
సామాన్యుడి జీవితాన్ని అల్లకల్లోలం చేసిన మోడీ సర్కారు నిర్ణయాల్లో ఒకటైన పెద్ద నోట్ల రద్దును దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్ధించినట్లుగా భావించలేం. సాంకేతికంగా మాత్రమే తప్పు బట్టలేమని చెప్పిన న్యాయస్థానం కేంద్ర ప్రజావ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేసింది. దేశానికి ఎనలేని దుస్థితిని, ఆర్థిక పతనాన్ని తెచ్చిపెట్టిన మితిమీరిన అధికార చర్యను సరిదిద్దలేమనే సుప్రీం నిస్సహాయతను ఈ తీర్పు ప్రతిబింబిస్తోంది. పెద్ద నోట్ల రద్దు యొక్క లక్ష్యం నెరవేరిందా లేదా అనేదానితో న్యాయస్థానానికి సంబంధం లేదని మెజార్టీ తీర్పు పేర్కొనడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది. కోట్లాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన ఇటువంటి అంశంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదా?. 1934 నాటి ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 26(2)ను ఇది ఉల్లంఘించడం లేదని, పెద్దనోట్లను రద్దు చేసే చట్టబద్ధమైన అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని మాత్రమే ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజారిటీతో తీర్పు చెప్పింది. మెజార్టీ తీర్పుతో ఏకీభవించని జస్టిస్ బివి నాగరత్న తన అసమ్మతి తీర్పులో పెద్ద నోట్ల రద్దును చేపట్టాలని ఆర్‌బిఐ, ప్రభుత్వానికి సిఫార్సు తప్పనిసరని ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్‌ను ఉటంకించారు. ఈ నిర్ణయం అమలు చేయడానికి ముందు పార్లమెంట్ ఆమోద ముద్ర పొందడం లేదా ఆర్డినెన్స్ ద్వారా కానీ చేయాల్సిందని స్పష్టంగా పేర్కొన్నారు..
నోట్ల రద్దు ప్రక్రియను పరిశీలిస్తే... 2016 నవంబర్ 8న అర్ధరాత్రి రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. నల్ల ధనాన్ని వెలికి తీయడం, నకిలీ కరెన్సీ సమస్యను తుదముట్టించడం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడం, అవినీతిని నిర్మూలించడం, ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణిని తగ్గించడం లక్ష్యాలుగా పేర్కొన్నారు. వాటిల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. దీనికి విరుద్ధంగా, ప్రజల్లో చలామణిలో వున్న కరెన్సీ, పెద్ద నోట్ల రద్దు సందర్భంగా రూ.17.7లక్షల కోట్ల నుండి ఇప్పుడు రూ.30.88 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్‌బిఐ పేర్కొంది. అంటే 71.84శాతం పెంపు నమోదైంది. ఈ నిర్ణయం పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ప్రజానీకానికి పెనువిపత్తులా పరిణమించింది. నోట్లమార్పిడి, ప్రత్యామ్నాయ వ్యవస్థలకు ఎలాంటి నిబంధనలు రూపొందించకపోవడంతో జనం బ్యాంకుల వద్దకు పరుగులు తీశారు. నగదు కోసం క్యూలలో నిలబడటం, తోపులాటల వల్ల నెల రోజుల్లోనే 82 మంది మరణించినట్లు వార్తా కథనాలు వచ్చాయి. వాస్తవానికి ఆ మృతుల సంఖ్య మరిన్ని రెట్లుండవచ్చు. కోట్లాదిమంది ప్రజలకు ఉపాధి కలిగించే దేశ అసంఘటిత రంగం తీవ్ర విధ్వంసానికి గురైంది. వాణిజ్య, పారిశ్రామిక రంగాలు దెబ్బతిన్నాయి. జీవనోపాధులను దెబ్బతీసింది. డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు ఆర్థిక వ్యవస్థనే షాక్‌కు గురిచేయాల్సిన పని లేదు. పెద్దనోట్ల రద్దు ద్వారా బ్లాక్ మనీని అంతం చేస్తామని మోడీ చేసిన ప్రచారానికి, ఆ తరువాత రూ.2000 నోటును ప్రవేశపెట్టడానికి మధ్య అంతరం గురించి ఆలోచిస్తే... బిజెపి సర్కారు తీసుకున్న నిర్ణయాలకు, చెప్పిన దానికీ పొంతనే కనిపించదు.
జస్టిస్ బివి నాగరత్న తీర్పు మోడీ పరిపాలనపై అభియోగపత్రం. పెద్ద నోట్ల రద్దుపై కసరత్తును కేవలం 24 గంటల్లోనే ముగించారని, దీన్ని ఆర్‌బిఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం సిఫార్సుగా భావించలేమని పేర్కొన్నారు. ఆర్‌బిఐకి ఎటువంటి స్వతంత్ర ఆలోచన లేదనే అంశాన్ని ఎత్తిచూపారు. నోట్ల రద్దు లక్ష్యాలు ఏమైనప్పటికీ, దానిని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. భిన్నాభిప్రాయంతో వెలువడిన కీలక తీర్పుల్లో ఇది ఒకటిగా సుప్రీంకోర్టు చరిత్రలోనే నిలిచిపోతుంది. మొత్తంగా చూసినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం వల్ల తలెత్తిన పర్యవసానాలను ఏవిధంగానూ సమర్థించలేదు. దీనిని సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మోడీ ప్రభుత్వం భావిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు.