Mar 10,2023 06:28

ప్రధాని నరేంద్ర మోడీని 'విశ్వగురువు'గా అభివర్ణిస్తూ బిజెపి ప్రచారం చేస్తోంది. భారతదేశం జి-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ ప్రచారం గరిష్ట స్థాయికి చేరుకుంది. అదే సమయంలో మోడీ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం ఎలా చూస్తున్నదో స్పష్టం చేసే నివేదికలు వస్తున్నాయి. భారతదేశంలో అత్యంత దారుణమైన నియంతత్వం నెలకొందని పాశ్చాత్య పరిశోధనా సంస్థలు ఎత్తిచూపుతున్నాయి. స్వీడన్‌ లోని గోథెన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వి-డెమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రకారం పదేళ్లలో అత్యంత దారుణమైన నియంతృత్వం ఉన్న దేశాల్లో భారత్‌ ఒకటిగా మారిందని పేర్కొంది. 2021 నివేదికలో, వి-డెమ్‌ భారతదేశాన్ని ఓటింగ్‌ ద్వారా నియంతృత్వం వచ్చిన దేశంగా అభివర్ణించింది. భారతదేశంలో స్వేచ్ఛ పాక్షికంగా వుందని అదే సంవత్సరంలో వాషింగ్టన్‌ డి.సి ఆధారిత ఫ్రీడమ్‌ హౌస్‌ ఒక నివేదికలో పేర్కొంది. గత ఏడాది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్‌ 142వ స్థానానికి పడిపోయింది.
తప్పుడు సమాచారం, నిరంకుశత్వం, మత సమీకరణ పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని వి-డెమ్‌ నివేదిక పేర్కొంది. దేశ ఎన్నికలలో బిజెపి విజయం సాధించడం వల్ల మత సమీకరణలు మరింత గట్టిపడుతున్నాయి. నకిలీ వార్తలను విస్తృతంగా వ్యాప్తి చేయడం ద్వారా ప్రజలను మతపరమైన మార్గాల్లో విభజిస్తున్నది. ఈ విధంగా అధికారం చేజిక్కించుకున్న తర్వాత కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ బిజెపి ప్రభుత్వాలు నియంతృత్వ ధోరణిలో పనిచేస్తున్నాయి. రాజకీయ వ్యతిరేకతను తొలగించడానికి అన్ని మార్గాలను ఉపయోగిస్తాయి. వీలున్న చోట కొనుగోళ్లకూ వెనకాడవు. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా, అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై బిజెపి కార్యకర్తలు భౌతిక దాడులు చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఒక కలగా మారుతోంది.
బిజెపి ని, సంఫ్‌ుపరివార్‌ను విమర్శించే నాయకులు, సాంస్కృతిక కార్యకర్తలు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను జైళ్లలో పెడుతున్నారు. ఇందులో భాగంగానే స్టాన్‌స్వామి జ్యుడీషియల్‌ కస్టడీలో మరణించారు. మోడీ ప్రభుత్వ క్రోనీ క్యాపిటలిజాన్ని బట్టబయలు చేసే జర్నలిస్టులపై వేటు పడింది. కోవిడ్‌ కాలంలో మానవ హక్కుల ఉల్లంఘనలను, ప్రభుత్వ తప్పుడు నిర్వహణా పద్ధతులను బహిర్గతం చేసినందుకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌పై ఇ.డి చర్య తీసుకుంది. దేశంలో బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేసిన తర్వాత 2020 సెప్టెంబర్‌ నుండి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ భారతదేశంలో కార్యకలాపాలను నిలిపివేసింది. గుజరాత్‌ మారణహోమంలో బిజెపి పాత్రను వెలుగులోకి తెచ్చినందుకు తీస్తా సెతల్వాద్‌, రాణా అయూబ్‌లపై కేసులు నమోదయ్యాయి.
దేశంలోని సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. బిజెపి యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను ఉపయోగించుకుని ఆ యా ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. విద్య, వ్యవసాయం, అటవీ, ఓడరేవుల రంగాల్లో రాష్ట్రాలు దోపిడీకి గురవుతున్నాయి. కొలీజియం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి స్వతంత్ర న్యాయవ్యవస్థ ఆలోచనకు వ్యతిరేకమైనది. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సుప్రీంకోర్టును సవాలు చేసే విధంగా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకు ఎన్నికల కమిషన్‌ సహా రాజ్యాంగ సంస్థలను సాధనాలుగా మార్చుకున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి.
దేశ వ్యాప్తంగా హిందీ భాషను ప్రయోగించాలనే ఎత్తుగడ, దుస్తులు, తిండి పేరుతో నిషేధాలు, అణచివేతలు, మైనార్టీలపై దాడులు వంటివి నిరంకుశత్వానికి సంకేతాలు. దేశంలో మైనారిటీల మీద జరుగుతున్న వేధింపులపై యూరప్‌, అమెరికాలోని పార్లమెంటరీ గ్రూపులు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట బిజెపి చేస్తున్న ప్రచారార్భాటానికి పూర్తి వ్యతిరేకంగా వుంది. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను, వాటి విమర్శలను నిందిస్తూ అణిచివేసేందుకు పదే పదే ప్రయత్నిస్తూ...దేశాన్ని ఈ సమస్య నుంచి బైటపడవేయలేదు.

('దేశాభిమాని' సంపాదకీయం)