాయి). ఇటువంటి సమయాల్లో ఆ లోటును పూడ్చడానికి ప్రైవేటు ద్రవ్య పెట్టుబడి ప్రవాహాలు బాగా అవసరం అవుతాయి. కాని సరిగ్గా అటువంటి సమయాల్లోనే ఆ ప్రైవేటు ద్రవ్య పెట్టుబడి లోటును పూడ్చేబదులు దేశాన్ని వదిలిపెట్టి బైటకు పోతుంది. దానివలన ఆ లోటు మరింత పెరగుతుంది. దేశం సంక్షోభంలో పడుతుంది.
      ప్రైవేటు ద్రవ్య పెట్టుబడికి తన స్వంత లాభాలే ముఖ్యం. ఏ దేశం ఏమౌతుందోనన్న ఆందోళన దానికేమీ ఉండదు. ఒక దేశంలో స్థానిక కరెన్సీ విలువ పడిపోతే అక్కడ తమకు వచ్చే లాభాల విలువ కూడా తగ్గుతుంది గనుక ఆ ప్రైవేటు పెట్టుబడి అక్కడి నుండి బైటకు పోడానికే సిద్ధపడుతుంది. అప్పుడు విదేశీ మారకపు లోటు మరింత తీవ్ర సమస్యగా ఆ దేశానికి మారుతుంది. అటువంటి పరిస్థితుల్లో కూడా నయా ఉదారవాదులు, స్వేచ్ఛా మార్కెట్‌ వాదులు చెప్పినట్టు పరిస్థితులను మార్కెట్‌ శక్తులకే విడిచిపెడితే ఇక ఆ దేశంలో పరిస్థితి ఎన్నటికీ మామూలు స్థితికి రాదు. అప్పుడే ఆ దేశాల ప్రభుత్వాలు ఐఎంఎఫ్‌ వంటి సంస్థలను ఆశ్రయిస్తాయి. అక్కడినుండి లభించే రుణంతో విదేశీ చెల్లింపుల లోటు సమస్యను అధిగమించవచ్చునన్న అంచనాలు ఏర్పడగానే ప్రైవేటు ద్రవ్య పెట్టుబడి అక్కడినుండి బైటకు పోవాలన్న ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. ఎందుకంటే ఆ రుణం తోడ్పాటుతో ఆ దేశపు కరెన్సీ మారకపు రేటు పడిపోకుండా నిలబడుతుంది అన్న అంచనాకి వస్తుంది. ఐతే అ రుణానికి బదులుగా ఐఎంఎఫ్‌ చాలా భారీ మూల్యాన్నే కోరుతుంది. సంక్షేమ కార్యక్రమాలకి చేసే ఖర్చు తగ్గించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను ఎత్తివేయాలని, ప్రభుత్వ రంగ ఆస్థులను విదేశీయులకు అప్పగించాలని - ఇలా ఉంటాయి ఐఎంఎఫ్‌ షరతులు.
          నిజానికి విదేశీ చెల్లింపులలో లోటు పెరగడం అనేది మొదట చాలా స్వల్ప మోతాదులోనే ఉంటుంది. అది ఉన్నట్టుండి ఒక్కసారి అమాంతం భారీ లోటుగా పెరిగిపోవడం అనేది ప్రైవేటు ద్రవ్య పెట్టుబడి పుణ్యమే. ఉన్నట్టుండి ప్రైవేటు ద్రవ్య పెట్టుబడి ఆ దేశం నుండి ఉడాయించగానే విదేశీ చెల్లింపుల లోటు అమాంతం విపరీతంగా పెరిగిపోయి దాని నుండి బైటపడడానికి ఆ దేశ ప్రభుత్వం ఐఎంఎఫ్‌ దృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకుపోతుంది. ఆర్థిక వృద్ధిలో అద్భుతాలు సాధించిన దేశాలు ఉన్నట్టుండి బిచ్చమెత్తుకునే స్థితికి దిగజారిపోవడం ఇందువలనే జరుగుతుంది. ఎగుమతుల మీద ఆధారపడి సాధించే ఆర్థిక వృద్ధి పైకి ఒక విజయంలా కనిపించినా, ఒక్క దెబ్బకి అదంతా మటుమాయం అయిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే, ఆ వృద్ధి అంతా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి దయ మీద ఆధారపడి వుంటుంది. ఆ ద్రవ్య పెట్టుబడి దురాశకే ఆ వృద్ధి కాస్తా బలైపోతుంది కూడా.
         మన పొరుగు దేశాలలో ఇదే విధంగా జరిగింది. శ్రీలంక గాని, బంగ్లాదేశ్‌ కాని మొదట్లో మానవాభివృద్ధి విషయంలో చాలా మంచి విజయాలను సాధించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకోవడం, దాని వలన చాలా మూడో ప్రపంచ దేశాల ఎగుమతులు దెబ్బ తినడం ఫలితంగా ఇప్పుడు బిచ్చమెత్తుకునే దేశాల లిస్టు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుంది. చాలా ఎక్కువ స్థాయిలో తమ వద్ద విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయన్న ధీమా వలన ఉపయోగం లేదు. ఆ నిల్వల్లో ఎక్కువ భాగం వాణిజ్యంలో సాధించిన మిగులు వలన ఏర్పడిందేమీ కాదు. విదేశీ ప్రైవేటు ద్రవ్య పెట్టుబడి అందులో అత్యధిక భాగంగా ఉంది. భారత దేశానికి ఉన్న ఒకే ఒక్క భరోసా ఏమిటంటే ఆహారధాన్యాల నిల్వలు మన దగ్గర బాగా ఉండడం (అది కూడా మన ప్రజలు అందరూ కడుపునిండా తినలేని పరిస్థితి వలన ఏర్పడిన నిల్వలే). ఇంకొక సానుకూల అంశం అమెరికా ఆంక్షలకు గురైన రష్యా నుండి చమురు దిగుమతులు చేసుకునే వీలు ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు. ఒకవేళ మోడీ చేసిన నల్ల వ్యవసాయ చట్టాలు గనుక అమలు లోకి వచ్చివుంటే ఈ పాటికి మన ఆహార నిల్వలు కాస్తా కరిగిపోయి వుండేవి. అంటే ఇప్పుడు దేశాన్ని కాపాడినది ఆ రోజు రైతులు సాగించిన పోరాటమే.
            రెండు ప్రపంచ యుద్ధాల నడుమ కాలంలో వచ్చిన అనుభవాలతో ఎగుమతులపై ఆధారపడి ఆర్థిక వృద్ధి సాధించాలన్న వ్యూహాన్ని చాలా దేశాలు విడిచిపెట్టాయి. నయా ఉదారవాద విధానాలు ముందుకొచ్చాక ఆ నాడు విడిచిపెట్టిన వ్యూహమే మళ్ళీ ముందుకొచ్చింది. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరొకసారి సంక్షోభంలో చిక్కుకుంది. అందుచేత ఈ వ్యూహానికి కాలం చెల్లే సమయం దగ్గరపడింది.

(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

ప్రభాత్‌ పట్నాయక్‌