Aug 06,2023 17:43

ప్రజాశక్తి-కాకినాడ : డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌ లైన్‌తో పాటు ఆఫ్‌ లైన్‌లో కూడా తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ పీఆర్‌ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్‌ తిరుపారుణ్యంకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం. గంగా సూరిబాబు మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ ఫలితాలు వచ్చి మూడు నెలలు అవుతున్న రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్‌ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరుగుతుందన్నారు. విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో ఆన్లైన్లో అప్లికేషన్‌ పెట్టుకోవడంలో గత సంవత్సరం నుండి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆన్లైన్లో ఉన్న తర్వాత మళ్లీ వెబ్‌ ఆప్షన్‌ పెట్టుకోవడం ఏ కాలేజీలో ఏలా పెట్టుకోవాలో తెలియకపోవడంతో అయోమయానికి గురవుతున్నారన్నారు. ఈ సంవత్సరం నుండి డిగ్రీలో మేజర్‌, మైనర్‌ సభ్యులు గందరగోళంతో విద్యార్థులు ఏ సబ్జెక్టు ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా గందరగోళం ఏర్పడుతోందన్నారు. కావున డిగ్రీ కళాశాలలో అడ్మిషన్‌ ప్రక్రియ ఆన్లైన్‌ తో పాటుగా ఆఫ్లైన్లో కూడా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఆన్లైన్లో అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఫీజులు కట్టించుకోవడానికి కళాశాలలో డైరెక్ట్‌గా కట్టించుకోకపోవడంతో ఆన్లైన్లో ఫీజు పేమెంట్‌ చేయడం ఈరోజుకి రెండు రోజులు కావస్తున్న ఆన్లైన్లో ఫీజు పేమెంట్‌ సంబంధించి యాప్‌ ఓపెన్‌ కావడం లేదన్నారు. కావున విద్యార్థుల పరీక్ష ఫీజును ఆఫ్‌ లైన్‌ లో చెల్లించే విధంగా సౌకర్యం కల్పించాలని కోరడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నగర నాయకులు సంజరు, సాహిత్‌, వాసు, అభిషేక్‌, శివ, ఉమాశంకర్‌, తేజ, ఆదర్శ, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.